7 రోజులు.. 75 మందితో 75 కిలోమీటర్లు

ABN , First Publish Date - 2022-08-10T09:40:06+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు.

7 రోజులు.. 75 మందితో 75 కిలోమీటర్లు

75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మేము సైతం అంటూ భార్య నిర్మల, కూతురు జయారెడ్డి


సంగారెడ్డి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మండలం ఆరూరులో ఆయన ప్రారంభించిన పాదయాత్ర 7 రోజుల పాటు 75 మందితో 75 కిలోమీటర్లు సాగనుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల మీదుగా ఈ నెల 15వ తేదీ సాయంత్రంతో పాదయాత్ర ముగిసేలా జగ్గారెడ్డి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో మేము సైతం అంటూ జగ్గారెడ్డి భార్య, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి, కూతురు జయారెడ్డి  పాల్గొంటున్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ, బాబూ జగ్జీవన్‌రామ్‌, అల్లూరి సీతా రామరాజు, చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌, వల్లభాయ్‌ పటేల్‌, అంబేడ్కర్‌ వంటి ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందన్నారు. గాంధీజీ అహింసా మార్గంలో.. బ్రిటిష్‌ వారిని దేశం నుంచి తరిమికొట్టారన్నారు.


స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ, నెహ్రూ 15 సంవత్సరాల పైగా జైలు జీవితం గడిపారని పేర్కొన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైతం జైలు జీవితం గడిపారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. వీరందరి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే ఈ రోజు దేశం అనేక రంగాల్లో ముందున్నదని అన్నారు. గ్రామాభివృద్ధే దేశ అభివృద్ధి అని, రైతులు అభివృద్ధి చెందితేనే దేశ అభివృద్ధి సాధ్యమని నమ్మిన నేతలు గాంధీ, నెహ్రూ అని కీర్తించారు. బ్యాంకులను జాతీయం చేసి వాటిని పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇందిరా గాంధీదని కొనియాడారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కారణంగా దేశంలోకి టెక్నాలజీ వచ్చిందని అన్నారు. దేశంలో కులాలు, మతాలు సమన్వయంతో ఉంటున్నాయంటే అది గాంధీ, నెహ్రూ వేసిన బాటనే అని పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని.. ఆయన అడుగుజాడల్లో కాంగ్రెస్‌ పార్టీ నడుస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, సమాజం శాంతియుతంగా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-08-10T09:40:06+05:30 IST