Omicron ఎఫెక్ట్.. విదేశాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు!

ABN , First Publish Date - 2022-01-08T12:57:24+05:30 IST

ఒమైక్రాన్‌ కారణంగా ఓవైపు దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ.. మరోవైపు విదేశాల నుంచి వస్తున్నవారిలో భారీగా పాజిటివ్‌లు.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో శుక్రవారం మార్గదర్శకాలను సవరించింది. విదేశాల నుంచి వచ్చే అందరికీ 7 రోజుల హోం క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది.

Omicron ఎఫెక్ట్.. విదేశాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు!

7 రోజుల హోం క్వారంటైన్‌ తప్పనిసరి

మార్గదర్శకాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఒమైక్రాన్‌ కారణంగా ఓవైపు దేశవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ.. మరోవైపు విదేశాల నుంచి వస్తున్నవారిలో భారీగా పాజిటివ్‌లు.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో శుక్రవారం మార్గదర్శకాలను సవరించింది. విదేశాల నుంచి వచ్చే అందరికీ 7 రోజుల హోం క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. ఎనిమిదో రోజు కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 11 నుంచి అమల్లోకి రానున్న తాజా మార్గదర్శకాలు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొనసాగుతాయి. ‘ముప్పు’ జాబితా దేశాల నుంచి వచ్చేవారు నమూనాలను విమానాశ్రయంలో పరీక్షకు ఇచ్చి, ఫలితం వచ్చేవరకు నిరీక్షించాలన్న పాత నిబంధన కొనసాగనుంది. నెగెటివ్‌ వస్తే.. ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండి, 8వ రోజు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకోవాలి. అప్పటికీ నెగెటివ్‌గా తేలితే.. మరో వారం పాటు ఆరోగ్యాన్ని స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. అనంతరం నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఒకవేళ పాజిటివ్‌ వస్తే ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. సముద్ర మార్గాల ద్వారా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకూ ఇవే మార్గదర్శకాలు వర్తిస్తాయి. కాగా, ముప్పు జాబితాలో లేని దేశాల నుంచి వచ్చేవారిలో 2 శాతం ప్రయాణికులు ర్యాండమ్‌ టెస్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పాజిటివ్‌ వచ్చిన విదేశీ ప్రయాణికుల కమ్యూనిటీ కాంటాక్టులను 14 రోజులు క్వారంటైన్‌ చేస్తారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. అన్ని ఆస్పత్రుల్లోని వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్ల తదితర పరికరాల పనితీరును సమీక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. 


214 రోజుల తర్వాత లక్ష కేసులు

దేశంలో గురువారం 1,17,100 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. కొత్త కేసులు లక్ష దాటడం 214 రోజుల తర్వాత ఇదే తొలిసారి. ఒమైక్రాన్‌ మొత్తం 27 రాష్ట్రాలకు వ్యాపించింది. పాజిటివ్‌లు 3,007కు పెరిగాయి. ఇటలీ రాజధాని రోమ్‌ నుంచి శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ చేరిన విమానంలో 173 మందికి పాజిటివ్‌ వచ్చింది. కొవిడ్‌ టీకా పంపిణీ దేశంలో శుక్రవారం 150 కోట్ల డోసుల మైలురాయికి చేరుకుంది.  అర్హుల్లో 91 కోట్ల మంది కనీసం ఒక డోసు, 66 శాతం రెండో డోసులూ తీసుకున్నారు.


కొవ్యాక్సిన్‌తో రీఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ

రెండో వేవ్‌లో కొవ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలకు రీ ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షణ లభించిందని ఢిల్లీ ఎయిమ్స్‌ అధ్యయనంలో తేలింది. 2021 జూన్‌ వరకు కొవిడ్‌ బారినపడిన 4,978 మంది ఆరోగ్య కార్యకర్తలపై అధ్యయనం చేయగా 124 మందికే రీఇన్ఫెక్షన్‌ వచ్చినట్లు రుజువైంది. మొదటి 180 రోజులలో వారికి రీ ఇన్ఫెక్షన్‌ ముప్పు ఎక్కువగా ఉండగా, ఆ తర్వాత క్రమంగా తగ్గింది. 


ఒమైక్రాన్‌తోనూ మరణాలు: డబ్ల్యూహెచ్‌వో  

‘‘గత వేరియంట్లలాగానే ఒమైక్రాన్‌ కూడా ఆస్పత్రిపాలు చేస్తోంది. మరణాలకు కారణమవుతోంది’’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ అథనమ్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమైక్రాన్‌ వేగ వ్యాప్తి వల్ల కేసుల సునామీ వస్తోందని.. ఆరోగ్య వ్యవస్థలపై భారం పెరిగిపోతోంద ని అన్నారు. వారంలో 95 లక్షల కేసులు నమోదయ్యాయని.. ఇది 71 శాతం అధికమని టెడ్రోస్‌ తెలిపారు.  


మహారాష్ట్రలో 41 వేల కొత్త కేసులు

మహారాష్ట్రలో శుక్రవారం 41 వేల కేసులు వచ్చాయి. ముంబైలో రెండో రోజూ 20 వేలు దాటాయి. కర్ణాటకలో ఒక్కరోజే 68 శాతం పెరిగి 8,448 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 17,335 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కాగా, నటులు త్రిష, సత్యరాజ్‌తో పాటు దర్శకుడు ప్రియదర్శన్‌కు కరోనా సోకింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని త్రిష ట్వీట్‌ చేశారు.

Updated Date - 2022-01-08T12:57:24+05:30 IST