2030 నాటికి అందుబాటులోకి 6జీ

ABN , First Publish Date - 2022-05-18T07:58:02+05:30 IST

భారత్‌లో 2030 నాటికి 6జీ టెలికం నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానున్నదని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.

2030 నాటికి అందుబాటులోకి 6జీ

సెప్టెంబరుకల్లా 5జీ నెట్‌వర్క్‌ సేవలు

పెద్దసంఖ్యలో ఉద్యోగాలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, మే  17:  భారత్‌లో  2030 నాటికి 6జీ టెలికం నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానున్నదని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నెట్‌వర్క్‌ ప్రారంభమైతే హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వినియోగదారులకు అందుబాటులోకి రానుందన్నారు. మంగళవారం జరిగిన టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) రజతోత్సవ కార్యక్రమంలో  మాట్లాడుతూ.. కొన్ని నెలల్లోనే 5జీని ప్రారంభించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. కాగా, వచ్చే జూన్‌ నాటికి 5జీ స్పెక్ట్రమ్‌ వేలం జరగనుందని తెలుస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తే వచ్చే 15 ఏళ్లలో భారత ఆర్థికవ్యవస్థ సుమారు 35 లక్షల కోట్ల మేర విస్తరించనుందని అంచనా అని మోదీచెప్పారు. తొలిదశలో అందుబాటులోకి రానున్న నగరాల్లో హైదరాబాద్‌,ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, చండీగఢ్‌, అహ్మద్‌నగర్‌, లఖ్‌నవూ, గాంధీనగర్‌ కూడా ఉన్నాయి. మరోవైపు, 5జీ  ఉద్యోగాలను కూడా సృష్టించనుందని ప్రధాని మోదీ చెప్పారు.  6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటికే పని ప్రారంభించిందని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2జీ కాలంనాటి అవినీతి, పక్షపాత విధానాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మా సర్కార్‌ చేసిన ప్రయత్నాలు కొత్త నమ్మకాన్ని కలిగించాయి. ఫలితంగా 2014నాటి ముందు పరిస్థితితో పోల్చుకుంటే గత 8 ఏళ్లలో టెలికం రంగంలో ఒకటిన్నర రెట్లు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి’’ అని మోదీ చెప్పారు. ‘‘ 2014కి ముందు కనీసం 100 గ్రామ పంచాయతీలకు కూడా  ఆప్టిక్‌ ఫైబర్‌ కనెక్టివిటీ సదుపాయం లేదు. ప్రస్తుతం దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు బారండ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ సౌకర్యాలున్నాయి.’’ అని ప్రధాని వివరించారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద మొబైల్‌ తయారీ కేంద్రంగా ఉందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం వల్ల.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన టెలికం డేటా చార్జీలున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా మారిందని అన్నారు.  

Updated Date - 2022-05-18T07:58:02+05:30 IST