Advertisement
Advertisement
Abn logo
Advertisement

65 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి.. 35 ఏళ్ల తర్వాత నెరవేరిన అతడి కల..!

ఇంటర్నెట్ డెస్క్: జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నదో ప్రేమ జంట. కానీ వాళ్ల కల కలగానే మిగిలిపోయింది. యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే పెళ్లి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె కూడా ఆ పెళ్లికి తలొంచక తప్పలేదు. ప్రేయసికి వేరే అతడితో పెళ్లి జరిగినా.. అతడు మాత్రం ఆమెనే మనసులో ఆరాధిస్తూ ఉండిపోయాడు. పెళ్లి అనే మాటనే మరచిపోయాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 ఏళ్ల పాటు తన మనసులోనే ప్రేయసిని తలచుకుంటూ జీవించాడు. అయితే ప్రేయసి భర్త చాన్నాళ్ల క్రితమే చనిపోయాడనీ, ఆమె ఇప్పుడు బంధువుల ఆసరాతో బతుకుతోందని అతడికి తెలిసింది. 


అంతే, అతడు అస్సలు ఆలస్యం చేయలేదు. వెంటనే ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్లాడు. నేను బతికి ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటా.. నన్ను పెళ్లి చేసుకుంటావా.. అని లేటు వయసులో లేటెస్ట్‌గా పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఆమె కాస్త జంకినా.. ఒకటికి నాలుగు సార్లు అతడు మరీ మరీ అడగడంతో, బంధువులు కూడా ఈ వృద్ధాప్యంలో ఒకరికి మరొకరు తోడుగా ఉంటారని చెప్పడంతో ఆమె కూడా సరేనంది. మొత్తానికి 65 ఏళ్ల వయసులో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాదు కాదు.. 35 ఏళ్ల తర్వాత తన ప్రేయసిని పెళ్లి చేసుకుని తన కలను నెరవేర్చుకున్నాడా వ్యక్తి. ఏంటీ.. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా..? మాధవన్ హీరోగా నటించిన మారా సినిమా కథను చెప్తున్నారేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇది రీల్ స్టోరీ కాదు.. రియల్ స్టోరీ.. ఎక్కడ జరిగిందో.. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెకు చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ యుక్త వయసు నుంచే ప్రేమించుకున్నారు. అయితే జయమ్మ కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె వేరే పెళ్లి చేసుకుంది. ప్రేయసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకన్నప్పటికీ.. చిక్కణ్ణ మాత్రం ఆమెను మరిచిపోలేదు. ఆ జ్ఞాపకాలనే తలచుకుంటూ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. అలా ఏకంగా 35 ఏళ్లు గడిపాడు. అయితే కొంత కాలానికి జయమ్మ భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ విషయం చిక్కణ్ణకు చాన్నాళ్లకు తెలిసింది. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్లాడు. 65 ఏళ్ల వయసున్న చిక్కణ్ణ... జయమ్మ దగ్గరికి వెళ్లి లేటెస్ట్‌గా ప్రపోజ్ చేశాడు. తనని పెళ్లి చేసుకోమని.. బతికున్నంత వరకు తోడుంటానని ప్రియురాలికి చెప్పాడు. దీనికి ఆమె ఒప్పుకోవడంతో గురువారం మేలుకోటె చెలువనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో శాస్త్రోక్తంగా ఇద్దరూ ఒకటయ్యారు. అనంతరం చిక్కణ్ణ సంప్రదాయం ప్రకారం అరుంధతీ నక్షత్రాన్ని భార్యకు చూపించాడు. లేటు వయసులో లేటెస్ట్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement