న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) బీజేపీ(BJP)పై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ నగరంలో జనాల ఇళ్లు, షాపుల కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. బుల్డోజర్ల కూల్చివేతలు ఇదే విధంగా కొనసాగితే 63 లక్షల మంది ఆవాసాలు, దుకాణాలను కూల్చాల్సి ఉంటుందని మండిపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) కూల్చివేతలను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. కూల్చివేతల్లో గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి.. 80 శాతం ఢిల్లీ కూల్చివేతల పరిధిలోకి వస్తుంది. రెండవది.. ప్రజలు తమ ఆస్తుల పత్రాలను చూపిస్తున్నా కనికరం లేకుండా విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలోని చిన్నచిన్న కాలనీలు, మురికివాడలను కూల్చివేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇళ్లు కట్టిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడు జనాల ఆవాసాలను కూల్చివేస్తోందని విమర్శలు గుప్పించారు.