బెంగళూరు: హిజాబ్ వివాదం, హిందూ పండుగల్లో ముస్లిం దుకాణదారులపై నిషేధం వంటి వరుస పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి 61 మంది ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. వీరిలో రచయితలు, సామాజిక కార్యకర్తలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో వారంతా కోరారు. భగవద్గీతను రాష్ట్ర పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడానికి బదులు విద్యార్థులకు రాజ్యాంగం గురించి నేర్పించాలని కూడా వారు సూచించారు.
ఇవి కూడా చదవండి
హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను పాఠశాలల్లోకి అనుమతించకుండా విధించిన నిబంధనలను ఉపసంహరించుకోవాలని, వార్షిక ఆలయ ఉత్సవాల సమయంలో ముస్లిం దుకాణదారులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ లేఖలో వీరంతా సీఎంకు విజ్ఞప్తి చేశారు. కె.మరులుసిద్ధప్ప, ప్రొఫెసర్ ఎస్జీ సిద్ధరామయ్య, బంజగెరె జయప్రకాష్ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
''పేద ముస్లిం విద్యార్థులకు తమ హక్కు అయిన విద్యను అందకుండా చేసేందుకు హిజాబ్ వివాదాన్ని అతివాద శక్తులు విజయవంతంగా వాడుకుంటున్నాయి. రెండేళ్ల కోవిడ్ మహమ్మారి తర్వాత తెరుచుకున్న విద్యాసంస్థలు వివాదాలతో కలుషితమవుతున్నాయి. పాఠ్యాంశాల్లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బదులుగా రాజ్యాంగం గురించి నేర్పించే సిలబస్ అవసరమని మా అభిప్రాయం'' అని ఆ లేఖలో 61 మంది ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలపై ఇప్పటికే కోవిడ్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వేతనాల కోత వంటి భారాలు పడ్డాయని, ఈ తరుణంలో శాంతి, సామరస్యాలకు అనునిత్యం భంగం కలుగుతుంటే అది మరింత నిరుత్సాహకర పరిణామం కావచ్చని వారు అభిప్రాయపడ్డారు.