న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద మూడు రాష్ట్రాలకు కేటాయించిన ఇళ్లలో సుమారు 6,000 ఇళ్లు రద్దయ్యాయి. ఇళ్లు రద్దయిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, కేరళ, లడఖ్ ఉన్నాయి. సరైన వెరిఫికేషన్ లేకపోవడం, మరణాలు, మెగ్రేషన్ లేదా లబ్ధిదారుల డూప్లికేట్ ఎంట్రీ, నిబంధనలు పాటించకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు.
రెండు ఏహెచ్‌పీ ప్రాజెక్టుల్లో 1,740 ఇళ్లు, స్లమ్ డవలప్మెంట్ ప్రాజెక్టులో 960 ఇళ్లు, 45 బీఎల్సీ (బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్) ప్రాజెక్టుల్లో 1,711 ఇళ్లు రద్దుకు మధ్యప్రదేశ్ ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన సెంట్రల్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్ సర్కార్ ఈ ప్రతిపాదన చేసింది. అలాగే కేరళలో 1,047 ఇళ్లను కమిటీ రద్దు చేసింది. కాగా, కార్గిల్, లెహెలలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లిన మానిటరింగ్ కమిటీ లబ్ధిదారుల్లో చాలా మందికి పక్కా, పాక్షిక-పక్కా గృహాలు ఉన్నాయని గుర్తించింది. దీంతో 404 ఇళ్ల రద్దుకు ప్రతిపాదించింది.