పులిని చూడగానే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. కానీ కళ్లముందే భర్తపై పులి అటాక్ చేస్తే ఈ వృద్ధురాలు ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-12-14T20:24:17+05:30 IST

పై ఫొటోలోని వృద్ధులిద్దరూ పులితో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నారు.

పులిని చూడగానే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. కానీ కళ్లముందే భర్తపై పులి అటాక్ చేస్తే ఈ వృద్ధురాలు ఏం చేసిందంటే..

పై ఫొటోలోని వృద్ధులిద్దరూ పులితో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నారు. హఠాత్తుగా పెద్దపులి పైన పడినా బెదరకుండా పోరాడారు. ముందు భార్యను భర్త రక్షిస్తే.. ఆ తర్వాత భర్తను భార్య కాపాడింది. బీహార్‌లోని ముజఫరానగర్‌కు సమీపంలోని బాగా ప్రాంతానికి చెందిన పరాస్ జైన్, కమలా దేవి దంపతులు సోమవారం ఉదయం తమ చెరుకు తోటను చూసేందుకు పొలానికి వెళ్లారు. పరాస్ పని చేస్తుండగా.. కమలా దేవి గట్టుపైన కూర్చుని ఉంది. 


సమీపంలోని అడవి నుంచి వచ్చిన ఓ పెద్ద పులి కమలా దేవిపై దాడి చేసింది. పక్కనే ఉన్న పరాస్ గునపం తీసుకుని పులిని బెదిరించాడు. దీంతో ఆ పులి కమలా దేవిని వదిలేసి పరాస్‌పై దాడికి దిగింది. పరాస్ చేయి పట్టుకుని కొంతదూరం లాక్కెళ్లింది. అప్పుడు కమలా దేవి పెద్దగా అరుచుకుంటూ పులి వెంట పరిగెత్తింది. కమలా దేవి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు కర్రలు, బరిసెలు పట్టుకుని వెంబడించారు. దీంతో ఆ పులి పరాస్‌ను వదిలేసి అడవిలోకి పారిపోయింది. 


అప్పటికే పరాస్ చేతిని పులి నమిలేసింది. దీంతో వెంటనే పరాస్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయం కావడంతో చేతిని తొలగించాలని వైద్యులు భావిస్తున్నారు. కాగా, వీరిని వదిలేసి పారిపోయిన పులి రెండు గంటల తర్వాత మరొకరిపై దాడి చేసింది. ఓ 50 ఏళ్ల వ్యక్తి వీపుపై పంజాతో కొట్టింది. దీంతో అతను కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

Updated Date - 2021-12-14T20:24:17+05:30 IST