ఆ కేటగిరీ ప్రవాసుల Work Permit రెన్యువల్.. ఎప్పట్నుంచంటే..?

ABN , First Publish Date - 2022-01-26T14:29:17+05:30 IST

60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల రెన్యువల్ ఫీజును కువైత్ సోమవారం ప్రకటించింది.

ఆ కేటగిరీ ప్రవాసుల Work Permit రెన్యువల్.. ఎప్పట్నుంచంటే..?

కువైత్ సిటీ: 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల రెన్యువల్ ఫీజును కువైత్ సోమవారం ప్రకటించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ ఫీజును 250 కువైటీ దినార్లుగా(సుమారు రూ.61వేలు) నిర్ణయించింది. దీంతో ఇప్పుడు వలసదారులకు వర్క్ పర్మిట్ రెన్యువల్ ప్రాసెస్ ప్రారంభించడమే తరువాయిగా మిగిలి ఉంది. కాగా, అధికారిక సమాచారం ప్రకారం ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ వచ్చే ఆదివారం(జనవరి 30) నుంచి ప్రారంభం కానుంది. ఇదిలాఉంటే.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఫీజు విషయమై పీఏఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయా కంపెనీలు ఇచ్చే ఆఫర్లను బట్టి ఈ రుసుము నిర్ణయించనున్నారు. 


అయితే, ఈ పాలసీ ధర సంవత్సరానికి 400 నుంచి 500 కువైటీ దినార్ల(రూ.98వేలు నుంచి రూ.1.23లక్షలు) మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, ఇటీవల ఈ కేటగిరీ ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ ఫీజు విషయమై పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిపి ఏడాదికి వెయ్యి కువైటీ దినార్లు(రూ.2.46లక్షలు) ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన ప్రముఖంగా వినిపించింది. ఇక తాజా నిర్ణయంతో కువైత్‌లో అధికంగా ఉండే భారత ప్రవాసులకు భారీ ఉపశమనం లభించింది. పీఏఎం నిర్ణయం పట్ల అక్కడి ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు సందిగ్ధంలో పడేసిన మంచి నిర్ణయం తీసుకుందని పీఏఎంను ప్రశంసిస్తున్నారు. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయం కేవలం ఏడాది కాలానికి మాత్రమే వర్తిస్తుందని ఆ దేశ మంత్రి ఒకరు పేర్కొన్నారు. మళ్లీ తర్వాతి ఏడాది నుంచి మరో కొత్త రుసుము తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదని తెలిపారు. 

Updated Date - 2022-01-26T14:29:17+05:30 IST