60లక్షల మంది పిల్లలు!

ABN , First Publish Date - 2021-06-20T09:23:44+05:30 IST

రాష్ట్రంలో విద్యాసంస్థలను జూలై 1 నుంచి ప్రారంభించుకోవొచ్చంటూ ప్రభుత్వం అనుమతించడం చర్చకు తావిచ్చింది.

60లక్షల మంది పిల్లలు!

  • విద్యాసంస్థలకు అంతమంది పిల్లలొస్తే పరిస్థితి ఏమిటి?.. 
  • బడులు, కాలేజీల్లో కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేనా? 
  • తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన


హైదరాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాసంస్థలను జూలై 1 నుంచి ప్రారంభించుకోవొచ్చంటూ ప్రభుత్వం అనుమతించడం చర్చకు తావిచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో నేరుగా ప్రత్యక్ష తరగతులకు సర్కారు అనుమతించడంపై విద్యాశాఖలోని ఉన్నతాధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు టీకాలు అందుబాటులోకి రాకపోవడం.. కరోనా థర్డ్‌వేవ్‌ పిల్లలకు ప్రమాదకరం అంటూ హెచ్చరికలొచ్చిన నేపథ్యంలో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది! సర్కారు నిర్ణయంతో జూలై 1 నుంచి కేజీ టు పీజీ దాకా అన్ని రకాల విద్యాసంస్థలకు పిల్లలు హాజరయ్యే అవకాశాలున్నాయి. 


రాష్ట్ర వ్యాప్తంగా 1-10 తరగతులకు చెందిన పిల్లలు దాదాపు 30 లక్షల దాకా ఉంటారు. ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటిఐ, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసి, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య 35 లక్షల దాకా ఉంది. ఈ లెక్కన కేజీ టు పీజీ మొత్తం విద్యార్థుల సంఖ్య రాష్ట్రంలో 65 లక్షల దాకా ఉంటుంది. ఇంజినీరింగ్‌, డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు జరగకపోవడంతో వారిని మినహాయిస్తే దాదాపు 60 లక్షల మంది జూలై-1 నుంచి రోజూ ప్రత్యక్ష తరగతులకు హాజరు అవుతారు. ఒకేసారి ఇంత మందికి కొవిడ్‌ నిబంధనలు పాటించి పాఠాలను బోధించడం సాధ్యమయ్యే పనేనా? అనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు గూమిగూడొద్దని, వివాహాది శుభకార్యాలకు 50కి మించి అనుమతించమని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలంటూ ఇప్పటివరకు నిబంధనలు కఠినంగా అమలుచేసిన ప్రభుత్వం ఒకేసారి అన్ని విద్యాసంస్థలను అనుమతించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


44 రోజుల్లో 3వేలమందికి కొవిడ్‌ 

ఈ సందర్భంగా నాలుగు నెలల క్రితం బడులు తెరవడంతో ఎదురైన అనుభవాలను విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతులతో పాటు ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకూ ప్రత్యక్ష తరగతులకు ప్రభుత్వం అనుమతించింది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, తరగతి గదులను శానిటైజ్‌ చేస్తూ ఉండాలని, కొవిడ్‌ నిబంధనలను పాటించాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయినా కూడా పాఠశాలలు, కాలేజీలు, గురుకులాల్లో పెద్ద సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో ఒకేసారి 50కి పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగటంతో ఫిబ్రవరి-1 నుంచి ప్రారంభమైన ప్రత్యక్ష తరగతులను మార్చి-24న రద్దుచేయాల్సి వచ్చింది. ప్రత్యక్ష తరగతులు జరిగిన 44 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3వేల విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. 


కొన్ని రోజులకు కోలుకున్నారు. అయితే ఈసారి కొవిడ్‌ మూడోదశ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందున్న నిపుణుల హెచ్చరికలను విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. విద్యాసంస్థలను విడతలవారీగా కాకుండా ఒకేసారి ప్రారంభించాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో కేసులు ఒక్కసారిగా పెరగడంతో బెడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని. అలాగే ఒకేసారి విద్యార్థులు పెద్దఎత్తున కొవిడ్‌ బారినపడితే పరిస్థితి ఏమిటని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఇంతవరకు పది, ఇంటర్‌ వార్షిక పరీక్షలు కూడా జరగలేదని, కొత్త విద్యాసంవత్సరాన్ని కూడా ఆన్‌లైన్‌ ద్వారా కొనసాగించాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర సహా దేశంలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ ప్రత్యక్ష తరగతులు ప్రారరంభం కాలేదని గుర్తుచేస్తున్నారు. అయితే 15 నెలల తర్వాత బడులు ప్రారంభమవుతాయని తెలియడంతో ఇప్పటిదాకా ఆన్‌లైన్‌ తరగతులతో విసుగెత్తిన విద్యార్థుల్లో సహజంగానే సంతోషం వ్యక్తమవుతోంది.

 

ఉపాధ్యాయ సంఘాల్లో మిశ్రమ స్పందన 

ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా సంఘాలు స్వాగతించాయి. ప్రత్యక్ష తరగతులతో గత ఏడాది కాలంగా చదువులకు దూరంగా ఉన్న విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని టీఎస్‌ యూటీఎప్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జంగయ్య, చావ రవి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం స్వాగతించింది.  1-5 తరతగతుల ప్రాథమిక విద్యార్థులకు తరగతులు ప్రతిరోజు కాకుండా రోజువిడిచి రోజు నిర్వహించాలని తెలంగాణ ఎస్జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మహ్మద్‌ ఖమరుద్దీన్‌, వి.చంద్రారెడ్డి కోరారు. కాగా పాఠశాలల ప్రారంభం తొందరపాటు నిర్ణయమని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం పేర్కొంది. విద్యార్థులందరికీ వ్యాక్సిన్‌ వేయించిన తర్వాతనే ప్రత్యక్ష పాఠాలకు అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 


సాహసోపేత నిర్ణయం: ట్రస్మా 

విద్యాసంస్థలను ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు యాజమాన్యాల సంఘం (ట్రస్మా) హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేటు బడుల కష్టాలు తీరుతాయని ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి శేఖర్‌ రావు, మధుసూదన్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-20T09:23:44+05:30 IST