Abn logo
Sep 26 2021 @ 00:28AM

60 కేజీల గంజాయి స్వాధీనం

కోదాడలో వివరాలు వెల్లడిస్తున్న సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ సైదులు

కోదాడ రూరల్‌, సెప్టెంబరు 25: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని తెలంగాణ-ఆంధ్రా సరిహద్దు రామాపురంలో పోలీసులు 60కేజీల గంజాయిని శనివారం స్వాధీనం చేసు కున్నారు. రూరల్‌ సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకా రం... విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న మూడు ప్రైవేట్‌ బస్సుల్లో గంజాయి తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున రాష్ట్ర సరిహద్దులో బస్సులను తనిఖీ చేశారు. మహారాష్ట్ర, బీహార్‌ రాష్ర్టాలకు చెందిన మహ్మద్‌ మోహిద్‌ వద్ద 30కేజీలు, సూరజ్‌ నుంచి 12కేజీలు, అక్షయ్‌, లక్ష్మణ్‌ వద్ద నుంచి 18కేజీలు, మొత్తం 60కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు ఈ గంజాయిని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందిన కిషన్‌ వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్‌ మియాపూర్‌లోని బబ్లూ, చింతపల్లి లింగాకు అప్పగించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తహసీల్దార్‌ శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించినట్లు సీఐ తెలిపారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. మిగిలిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన్నట్లు పేర్కొన్నారు. 

రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

మిర్యాలగూడ అర్బన్‌: రైలుమార్గంలో గంజాయి అక్రమరవాణా జరుగుతున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో ముగ్గురు సీఐలు, 120మంది పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్‌వైపు వెళ్తూ స్థానిక రైల్వేస్టేషన్‌కు చేరుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీల్లో  పోలీసులు సోదాలు నిర్వహిస్తూ నల్లగొండ వరకు ప్రయాణించారు. అదేవిధంగా ప్రయాణికులు తెచ్చుకున్న లగేజీ బ్యాగులను పరిశీలించారు. ప్రయాణికులు సహకరించాలని డీఎస్పీ కోరారు.