చాణక్య నీతి: ఈ 6 విషయాలు మనిషిని లోలోన కుంగిపోయేలా చేస్తాయి.. అవేమిటో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-28T13:01:26+05:30 IST

ఆచార్య చాణక్య ప్రముఖ మేధావిగా..

చాణక్య నీతి: ఈ 6 విషయాలు మనిషిని లోలోన కుంగిపోయేలా చేస్తాయి.. అవేమిటో తెలిస్తే..

ఆచార్య చాణక్య ప్రముఖ మేధావిగా ప్రసిద్ధి చెందాడు. మనదేశపు తొలి ఆర్థికవేత్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. చాణక్యుని విధానాలను అనుసరించిన కారణంగానే.. చంద్రగుప్త మౌర్య ప్రముఖ చక్రవర్తి కాగలిగాడు. మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేసిన ఆచార్య చాణక్య.. ఆనందాన్ని, శాంతిని హరింపజేసే 6 విషయాల గురించి కూడా తెలిపారు. ఇవి మనిషిని లోలోన కుంగిపోయేలా చేస్తాయని కూడా హెచ్చరించాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


అక్కడ అనుక్షణం హానికరం

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి తాను అపఖ్యాతి పాలైన ప్రాంతంలో ఇంకా నివాసం కొనసాగించడం అతనికి అత్యంత ప్రమాదకరమని చెప్పాడు. అతను ఎంత పరోపకార భావనతో ఉన్నా ఆ ప్రాంతంలో నివసించడం అతనికే కాదు.. అతని కుటుంబానికి కూడా ప్రమాదకరమని హెచ్చరించాడు. అలాంటి ఊరిలో నివసిస్తూంటే అనుక్షణం భయం, బాధ, అవమానాలతో కాలం గడపాల్సివస్తుందని  చాణక్య తెలిపారు. ఎందుకంటే ఆ ఊరిలో ఉండే కొందరు దుర్మార్గులు ఆ వ్యక్తిని హింసిస్తూనే ఉంటారని చాణక్య పేర్కొన్నారు. 

నీచుల సహవాసంతో నరకం

చాణక్య తన నీతిలో.. నీచమైన పనులు చేసే వారికి సేవ చేయడం అధర్మంగా పరిగణించాలని పేర్కొన్నారు. చెడు చేసేవారు కోపంతో రగిలిపోతుంటారు. వారి మాటలు ఎప్పుడూ కటువుగా ఉంటాయి. అలాంటి వారితో సహవాసం చేయడం ద్వారా ఇతరులకు దుర్మార్గపు లక్షణాలు అలవడుతాయి. అందుకే మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసే వ్యక్తులకు సహకారం అందించవద్దని చాణక్య తెలిపారు. అలాకాదని నీచులతో సహవాసం కొనసాగిస్తే అది ఎప్పటికైనా నరకప్రాయమవుతుందని చాణక్య హెచ్చరించారు. 

ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం

ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. మనిషికి ఆరోగ్యమే అతి పెద్ద ఆస్తి. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో కాలం గడుపుతాడని చాణక్య హెచ్చరించారు. ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు పోకడలు ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. కరోనా వంటి వైరస్‌ను ఓడించాలంటే, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలి, అందుకోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. 


గయ్యళి భార్యతో గందరగోళం

భార్య గయ్యాళితనంతో ప్రవర్తిస్తే, లేదా ఇతరులను నొప్పించేలా మాట్లాడుతున్నట్లయితే భర్త ఎవరికీ చెప్పుకోలేని గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. గయ్యాళితనం ఒక చెడు అలవాటు. అలాంటి భార్యతో కాపురం చేసే భర్త లోలోన కుంగిపోతుంటాడు. పైగా ఎప్పుడూ గొడవలు, వాదోపవాదాలు ఉండే ఇంట్లో దేవతలు ఎప్పుడూ నివాసం ఉండరని చాణక్య తెలిపారు. ప్రవర్తన అనేది ఒక వ్యక్తికి లభించే గుర్తింపు అనే విషయాన్ని గుర్తుంచుకుని.. నిత్యం తెలివిగా వ్యవహరించాలని ఆచార్య చాణక్య సూచించారు.

మూర్ఖత్వం ఒక పెద్ద వ్యాధి

మూర్ఖుడు లేదా పద్ధతిగా నడుచుకోని వ్యక్తి  తన తల్లిదండ్రులకు బాధ కలిగించడంతోపాటూ అతనూ ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతుంటాడు. మూర్ఖుడు రెండు కాళ్ల జంతువు అని చాణక్య అభివర్ణించాడు. ఎందుకంటే అతను తన మాటలతో అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. చదువుసంధ్యలు లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని చాణక్య తెలిపారు. 

కుమార్తె వితంతువు కావడం బాధాకరం

దురదృష్టవశాత్తూ కుమార్తె వితంతువుగా మారితే, తండ్రి ఆమెను అటువంటి పరిస్థితిలో చూడలేడని చాణక్య తెలిపారు. తన కూతురు సంతోషంగా లేనపుడు.. తానెలా సంతోషంగా ఉండగలని తండ్రి లోలోన కుమిలిపోతుంటాడని చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-12-28T13:01:26+05:30 IST