చాణక్య నీతి: ఎవరి వైవాహిక జీవితాన్నయినా ఘోరంగా దెబ్బతీసే 6 విషయాలు.. ముదిరితే విడాకులే గతి!

ABN , First Publish Date - 2022-01-04T12:19:40+05:30 IST

పూర్వ కాలంలో వివాహం తర్వాత భార్యా భర్తల బంధం..

చాణక్య నీతి: ఎవరి వైవాహిక జీవితాన్నయినా ఘోరంగా దెబ్బతీసే 6 విషయాలు.. ముదిరితే విడాకులే గతి!

భార్యాభర్తల అనుబంధం అనేది వాహనానికి ఇరువైపులా ఉండే రెండు చక్రాల లాంటిది. ఒకదానికొకటి పరిపూరకరమైనపుడే వాహనం చక్కగా నడుస్తుంది. ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలంటే ఇద్దరి మధ్య మంచి సామరస్యం అవసరం. అలా లేనిపక్షంలో ఆ బంధం బీటలువారుతుంది. భార్యాభర్తల సంబంధంలో అల్లకల్లోలం చెలరేగి.. విడాకుల వరకూ దారితీసే ఆరు ప్రధాన కారణాలను ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో వివరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్వ కాలంలో వివాహం తర్వాత భార్యా భర్తల బంధం జీవితకాలం కొనసాగేది. ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఓర్పు, పరస్పర గౌరవం, పరువు అనే భావన ఉండటం వలన విడాకులు అనే ప్రశ్న తలెత్తేది కాదు. వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలిచేవారు. ఇద్దరిలోని మంచి, చెడులను పరస్పరం అంగీకరించేవారు. అయితే నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య అటువంటి సహనం కనిపించడం లేదు. ఆధునిక జీవితంలో భార్యాభర్తల మద్య కోపం, చికాకు, ఖర్చులు, ఒత్తిడి, అబద్ధాల ధోరణి రాజ్యమేలుతున్నాయి. జనంలో త్యాగ స్ఫూర్తి అంతమైంది. అందరిలో స్వార్థం పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే వైవాహిక జీవితం ముక్కలవుతోంది. విడాకుల కేసులు పెరగడానికి ఇదే ప్రదాన కారణం. ఆచార్య చాణక్య తన చాణక్య నీతి పుస్తకంలో వైవాహిక జీవితాన్ని దెబ్బతీసే ప్రధాన కారణాల గురించి ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు. అలాగే వాటికి పరిష్కారాలను కూడా సూచించారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 



కోపం

కోపం అనేది అది కలిగిన వ్యక్తికి హాని చేయడమే కాకుండా, అతనితో పాటు ఉండేవారితో అతనికిగల అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. భార్యాభర్తలలో ఏ ఒక్కరు కోపంతో రగిలిపోతున్నా వారి వైవాహిక జీవితంలో శాంతి అనేది కొరవడుతుంది. అటువంటి పరిస్థితుల్లోనే వివాదాలు చెలరేగుతాయి. వారి మధ్య  వైవాహిక బంధం బలహీనపడుతుంది. 

గోప్యత

మీరు మీ వైవాహిక జీవితాన్ని మరింత ఆనందంగా గడపాలంటే, మీ దంపతుల మధ్య ఉండే రహస్యాలను గోప్యంగా ఉంచుకోవడం ఉత్తమం. దంపతుల మధ్య తలెత్తే సమస్యల్లో మూడవ వ్యక్తి ప్రమేయం ఉంటే ఆ దంపతుల సమస్య పరిష్కారం అయ్యేందుకు బదులు చిక్కుముడిగా మారిపోతుంది. 

అబద్ధం

భార్యాభర్తల అనుబంధం చాలా సున్నితమైనది. ఇందులో అబద్ధాలకు తావుండకూడదు. అబద్దాలు ఆడేవారి నిజస్వరూపం బయటపడినప్పుడు.. భాగస్వామికి అవతలివారిపై పెట్టుకున్న నమ్మకం మాయమవుతుంది. అప్పుడు భార్యాభర్తల అనుబంధంలో బీటలు మొదలవుతాయి.

ఖర్చులు

ఆదాయాన్ని అనుసరించి భార్యాభర్తలిద్దరూ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాలి. భాగస్వాములలో ఎవరైనా విపరీతమైన ఖర్చులు చేస్తుంటే సమస్యలు తలెత్తుతాయి. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు తప్పవు.

పరిధి

ప్రతి బంధానికి ఒక పరిధి అంటూ ఉంటుంది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ జాగ్రత్తగా మెలగాలి. పరిధులు దాటితే భార్యాభర్తల మధ్య అనుబంధం విచ్ఛిన్నం అవుతుంది. 

ఓర్పు

వైవాహిక జీవితంలో ఒక్కోసారి భార్యాభర్తలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సందర్భాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఆసరాగా ఉండి, పరిస్థితులను ఓపికతో చక్కదిద్దుకోవాలి. దంపతుల మధ్య ఓర్పు నశించినప్పుడు పరిస్థితులు మరింతగా దిగజారిపోతాయి.

Updated Date - 2022-01-04T12:19:40+05:30 IST