గెజిట్‌తో ఆరు జిల్లాలు ఎడారే!

ABN , First Publish Date - 2021-07-28T04:55:49+05:30 IST

కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆరు జిల్లాల ప్రజలకు గొడ్డలిపెట్టు వంటిదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

గెజిట్‌తో ఆరు జిల్లాలు ఎడారే!
కృష్ణా జలాలపై సమావేశమైన టీడీపీ ముఖ్య నేతలు

పోరాడలేక చేతులెత్తేసిన ప్రభుత్వం

కృష్ణా జలాల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి

రాజకీయ లబ్ధి కోసం బలి చేయద్దు : సోమిరెడ్డి

త్వరలో అఖిలపక్ష సమావేశం : బీద


నెల్లూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఆరు జిల్లాల ప్రజలకు గొడ్డలిపెట్టు వంటిదని  టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ గెజిట్‌ కారణంగా భవిష్యత్తులో నెల్లూరుతోపాటు ప్రకాశం, రాయలసీమ జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వ్యవహారం, కేంద్రం తీసుకొచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌, ప్రభుత్వ తీరుతో జిల్లాకు జరుగుతున్న నష్టం.. ఈ అంశాలపై టీడీపీ ముఖ్యనేతలు చర్చించారు. సోమిరెడ్డితోపాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, మరి కొంతమంది నాయకులు నెల్లూరులోని ఎన్టీఆర్‌ భవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ  పెన్నా బేసిన్‌లోని నిప్పులవాగు, కుందునది ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. జలాల విషయంలో తలెత్తిన సమస్యలపై పోరాడలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజల గొంతు కోసేలా ఉన్న గెజిట్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్లు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్వాగతించడం దుర్మార్గమన్నారు. గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకొస్తున్నామని, శ్రీశైలంలోని కృష్ణా డెల్టా దామాషాను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించే అవకాశం ఉండేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యతో ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక ప్రాంతాన్ని బలి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని కళ్ల చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. బీద రవిచంద్ర మాట్లాడుతూ రైతు రాజ్యం, రాజన్న రాజ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో కనీసం వంద రోజులకు కూడా రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. నీరున్నా పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని, ఇప్పుడు పంట వేసిన కొద్ది మంది కూడా ఆందోళనలో ఉన్నారన్నారు. కృష్ణా జలాలపై వైసీపీ, టీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర హక్కుల్లో కేంద్రం జోక్యం చేసుకుంటే ఇక రాషా్ట్రలు ఉండేది ఎందుకని బీద ప్రశ్నించారు. త్వరలోనే సోమిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతాంగాన్ని సమాయత్తం చేసి జరుగుతున్న అన్యాయంపై పోరాడతామని చెప్పారు. ఈ సమావేశంలో నేతలు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, చెంచలబాబుయాదవ్‌, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, రావూరి రాధాకృష్ణమనాయుడు, బొమ్మి సురేంద్ర, వేనాటి సతీష్‌రెడ్డి, రాపూరు సందరరామిరెడ్డి, కొండూరు పాలిశెట్టి, మధుబాబునాయుడు, బీద గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-28T04:55:49+05:30 IST