6 కోట్ల రాళ్లు కావాలి సార్‌

ABN , First Publish Date - 2020-10-24T09:10:49+05:30 IST

రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచే భూముల సమగ్ర సర్వే చేపట్టాలని సీఎం జగన్‌ రెవెన్యూశాఖకు లక్ష్య నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే.

6  కోట్ల రాళ్లు కావాలి సార్‌

ఒక్కో హద్దురాయి రూ.4500

మొత్తం వ్యయం రూ. 27 వేల కోట్లు

సీఎంకు సర్వే విభాగం ప్రజెంటేషన్‌

ఉచితంగానే సర్వే అంటున్న జగన్‌

ఇంత భారం సర్కారు మోయగలదా?

రైతుల నుంచి వసూలుకు యోచన

భూమి రేటు కంటే ఈ ఖర్చే ఎక్కువ

సర్వే లెక్కపై ప్రభుత్వ వర్గాల విస్మయం


ఒక్కో సర్వే నంబరు భూమికి నాలుగు హద్దులు. హద్దుకు ఒకటి చొప్పున నాలుగు రాళ్లు! ఒక్కో రాయి ఖరీదు రూ.4500. నాలుగు పాతితే రూ.18,000. రాష్ట్రవ్యాప్తంగా 1.35 కోట్ల సర్వే నంబర్లున్నాయి. సమగ్ర సర్వే చేసి వాటన్నింటికీ పాతేందుకు ఆరు కోట్ల రాళ్లు కావాలి. సర్వే శాఖ లెక్క ప్రకారం దీనికయ్యే వ్యయం అక్షరాలా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు! అమ్మో... ఇంత భారమా అని ప్రభుత్వ వర్గాలే విస్తుపోతుంటే, ఈ భారం రైతులపై వేస్తే సరిపోతుందని అధికారులు.. సీఎం జగన్‌కు సెలవిచ్చారట! మరి... ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి!


   (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచే  భూముల సమగ్ర సర్వే చేపట్టాలని సీఎం జగన్‌ రెవెన్యూశాఖకు లక్ష్య నిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. సర్వేరాళ్లపై ముఖ్యమంత్రి ఫొటో అతి ఖరీదైన గ్రానైట్‌ రాళ్లపై చిత్రించి ఇప్పటికే ఆయన ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేసిన అధికార యంత్రాంగం, ఈ రాళ్ల విషయంలోనే దిమ్మతిరిగిపోయే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది చేపట్టే భూముల రీ సర్వే కోసం ఆరుకోట్ల సరిహద్దు రాళ్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని, ఒక్కో రాయి ఖరీదు రూ. 4500 ఉంటుందని సంబంధిత అధికారులు గురువారం సమగ్ర భూసర్వేపై జరిగిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రికి అందజేసిన ప్రజంటేషన్‌లో పేర్కొన్నారు.


అంటే, సర్వే రాళ్లకోసం కాస్తాకూస్తా కాదు..27వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన చూసిన ఇతర శాఖాధికారులకు దిమ్మతిరిగిపోయింది. ఇంత మొత్తం ప్రభుత్వం భరిస్తుందా? అన్న ప్రశ్న అక్కడికక్కడే తలెత్తగా, రైతుల నుంచి వసూలు చేద్దామన్న ప్రతిపాదన కూడా వచ్చినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి వద్ద చర్చ జరగలేదు. అయన ఎలాంటి ప్రతిస్పందన చూపలేదు. కానీ అధికారుల పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌లో మాత్రం ఈ అంశాన్ని సవివరంగా పేర్కొన్నారు. ఈ ఖర్చును రైతుల ముక్కుపిండి వసూలు చేసే ఆలోచనేదో చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.


సమగ్ర సర్వే జరగాలంటే సరిహద్దు రాళ్లు తప్పనిసరి. ప్రైవేటు, ప్రభుత్వ భూములకు సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేయాలి. రాళ్లపై రంధ్రాలు చేసి వాటిని కొలతలకోసం ఉపయోగించుకుంటారు. ఓ వైపు కార్స్‌ టెక్నాలజీ, మరోవైపు అత్యాధునిక డ్రోన్స్‌ ఉపయోగించనున్నారు. సర్వేకోసం రోవర్స్‌ కొనుగోలు చేయబోతున్నారు.


ఒరిజినల్‌ ఆర్‌ఎ్‌సఆర్‌ ప్రకారం రాష్ట్రంలోని 17,583 గ్రామాల్లో 1,30,30,298 సర్వే నంబర్లు ఉన్నా యి. వీటితో 2,90,92,995 ఎకరాల విస్తీర్ణం ముడిపడి ఉంది. అయితే వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఎ్‌సఆర్‌లో 1,35, 05,283 సర్వేనంబర్లలో 3,40,23,510 ఎకరాల భూమి ఉన్నట్లు ప్రభుత్వ నివేదిక చెబుతోంది. ప్రతి సర్వే నంబర్‌, వాటి పరిధిలోని సబ్‌ డివిజన్‌లలో సరిహద్దు రాళ్లు పాతాలి. సర్వే ప్రారంభానికి ముందే వీటిని సమకూర్చుకోవాల్సి  ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


మోడళ్లు మూడు.. రేటు ఒకటే!

గతంలో ఎప్పుడో 1925లో సర్వే చేసి రాళ్లు పాతారు. కానీ, ఇప్పుడు అవి లేవు. కనీసం వాటి ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తునే  సరిహద్దు రాళ్లను సమకూర్చుకోవడం అనివార్యం. అయితే వాటి ఖర్చు ఎంతవుతుంది? ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత? ఇందుకు సర్వే అధికారులు ఆ ప్రజంటేషన్‌లో ఓ లెక్క చెప్పారు. మొత్తం మూడు రకాల సర్వే రాళ్ల మోడ ల్స్‌ను ప్రతిపాదించారు.


ఏ మోడల్‌ రాయి అయినా ఒక్కో దానికి రూ. 4500 ఖరీదు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రతిపాదిత  మోడల్స్‌లో ఏ ఒక్కదాన్ని ఆమోదించినా రాళ్ల ఖర్చే వేల కోట్లలో ఉంటుంది. ఈ ప్రజంటేషన్‌ను ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే భూమి ధర కంటే రాళ్ల ఖర్చే భారీగా ఉన్నట్లుగా ఉంది . ఏ రకంగా చూసినా ఆ ప్రతిపాదన సర్కారుపై తట్టుకోలేని, మోయలేనంతటి భారాన్ని మోపేదే. సమగ్ర సర్వే ఆలోచన వచ్చినప్పుడు రాష్ట్రం అంతా చేపట్టడానికి రూ. 2200 కోట్లు ఖర్చు కాగలదని సర్వే శాఖ గతంలో ప్రజంటేషన్‌ ఇచ్చింది. అందులో రాళ్ల ఖర్చు ప్రస్తావన లేనట్లుగా ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాళ్ల వ్యయం కూడా మొత్తం సర్వే ప్రాజెక్టులో భాగంగానే ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.


కానీ తాజా ప్రతిపాదన గణాంకాలను చూస్తే సర్వే బడ్జెట్‌కు, రాళ్ల ఖర్చుకు ఏమాత్రం పోలిక లేకుండా ఉంది. అయితే, ప్రజంటేషన్‌ తయారీలో ఏమైనా క్లరికల్‌ పొరపాట్లు జరిగాయా? ఒక్కో రాయి ఖరీదు రూ. 45కు బదులు రూ. 4500 అని రాశారా? అన్న అనుమానాలు ఉన్నాయి. అదే జరిగితే, అప్పుడు రాళ్ల ఖర్చు రూ. 270 కోట్లు. ఈ సంఖ్య అయినా చాలా పెద్దదే. రీ సర్వే ప్రాజెక్టులో రాళ్ల ఖర్చే రూ. 270 కోట్లు ఉంటుందా? అని సీనియర్‌ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సీఎం దగ్గర జరిగిన సమీక్షలో ఎన్ని సరిహద్దు రాళ్లు కావాలి? వాటి ఖర్చు ఎంత అన్న అంశంపై చర్చ జరగలేదని తెలిసింది. ప్రజంటేషన్‌లో ఈ అంశాలు ఉన్నా చర్చ దీనిపై జరగలేదని సమాచారం. సమగ్ర సర్వేకు ఎ టెక్నాలజీ వాడాలి? దానికి ఏ పేరు ఖరారు చేయాలి? అన్న అంశాలపై  ఎక్కువ చర్చ జరిగిందని, ఈ అంశం చర్చకు రాలేదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 


ఒక వేళ ఈ అంశంపై చర్చ జరిగి ఉంటే  సీఎం ఆ అంశాలపై కచ్చితమైన సమాచారం కోరేవారని ఆ అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా, భూముల సర్వేను ఉచితంగానే చేపడుతామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అయితే, సర్వేతోపాటు సరిహద్దు రాళ్ల ఖర్చును కొంత మేర రైతుల నుంచి వసూలు చేస్తేనే బాగుంటుందని, ఈ దిశగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఓ సలహాదారు పలు సమావేశాల్లో స్పష్టంగా చెబుతున్నట్లు తెలిసింది. 




ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు

సర్వే డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ 

సరిహద్దు రాళ్ల అంశంపై అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. సరిహద్దు రాళ్లపై ఇంకా తాము అధికారికంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సర్వే విభాగం ఇన్‌చార్జి డైరెక్టర్‌ సిద్ధార్థ జైన్‌ తెలిపారు. సీఎం సమీక్షకు  ఇచ్చిన ప్రజంటేషన్‌పై ‘ఆంధ్రజ్యోతి’ ఆయన్ను సంప్రదించింది.  ‘‘మీ సోర్స్‌ ఏమిటో నాకు తెలియదు.


కానీ రీ సర్వేకు ఎన్ని రాళ్లు కావాలి? ఏ డిజైన్‌లో ఉండాలి? వాటి ధర ఎంత ఉంటుందన్నది మేం ఇంకా ఖరారు చేయలేదు. ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. జిల్లాల నుంచి పలు సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తున్నాం.’’ అని ఆయన బదులిచ్చారు. అయితే ప్రజంటేషన్‌ గురించి ప్రస్తావించగా దాని గురించి తనకు తెలియదని తెలిపారు. 


Updated Date - 2020-10-24T09:10:49+05:30 IST