6 ఎకరాలు కబ్జా!

ABN , First Publish Date - 2021-01-21T06:16:46+05:30 IST

విశాఖపట్నంలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షానికి ఒక నీతి, స్వపక్షానికి మరో నీతిని పాటిస్తున్నారు.

6 ఎకరాలు కబ్జా!

పెందుర్తి ఎమ్మెల్యే తండ్రి ఆధీనంలో ప్రభుత్వ భూమి

స్వయంగా ఒప్పుకున్న అదీప్‌రాజ్‌ 

అయినా చోద్యం చూస్తున్న అధికారులు

చర్యలకు వెనుకడుగు

...టీడీపీ నేతలు, సానుభూతిపరులపైకి ఎడాపెడా దాడులు

విశాఖలో పాలకుల ద్వంద్వ నీతి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖపట్నంలో అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షానికి ఒక నీతి, స్వపక్షానికి మరో నీతిని పాటిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోవాలా? వాటిని స్వాధీనం చేసుకుంటే...తప్పా? అంటూ జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తరచూ ప్రశ్నిస్తుంటారు. ఇక, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే, ప్రభుత్వ భూమి ఒక్క సెంటు ఆక్రమించినా ఒప్పుకోబోమని, స్వాధీనం చేసుకొని తీరతామని ప్రగల్బాలు పలుకుతుంటారు. అది ఎవరైనా సరే ఉపేక్షించబోమని చెబుతుంటారు. కానీ ఆచరణలో మాత్రం చేసి చూపించలేకపోతున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి సానుభూతిపరులపైనే కక్ష గట్టి నిర్మాణాలు కూల్చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆక్రమణల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఓ ప్రజా ప్రతినిధి చెరువు మధ్య నుంచి తన అపార్టుమెంట్‌కు ప్రభుత్వ నిధులతో రహదారి వేయించుకున్నా స్పందించలేదు. ఇప్పుడు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ స్వయంగా తన దగ్గరున్నవి ప్రభుత్వ భూములే అని ప్రకటించినా ఈ పెద్దలు పెదవి విప్పడం లేదు.


పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ కుటుంబానికి పరవాడ మండలంలో ఆక్వా పరిశ్రమ ఉంది. పరిశ్రమకు అవసరమైన సామగ్రిని నిల్వ చేసుకోవడానికి, అక్కడ పనిచేసే సిబ్బంది నివాసాల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అవన్నీ ప్రభుత్వ భూములని తెలుగుదేశం సీనియర్‌ నాయకులు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇటీవల ఆరోపించారు.  ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ దానిపై విలేఖరుల సమావేశం నిర్వహించి, 1995 నుంచే ఆ భూములు తమ స్వాధీనంలో ఉన్నాయని, వాటి ధర ఎంతో చెబితే...చెల్లిస్తామని ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పుకొచ్చారు. 


ఆక్రమించింది ఎక్కడంటే..?


పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలోని సర్వే నంబరు 464లో ఆరు ఎకరాల కొండ పోరంబోకును ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టారు.


టీడీపీ నేతలు, సానుభూతిపరుల ఆస్తులపైనే దాడులు


మాజీ మేయర్‌ సబ్బం హరి ఇంటి ఆవరణలో ఐదారు సెంట్లు పార్కు స్థలం కలిసిందంటూ తెల్లవారుజామున ఐదారు వందల మంది యంత్రాలతో వెళ్లి హడావిడి చేశారు. గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూమి ఉందంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన ఆ సంస్థ ఆవరణలో నిర్మాణాలను కూలగొట్టి భూమి స్వాధీనం చేసుకున్నారు. భీమిలి బీచ్‌రోడ్డులో టీడీపీ నాయకుడు కాశీవిశ్వనాథ్‌కు చెందిన గోకార్టింగ్‌ పార్కులో ఆక్రమణలు ఉన్నాయంటూ కూలగొట్టేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటుచేసుకున్నవారంతా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులని చెప్పి ఉన్నపళంగా వాటిని కూలగొట్టారు.


ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదో?


మరి అదీప్‌రాజ్‌ స్వాధీనంలో వున్న ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. వాల్తేరు క్లబ్‌ భూమి ప్రభుత్వానిది కాదని తెలిసినా, అందులో తలదూర్చి, ఏదో చేద్దామని యత్నిస్తున్న వైసీపీ నేతలు పెందుర్తి ఎమ్మెల్యే వద్ద నుంచి ఆక్రమిత భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నేతలు చెప్పినట్టు ఆడడమే తప్ప..నిబంధనల ప్రకారం పనిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2021-01-21T06:16:46+05:30 IST