అమరావతిపై విషం చిమ్మడం తగదు.. జయరాం కోమటి హితవు

ABN , First Publish Date - 2022-09-20T03:29:02+05:30 IST

అమెరికాలోని(USA) మీనియాపోలిస్ నగరంలో(Minneapolis) ఆదివారం 5వ మహానాడు(Mahanadu) కార్యక్రమం జరిగింది.

అమరావతిపై విషం చిమ్మడం తగదు.. జయరాం కోమటి హితవు

అమెరికాలోని(USA) మీనియాపోలిస్ నగరంలో(Minneapolis) సెప్టెంబర్ 18న 5వ మహానాడు(Mahanadu) కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్నారై యూఎస్ఏ విభాగం కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం..ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. విశాఖలో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించడానికి అమరావతిపై విషం చిమ్మడం, సమాధి చేయడం మంచిది కాదన్నారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే రైతులు చూస్తూ ఊరుకుంటారా అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే భావోద్వేగాలు రెచ్చగొడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. దేవుళ్లకు ప్రాంతాలు అంటగడుతూ ఉత్తరాంధ్ర ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 


మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. మూడేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నేరాలు-ఘోరాలు, ధరల పెంపుతో ప్రజలను దోచుకున్న విధానాలు, పన్నుల పెంపుతో వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్ రెడ్డి 3 రాజధానులు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీలో వాస్తవ గణాంకాలను మరుగున పెట్టి తప్పుడు లెక్కలు చెప్పడం జగన్‌కే చెల్లిందన్నారు. దోచుకోవడానికి ఏ ప్రాంతాలు లాభసాటిగా ఉంటాయి? ఆ ప్రాంత ప్రజల దృష్టి ఎలా మరల్చాలి? తన నిర్ణయాలను వ్యతిరేకించిన వారిని ఎలా హింసించాలనే ధ్యాసే తప్ప రాష్ట్రాభివృద్ధిపై అవగాహనే లేదని మండిపడ్డారు. 


ప్రవాసాంధ్రుడు సాయి బొల్లినేని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ప్రవాసాంధ్రుల లక్ష్యమన్నారు. ఇందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని, రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని, క్షీణిస్తున్న శాంతిభద్రతలు-ఆగని వేధింపులు-అక్రమ అరెస్టులు, సభ్యత్వ నమోదు-పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర తీర్మానాలను చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెలుగుదేశం సభ్యులు రామ్ వంకిన, వెంకట్ జువ్వ, వేదవ్యాస్ అరవపల్లి, అజయ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు. 



మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ..బ్రిటీష్ పాలన, ఎమర్జెన్సీ రోజులను జగన్ రెడ్డి గుర్తుకు తెస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దాడి చేయడం సహేతుకం కాదన్నారు. రాష్ట్రప్రభుత్వానికి, శాసనసభకు రాజధానిని మార్చే హక్కు, మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం లేవన్నారు. జగన్ రెడ్డి తుగ్లక్ చర్యలను సోషల్ మీడియా ద్వారా విస్తృతం చేయాలని సూచించారు. తమ న్యాయమైన హక్కుల కోసం పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను అవహేళన చేయడం మంచిది కాదన్నారు. తన రాజకీయ వికృత క్రీడతో ఉత్తరాంధ్ర ప్రజలను సమిధలుగా మార్చొద్దని, ప్రజాకంఠకుడిగా చరిత్రలో మిగిలిపోవద్దని హితవు పలికారు. 

Updated Date - 2022-09-20T03:29:02+05:30 IST