కొవిడ్‌ కాఠిన్యం

ABN , First Publish Date - 2020-07-03T10:20:48+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కాఠిన్యం చూపుతోంది. ఎక్కడికక్కడ మహమ్మారి వైరస్‌ విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెద్ద సంఖ్యలో బాధితులను

కొవిడ్‌ కాఠిన్యం

జిల్లావ్యాప్తంగా గురువారం 58 పాజిటివ్‌లు నిర్ధారణ

రాజమహేంద్రవరం నగరంలో 24, రూరల్‌లో 10 నమోదు

కాకినాడ సిటీలో 17, ఉప్పాడలో 4, అంబాజీపేట 2 చొప్పున నమోదు

మంత్రి విశ్వరూప్‌ పీఏకు పాజిటివ్‌.. 20 మంది క్వారంటైన్‌కు తరలింపు

రాజమహేంద్రవరం ఎంపీ గన్‌మెన్‌, వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌కు కొవిడ్‌

కొవిడ్‌ సోకిన రోగులు కాకినాడ జీజీహెచ్‌లో ఒకేరోజు నలుగురి మృతి

జిల్లాలో మొత్తం 1679కి చేరిన కొవిడ్‌-19 కేసులు.. 30కి చేరిన మృతులు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ కాఠిన్యం చూపుతోంది. ఎక్కడికక్కడ మహమ్మారి వైరస్‌ విస్తరిస్తూ బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెద్ద సంఖ్యలో బాధితులను ఐసోలేషన్‌ పాలుచేస్తోంది. ఎవరి నుంచి ఎవరికి ఎలా వ్యాపిస్తుందో.. ఎందుకు సంక్రమిస్తుందో అర్థంకాకుండా కేసులు జిల్లాను కమ్మేస్తున్నాయి. రోజూ పెద్దఎత్తున వచ్చి పడే బాధితులతో కొవిడ్‌ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అటు వైద్య సిబ్బంది కొరతో క్రమేపీ సేవల్లోను సమస్యలు మొదల వుతున్నాయి. కాకినాడ జీజీహెచ్‌కు భారీగా వస్తున్న కేసులతో వైద్యులు సైతం చేతులెత్తేసే పరిస్థితి తలెత్తు తోంది. ఇక్కడ ఇప్పటికే ఆరుగురి వరకు వైద్యులు, కొందరు వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడడంతో బాధితుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించడంలో ఇక్కట్లు ఎదురవు తున్నాయి.


అటు కొవిడ్‌ మృతుల సంఖ్య కూడా క్రమేపీ జిల్లాలో పెరుగుతోంది. 30 ఏళ్ల వ్యక్తి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు వైరస్‌తో మృత్యువాతపడుతున్నారు. ఇందులో టెస్ట్‌లు చేయించుకోవాలన్న స్పృహ లేకుండా కొందరు తమకొచ్చిన జ్వరాన్ని దాచిపెడుతుండగా, మరి కొందరు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొవిడ్‌ సోకి మృతి చెందుతున్నారు. అటు ప్రముఖుల వద్ద పనిచేసే వ్యక్తుల వద్దకు కూడా తాజాగా వైరస్‌ విస్తరించింది. జిల్లాలో గురువారం 58 పాజిటివ్‌ కేసులు నిర్ధా రణ అయ్యాయి. ఇందులో రాజమహేంద్రవరం నగరంలో అత్యధికంగా 24 మందికి కొవిడ్‌ సోకింది. ముఖ్యంగా 8వ డివిజన్‌లో 11 మంది వైరస్‌ బారిన పడ్డారు. రూరల్‌లో పది మందికి వైరస్‌ సోకగా, బొమ్మూరులో 4 కేసులు ఉన్నాయి. అయితే వీరికి ఎవరి ద్వారా వైరస్‌ సోకిందనేది తేల్చడం కష్టంగా మారింది. అటు వరుస కేసులతో రాజమహేంద్రవరం నగరంలో మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌ల సంఖ్య 50కి చేరింది. కాకినాడ ఏపీఎస్పీ పరిధిలో 10, కొండయ్యపాలెం 3, ఏటిమొగలో నాలుగు కేసుల చొప్పున నమోదయ్యాయి. అటు ఉప్పాడలో నాలుగుకేసులు నమో దవగా ఇందులో సూరాడపేట 3, ఉప్పాడ నాయకర్‌ కాలనీ ఒక కేసు ఉన్నాయి. పెద్దాపురం మండలం ఉలిమే శ్వరంలో ఒకరికి, అంబాజీపేట మండలం ఇసుకపూడిలో ఇద్దరికి కొవిడ్‌ నిర్ధారణ అయింది.


మంత్రి పీఏకు...ఎంపీ గన్‌మెన్‌కు..

మంత్రి పినిపే విశ్వరూప్‌ వద్ద పనిచేసే పీఏకు గురువారం కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఈయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈయన కాంటాక్ట్స్‌ భారీగా ఉండ డంతో వారిని గుర్తించే పనిలో పడ్డారు. తాత్కాలికంగా 20 మంది కాంటాక్ట్స్‌ను గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. అయితే పీఏకు పాజిటివ్‌ రావడంతో మంత్రికి వైరస్‌ వ్యాపించిందా? అని అధికార వర్గాలు కొంత కలవరపడు తున్నాయి.


అయితే కొన్నిరోజులుగా మంత్రి ఊరిలో లేక పోవడం, రెండు రోజుల కిందటే అమలాపురం రావడంతో పీఏ ద్వారా కాంటాక్ట్‌ పెద్దగా లేదని, దీంతో అమాత్యుడి విషయంలో ఆందోళన అవసరం లేదని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. అటు రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌ వద్ద పనిచేసే గన్‌మెన్‌, ఆయన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌ ఇద్దరికీ పాజిటివ్‌ గుర్తించారు. వీరికి  ఎవరి ద్వారా వైరస్‌ సంక్ర మించిందనేది తేల్చడం కష్టంగా మారింది. అటు గంగవరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇందులో పనిచేసే కీలక అధికారికి కొవిడ్‌గా నిర్ధారణ అయింది. ఈయన తరచూ మైదాన ప్రాంతం నుంచి విధుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండడంతో ఈయనకు ఎలా వ్యాపించిందనేదానిపై ఆరా తీస్తున్నారు.


అతడికి తీవ్ర జ్వరం...తీరా వచ్చాక మృతి..

జిల్లాలో కొవిడ్‌తో మృతి చెందుతోన్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 60 ఏళ్ల వయసు దాటిన వారికి ఎక్కువ ముప్పు ఉందని హెచ్చరిస్తున్నా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు వైరస్‌ బారిన పడి మృతి చెందుతున్నారు. అందులోభాగంగా కాకినాడ జీజీహెచ్‌లో గురువారం తెల్లవారుజా మున 2.20 గంటలకు ఓ 32 ఏళ్ల వ్యక్తి కొవిడ్‌తో మృతి చెందాడు. కోనసీమలో తూర్పుపాలేనికి చెందిన ఈయన కొన్ని రోజులు కిందట హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చాడు. తీవ్ర  జ్వరం పది రోజులుగా వేధిస్తుండడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఓ వైద్యుడికి చూపిస్తున్నారు. తీరా పరిస్థితి విషమించడంతో మంగళవారం అమలాపురం కిమ్స్‌కు తరలిస్తే చేర్చుకోవడానికి అంగీకరించలేదు.


దీంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం పరీక్షలు చేస్తే బుధవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తీరా అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం కన్ను మూశారు. అయితే తమ బిడ్డను జీజీహెచ్‌కు తీసుకువచ్చాక ఆక్సిజన్‌ మాత్రమే పెట్టారని, వెంటిలేటర్‌లు ఖాళీలేవని చెప్పి పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన కొడుకు మృతదేహాన్ని అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చనిపోయిన వ్యక్తిని కొన ఊపిరితో తీసుకువచ్చారని, అప్పటికే పరిస్థితి విష మించిందని, మృతదేహానికి సంబంధించి తమదేనని బాధ్యత వహించకపోవడంతో సమస్య వచ్చి ఉంటుందని వైద్య వర్గాలు వివరించాయి.


అటు ఏలేశ్వరం మండలం భద్రవరానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో చికిత్స పొందుతూ జీజీ హెచ్‌లో గురువారం మృతి చెందారు. మరణానంతర పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అటు కొవిడ్‌ మరణాలు పెరుగుతుండడంతో ప్రతిరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసే కొవిడ్‌ బులిటెన్‌లో ఈ వివరాలను ప్రస్తావించడం మానే శారు. జిల్లా కీలక అధికారి ఆదేశాల మేరకు మరణాల సంఖ్యను చూపించే విధానానికి స్వస్తి చెప్పినట్టు వైద్యవర్గాలు వివరించాయి. మరోవైపు జిల్లాలో నలు మూలలా కేసులు విపరీతంగా పెరగడంతోపాటు మృతుల సంఖ్య పెరగడం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇతర ఆరోగ్య సమస్యలున్నవారైతే నిత్యం వణికిపోతున్నారు.


మరణాలు.. ఆందోళనకరం

జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కొవిడ్‌తో ఇటీవల కాకినాడ జీజీహెచ్‌లో చేరారు. వీరిలో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. కాకినాడ జగన్నాఽథపురానికి చెందిన 45 ఏళ్ల మహిళ, ఏలేశ్వరం మండలానికి చెందిన 80 ఏళ్ల మహిళ వివిధ రుగ్మతలతో చేరారు. ఆరోగ్యం విషమించడంతో మరణించారు. వీరికి పరీక్షలు చేయగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది.


అలాగే మలికిపురం మండలం తూర్పుపాలెంకు చెందిన 31 ఏళ్ల యువకుడు శ్వాసకోశ సంబంధం వ్యాధితో గత నెల 30న చేరాడు. అతడికి పరీక్ష చేయగా వైరస్‌ సోకిందని తేలింది. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించాడు. పెద్దాపురానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి గత నెల 14న చేరాడు. బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహానికి పరీక్ష చేయగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ య్యింది. అలాగే వివిధ రుగ్మతలతో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలకు కొవిడ్‌ పరీక్ష చేశారు. ఫలితాలు రావాల్సి ఉంది.

Updated Date - 2020-07-03T10:20:48+05:30 IST