బాప్‌రే! దేశంలో వాయిదా పడిన 5.8 లక్షల ఆపరేషన్లు

ABN , First Publish Date - 2020-05-18T22:15:07+05:30 IST

కోవిడ్-19కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా 5.8 లక్షలకు పైగా ఆపరేషన్లు

బాప్‌రే! దేశంలో వాయిదా పడిన 5.8 లక్షల ఆపరేషన్లు

బెంగళూరు: కోవిడ్-19కు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా 5.8 లక్షలకు పైగా ఆపరేషన్లు వాయిదా పడినట్టు ఇంటర్నేషనల్ రీసెర్చ్ కన్సార్టియం తెలిపింది. రోగులకు కరోనా వైరస్ ముప్పు తప్పించేందుకు చేయాలని నిర్ణయించిన ఆపరేషన్లంటినీ వాయిదా వేయాలని ఈ ఏడాది మార్చిలో కేంద్ర ఆరోగ్యమంత్విత్వ శాఖ అన్ని ఆసుపత్రులను కోరింది. కాగా, ఈ అధ్యయనం ఫలితాలు బ్రిటిషన్ జర్నల్ ఆఫ్ సర్జరీలో ప్రచురితమయ్యాయి.

 

అంత అత్యవసరం కాని 5,05,800 సర్జీలు, 51,100 కేన్సర్ ఆపరేషన్లు, 27,700 ప్రసూతి శస్త్రచికిత్సలు దేశవ్యాప్తంగా దాదాపు మూడు నెలలు ఆలస్యం కావొచ్చని భారత్ సహా 77 దేశాలకు చెందిన సర్జన్లు, అనెస్థెటిస్ట్స్ (మత్తుమందు నిపుణులు) రీసెర్చ్ నెట్‌వర్క్ అయిన కోవిడ్‌సర్క్ కొలాబరేటివ్ అంచనా వేసింది. 


పేరుకుపోయిన ఆపరేషన్లను పూర్తి చేసేందుకు సరైన జాగ్రత్తలు ఉన్నప్పటికీ, సాధారణ శస్త్రచికిత్స విధానాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవాలని వైద్యులు అంటున్నారు. అత్యవసర కేసుల్లో ఆపరేషన్లు మొదలు పెట్టాల్సిన ఆవశ్యకతను అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ రఘురాం నొక్కి చెప్పారు. దాదాపు రెండు నెలలుగా లాక్‌డౌన్‌లో ఉన్నామని,  కేన్సర్, హృద్రోగ సమస్యలు వంటి అత్యవసర శస్త్ర చికిత్స కేసులను తిరిగి ప్రారంభించినట్టు చెప్పారు. రోగి వ్యాధి తదుపరి దశకు చేరుకుంటుంది కాబట్టి ఇక ఆపరేషన్లను వాయిదా వేయలేమని ఆయన స్పష్టం చేశారు. 

 

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 28 మిలియన్ సర్జరీలు వాయిదా పడడమో, ఆలస్యం కావడమో జరిగినట్టు అధ్యయనం పేర్కొంది. దేశాలు తమ సాధారణ శస్త్రచికిత్స వేగం 20 శాతం పెరిగితే పేరుకుపోయిన ఆపరేషన్లను పూర్తి చేయడానికి సగటున 45 వారాలు పడుతుందని అధ్యయనం వివరించింది.  


Updated Date - 2020-05-18T22:15:07+05:30 IST