కదిలిన బస్సులు

ABN , First Publish Date - 2020-05-20T09:37:49+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా 58రోజులు డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి. నర్సంపేట డిపోలో ఉదయమే

కదిలిన బస్సులు

58రోజుల తర్వాత రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

విధుల్లో చేరిన 82 మంది కార్మికులు


నర్సంపేట/నర్సంపేట టౌన్‌, మే 19 : లాక్‌డౌన్‌ కారణంగా 58రోజులు డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి. నర్సంపేట డిపోలో ఉదయమే డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరడానికి డిపోకు వచ్చారు. వీరికి డీఎం శ్రీనివాసరావు శానిటైజేషన్‌ పంపిణీ చేసి బస్సుల్లో భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా ప్రయాణికులకు సూచించాలని చెప్పారు. డిపో నుంచి 41 బస్సులను 82 మంది డ్రైవర్లు, కండక్టర్లతో వరంగల్‌, హన్మకొండ, తొర్రూరు, ములుగు, నెక్కొండ తదితర ప్రాంతాలకు బస్సులను నడిపారు. అయితే ప్రజల్లో కరోనా భయం వీడని కారణం గానో, బస్సులు నడుస్తున్నాయన్న సమాచారం లేకనో  తెలియదు గానీ ప్రయాణికులు లేక బస్టాండ్‌ వెలవెలబోయింది. మొత్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిపోకు సుమారు 7.98కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు చెబుతున్నారు.


పరకాలలో...

పరకాల డిపో నుంచి ఉదయమే ఆర్టీసీ బస్సులు మంగళవారం రోడ్డెక్కాయి. 11రూట్లలో 39 బస్సులను నడిపించారు. బస్టాండ్‌కు వచ్చిన బస్సులు ఎక్కేందుకు జనం పెద్దగా కనిపించ లేదు. ప్రయాణికులు లేక బస్టాండ్‌ వెలవెలబోయింది.

Updated Date - 2020-05-20T09:37:49+05:30 IST