కష్టాలు మీద కష్టాలు.. 57 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పాసైన ఆశా కార్యకర్త

ABN , First Publish Date - 2021-06-29T22:15:39+05:30 IST

మనసుంటే మార్గం ఉంటుందని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఒడిశాకు చెందిన 57 ఏళ్ల ఆశా

కష్టాలు మీద కష్టాలు.. 57 ఏళ్ల వయసులో మెట్రిక్యులేషన్ పాసైన ఆశా కార్యకర్త

భువనేశ్వర్: మనసుంటే మార్గం ఉంటుందని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఒడిశాకు చెందిన 57 ఏళ్ల ఆశా కార్యకర్త స్వర్ణలతా పాటి వార్షిక మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. పలుమార్లు ఫెయిలైన అనంతరం ఎట్టకేలకు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఆమె ఆనందానికి హద్దే లేకుండా పోయింది. భద్రక్ జిల్లా భండారీపోఖరి బ్లాక్‌లోని కాంతి గాన్ గ్రామానికి చెందిన స్వర్ణలత ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏడో తరగతిలోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆ తర్వాత పెళ్లిపీటలు ఎక్కింది. 


27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన ఆమె ఇద్దరు పిల్లలతో పడరాని పాట్లు పడింది. భర్త ఉండగా ఇల్లు దాటి బయటకు రాని ఆమె అతడు మరణించిన తర్వాత జీవితం అంధకారంగా మారింది. బిడ్డల పోషణ కోసం ఏదో ఒకటి చేయాలని భావించిన ఆమెకు సరైన విద్యార్హత లేకపోవడంతో ఉద్యోగం దొరకడం దుర్లభమైంది. చివరికి గ్రామంలోని ఓ స్కూల్‌లో నెలకు రూ. 100 వేతనంతో కుక్‌గా చేరింది. 


2005లో స్వర్ణలతను ప్రభుత్వం ఆశా కార్యకర్తగా నియమించింది. పనిలో చూపించే అంకితభావం, కష్టపడేతత్వానికి జిల్లా స్థాయిలో పలు అవార్డులు అందుకుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరగవడంతో పిల్లలను పోస్టు గ్రాడ్యుయేషన్ చదివించి శభాష్ అనిపించుకుంది. అయితే, ఆశా వర్కర్లకు మెట్రిక్ విద్యార్హత తప్పనిసరని 2019లో ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆమెకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆశా కార్యకర్తగా ఓ వైపు సేవలు అందిస్తూనే మరోవైపు, స్కూల్లో కుక్‌గా పనిచేసేది. రాత్రిళ్లు ఇంటి వద్ద చదువుకునేది. 


ఓపెన్ స్కూల్ ద్వారా 2019లో మెట్రిక్ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. మార్చి 2020లో ఆమె పరీక్ష రాయాల్సి ఉండగా కరోనా కారణంగా అది వాయిదా పడింది. సెప్టెంబరులో ఒడిశా స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా పరీక్షకు హాజరైనప్పటికీ ఉత్తీర్ణత సాధించలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో ఇంగ్లిష్‌లో నాలుగు మార్కులు తక్కువ రావడంతో మరోమారు ఫెయిలైంది. దీంతో ఈ ఏడాది ఆ పరీక్షను రాసేందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే, మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థుల గత రికార్డుల ఆధారంగా మార్కులు కేటాయించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్వర్ణలత కూడా పాసైంది.  

Updated Date - 2021-06-29T22:15:39+05:30 IST