571కు పెరిగిన కరోనా బాధితులు.. ఒక్కరోజే 86 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-06T16:29:23+05:30 IST

కరోనా బాధితుల సంఖ్య 571కి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 86 మందికి పాజిటివ్‌ వచ్చింది...

571కు పెరిగిన కరోనా బాధితులు.. ఒక్కరోజే 86 మందికి పాజిటివ్‌

  • ఒక్కరు మినహా మిగిలినవారు..
  • ఢిల్లీ జమాత్‌లో పాల్గొన్నవారే
  • 571కు పెరిగిన కరోనా బాధితులు 
  • ఐదుగురు మృతి

చెన్నై : రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 571కి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 86 మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ఒక్కరు మినహా అందరూ ఢిల్లీ జమాత్‌కు వెళ్లివచ్చినవారే. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో వ్యక్తికి కరోనా సోకినట్టు తేలిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్‌ తెలిపారు. రాష్ట్రంలో అధికంగా చెన్నైలో ఇప్పటివరకు 95 కేసులు నమోదు కాగా, ఆరు జిల్లాలు కరోనా రహితంగా నిలిచాయి. రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షల వివరాలను ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్‌ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,824 మంది హోం క్వారంటైన్‌లో, 127 మంది ప్రభుత్వ నిఘాలో ఉన్నారని తెలిపారు. 


రాష్ట్రంలో కొత్తగా 86 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిందని, దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 571కి పెరిగిందని తెలిపారు. తమిళనాడులో అధికంగా టెస్ట్‌లు చేస్తున్నామని, అలాగే దేశంలోనే తమిళనాడులో మాత్రమే అధికంగా కరోనా పరిశోధన కేంద్రాలు వున్నాయని చెప్పారు. తమిళనాడులో కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ కొరత లేదని, సీఎం ఎడప్పాడి పళనిస్వామి సూచనల మేరకు అన్ని వైద్య కళాశాల ఆస్పత్రుల్లో పరిశోధనలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈలోపు ల్యాబ్‌ టెక్నీషియన్లకు శిక్షణ కూడా ఇస్తున్నామని చెప్పారు. మూడో దశలోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రతి తమిళుడు కృషి చేయాలని, ప్రజలందరూ ఇంట్లోనే ఉండి సహకరించాలని ఆమె కోరారు. కంటైన్‌మెంట్‌ యాక్టివిటీ ప్లాన్‌ను చాలా ముమ్మరంగా నిర్వహిస్తున్నామని, పాజిటివ్‌ వస్తున్నవారు నివసించిన ప్రాంతం, వారు సంచరించిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో అత్యవసర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపోతే రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. 


శనివారం వరకు ముగ్గురు మరణించగా, ఆదివారం మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. కరోనా లక్షణాలతో చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతూ వచ్చిన 72 ఏళ్ల వృద్ధులు గత రెండో తేదీన మరణించారు. ఆయన రక్త నమూనాల పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలింది. ఇక స్టాన్లీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న 61 ఏళ్ల వృద్ధుడు ఆదివారం మరణించారు. ఈ విషయంపై ఆరోగ్యశాఖ కార్యదర్శి స్పందిస్తూ, కరోనా చికిత్సలు పొందుతున్న శనివారం వరకు ఆరోగ్యంగానే ఉన్నారని, అకస్మాత్తుగా శ్వాస ఇబ్బందులు ఏర్పడడంతో వెంటిలేటర్‌పై పెట్టామని, దురదృష్టవశాత్తూ ఆదివారం ఉదయం ఇద్దరు మరణించారని తెలిపారు.


కరోనారహితంగా ఆరు జిల్లాలు

కరోనా బాధితుల సంఖ్యలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో ఆరు జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి. తెన్‌కాశి, ధర్మపురి, మైలాడుదురై, అరియలూరు, కృష్ణగిరి, పుదుక్కోట జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.


రాష్ట్రంలో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు కుడివైపున పట్టికలో..


చెన్నైలో వైద్య పరీక్షలకు 16వేల మంది సిబ్బంది


రాజధాని నగరం చెన్నైలో కరోనా కేసులు అధికంగా ఉన్న నేపథ్యలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆరోగ్యశాఖ, చెన్నై కార్పొరేషన్లు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఆరోగ్యశాఖ కంటైన్‌మెంట్‌ ప్లాన్‌ను నగరంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్పొరేషన్‌ 16వేల మంది సిబ్బందిని నియమించింది. వీరు నగరంలోని ప్రతి ఇంటికీ వెళ్లి జలుబు, దగ్గు, జర్వం లక్షణాలు ఉన్నవారి గురించి ఆరా తీస్తారు. లక్షణాల తీవ్రతను బట్టి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే కరోనా నిరోధక చర్యల గురించి అవగాహన కల్పిస్తున్నారని, సామాజిక దూరం పాటించేలా సూచనలిస్తారని కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-06T16:29:23+05:30 IST