ఒక్క రోజులో 57 వేల కేసులు

ABN , First Publish Date - 2020-08-02T06:48:16+05:30 IST

వరుసగా మూడో రోజు 50 వేల పైగా కేసులు.. 700 పైగా మరణాలు.. దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో చాటే గణాంకాలివి. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ 17

ఒక్క రోజులో 57 వేల కేసులు

దేశంలో కరోనా ఉగ్ర రూపం.. 

మరో 764 మంది మృతి


న్యూఢిల్లీ, ఆగస్టు 1: వరుసగా మూడో రోజు 50 వేల పైగా కేసులు.. 700 పైగా మరణాలు.. దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో చాటే గణాంకాలివి. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ 17 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 36,511కు చేరింది. శనివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 57,118 మంది వైరస్‌ బారినపడ్డారని.. 764 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కొత్తగా 36,569 మంది కోలుకున్నారని.. దీంతో రికవరీ అయినవారి సంఖ్య 10,94,374కు చేరిందని తెలిపింది. రికవరీ రేటును 64.53గా పేర్కొంది. జూన్‌ మధ్య నాటికి 3.33గా ఉన్న మరణాల రేటు.. ప్రస్తుతం 2.15 శాతానికి తగ్గిందని వివరించింది. లాక్‌డౌన్‌-1 ప్రారంభం నుంచి ఇదే అత్యల్పమని తెలిపింది. మరోవైపు ఇప్పటివరకు మొత్తం 1,93,58,659 మందికి పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం 5,25,689 మందికి పరీక్షలు చేసినట్లు ప్రకటించింది.


తమిళనాడు, కర్ణాటకలో పెరుగుతున్న మరణాలు

తమిళనాడులో శనివారం 5,879 కేసులు వచ్చాయి. 99 మంది చనిపోయారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య ఆరు వేల లోపే ఉంటోంది. అయితే, మరణాలు పెరుగుతున్నాయి. తాజా 1,074 కేసులతో రాజధాని చెన్నై కేసులు లక్ష దాటాయి. కర్ణాటకలో 5,172 కేసులు రాగా 98 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటికే అటవీ, పర్యటక శాఖ మంత్రులు వైరస్‌ బారినపడగా, కొత్తగా వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌, ఆయన భార్య, అల్లుడికి కరోనా సోకింది. ఢిల్లీలో శనివారం 1,118 కేసులు నమోదయ్యాయి. 26 మంది చనిపోయారు. ఉత్తర ప్రదేశ్‌లో మరో 3,800 మంది కొవిడ్‌కు గురయ్యారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో కేసుల ఉధృతి నేపథ్యంలో.. రామకృష్ణ మఠం ప్రధాన కేంద్రమైన కోల్‌కతాలోని బేలూర్‌ మఠానికి ఆదివారం నుంచి భక్తుల రాకను నిలిపివేశారు.


ఢిల్లీలో కేసుల రెట్టింపు వ్యవధి 50 రోజులు

ఢిల్లీలో కరోనా కేసుల రెట్టింపు వ్యవధి 50 రోజులకు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. దేశంలో ఈ వ్యవధి 21 రోజులని పేర్కొన్నారు. మొత్తం 1.35 లక్షల కేసులకుగాను 10,705 యాక్టి వ్‌ కేసులు మాత్రమే ఉన్నాయని వివరించారు. ఈ విషయంలో గతంలో ఢిల్లీ దేశంలో 2వ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు 12వ స్థానానికి మారిందని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 496 కట్టడి ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఢిల్లీలో శనివారం రెండో సీరో సర్వే ప్రారంభమైంది.


కొవిడ్‌ కట్టడిలో అహ్మదాబాద్‌ భేష్‌

కరోనా కట్టడికి గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో అనుసరించిన పద్ధతులను ప్రపంచ ఆరోగ్య సంస మెచ్చుకుంది. విదేశాలు, భారత్‌లోని మిగ తా రాష్ట్రాలు వాటిని కేస్‌ స్టడీ్‌సగా తీసుకోవాలని సూచించింది. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ఈ మేరకు ప్రశంసించారని గుజరాత్‌ సర్కారు తెలిపింది.


కలం వీరులకు బేడీలు

కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలను తప్పుబడుతూ వార్తలు రాసిన 50 మందికిపైగా పాత్రికేయులను వివిధ రాష్ట్రాల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా అనేకమంది జర్నలిస్టు లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా, చాలా చోట్ల పాత్రికేయులపై దౌర్జన్యాలు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్వతంత్ర పాత్రికేయులే కావడం గమనార్హం. 

Updated Date - 2020-08-02T06:48:16+05:30 IST