56 ఏళ్ల మహిళతో.. 28 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోకండి.. ఈ నిజం కూడా తెలిస్తే..

ABN , First Publish Date - 2021-07-06T23:07:13+05:30 IST

ఓ 56 ఏళ్ల మహిళ. ఆమె పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. మనుమలు కూడా పుట్టేశారు. ఇప్పుడు ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది. ఆ వరుడి వయసు ఇంకా 27 సంవత్సరాలే.

56 ఏళ్ల మహిళతో.. 28 ఏళ్ల వ్యక్తికి పెళ్లి.. ఇదేం విచిత్రం అని ఆశ్చర్యపోకండి.. ఈ నిజం కూడా తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ 56 ఏళ్ల మహిళ. ఆమె పిల్లలకు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. మనుమలు కూడా పుట్టేశారు. ఇప్పుడు ఆమె మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది. ఆ వరుడి వయసు ఇంకా 27 సంవత్సరాలే. వచ్చే ఏడాది తనకు 28 వచ్చాక ఆమెను పెళ్లి చేసుకోవాలని అతను అనుకుంటున్నాడట. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. కరోనా కారణంగానేమో మరి.. ఈ పెళ్లి కూడా వచ్చే ఏడాది పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఈ పెళ్లుకొడుకు వయసు 27 అయినా చూడటానికి మాత్రం 60 ఏళ్లు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. ఎందుకంటే నిజానికి ఆయన వయసు 66.


ఆశ్యర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. ఆయన పేరు లాల్ బిహారీ. ఉత్తర ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన ఆయన.. ఒకసారి లోన్ కోసం స్థానికంగా ఉన్న బ్యాంకుకు వెళ్లారు. అక్కడ ఆయన ఫ్యూజులు ఎగిరిపోయే విషయం తెలిసింది. అదేంటంటే.. ఆయన అప్పటికే మరణించారు! బ్యాంకు అధికారుల కళ్లెదురుగా నిలబడి ఉన్న తను చనిపోవడమేంటని లాల్ బిహారీ ఆశ్యర్యపోయారు. అప్పుడు బయటపడిందో దిమ్మతిరిగే నిజం. బిహారీ పేరిట ఉన్న పొలాన్ని ఎలాగైనా తాను పొందాలనే ఉద్దేశ్యంతో.. ఆయన బంధువు ఒకాయన ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చి బిహారీ చనిపోయినట్లు రిజిస్టర్ చేయించాడని తేలింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆ పొలం కనీసం ఒక ఎకరం కూడా లేదు. 



అప్పటి నుంచి తాను చనిపోలేదని, బతికే ఉన్నానని ప్రభుత్వాన్ని నమ్మించడం కోసం బిహారీ చేయని ప్రయత్నం లేదు. ఒకసారి తన అంత్యక్రియలకు తానే ఏర్పాట్లు చేసుకొని చితిపై కూర్చున్నారు. మరోసారి తన భార్యకు వితంతు పెన్షన్ ఇవ్వాలంటూ తానే డిమాండ్ చేశారు. చివరకు తాను బ్రతికున్నానని నిరూపించుకునేందుకు 1989లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఎన్నికల్లో పోటీ చేశారు. అఫ్‌కోర్స్ ఓడిపోయారనుకోండి. ఇక్కడ బిహారీ లక్ష్యం రాజీవ్ గాంధీపై గెలవడం కాదు. తాను ప్రాణాలతోనే ఉన్నానని, అందరికీ ఉన్న హక్కులు తనకూ ఉంటాయని నిరూపించుకోవడం.


1955లో పుట్టిన లాల్ బిహారీ.. తాను అధికారికంగా చనిపోయినట్లు తెలియడంతో మొదట షాకైనా.. వెంటనే తేరుకొని తన పోరాటాన్ని ప్రారంభించాడు. తన పేరు చివర్న ‘మృతక్’ (మరణించిన వ్యక్తి) అనే పదాన్ని చేర్చుకొని లాల్ బిహారీ ‘మ‌ృతక్’గా పేరు మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మృతక్ సంఘ్ (ఉత్తర ప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ డెడ్ పీపుల్)ను స్థాపించి, తనలాగే బంధువుల మోసాల వల్ల చనిపోయిన వారందరినీ ఒకచోటకు చేర్చారు. అప్పట్లో చాలామందికి ఇలాంటి షాకింగ్ అనుభవాలు ఎదురయ్యేవి. వీళ్లంతా బిహారీ స్థాపించిన సంఘంలో చేరి, పోరాటం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఘంలో 20వేలమందికిపైగా సభ్యులు ఉన్నారు. 2004 నాటికి వీరిలో నలుగురు సభ్యులు బ్రతికే ఉన్నట్లు ఎలాగోలా అధికారిక ధ్రువీకరణ సాధించారు. వారిలో లాల్ బిహారీ కూడా ఒకరు. 1994లో ఆయన బ్రతికే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.


1994లో తాను మళ్లీ పుట్టానని చెప్పుకునే లాల్ బిహారీ ‘మృతక్’.. తన భార్య కర్మీ దేవిని మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్తున్నారు. ‘‘నేను ప్రభుత్వ రికార్డుల్లో 27 ఏళ్ల క్రితం మళ్లీ పుట్టాను. వచ్చే ఏడాది మళ్లీ ఈ పెళ్లి చేసుకుంటాను అప్పటికి నాకు 28 ఏళ్లు నిండుతాయి’’ అని బిహారీ చెప్తున్నారు. ‘మృతక్ సంఘ్’లోని తన సభ్యులకు కూడా బిహారీ చాలా మద్దతు ఇస్తారు. 2004లో తమ సంఘం సభ్యుడైన శివదత్ యాదవ్‌ను భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీపై పోటీకి నిలబెట్టడంలో లాల్ బిహారీ కీలక పాత్ర పోషించారు. ఆయన కథ తెలిసిన బాలీవుడ్ ఫిలిం మేకర్ సతీష్ కౌశిక్.. 2021లో ‘‘కాగజ్’’ పేరిట ఒక చిత్రం తీశారు. ‘మీర్జాపూర్’ వంటి సిరీసులతో బాగా ప్రాచుర్యం పొందిన పంకజ్ త్రిపాఠీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడం విశేషం.

Updated Date - 2021-07-06T23:07:13+05:30 IST