గ్రేటర్‌ బరిలో 567 మంది

ABN , First Publish Date - 2021-03-04T06:57:22+05:30 IST

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల బరిలో నిలిచేదెవరో స్పష్టత వచ్చింది.

గ్రేటర్‌ బరిలో 567 మంది

ముగిసిన నామినేషన్ల ఘట్టం

అత్యధికంగా 32వ వార్డులో 12 మంది పోటీ,

ఆ తరువాత 64వ వార్డులో 11 మంది, 37లో 10 మంది

అత్యల్పంగా 28వ వార్డులో ఇద్దరే...టీడీపీ, వైసీపీ ముఖాముఖి పోరు

అధికార పార్టీ వైసీపీ అన్ని వార్డుల్లోనూ పోటీ

టీడీపీ 94 వార్డుల్లో పోటీ

మరో రెండింటిలో గుర్తుల కేటాయింపుపై సందిగ్ధం

ఆఖరి నిమిషంలో అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగడంతో కొత్త వారికి బీ.ఫారం

మరో రెండు వామపక్షాలకు కేటాయింపు


విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):


మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల బరిలో నిలిచేదెవరో స్పష్టత వచ్చింది. మొత్తం 98 వార్డు పదవులకు 587 మంది పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం సాయంత్రంతో ముగియడంతో వార్డుల వారీగా పోటీలో వున్న అభ్యర్థుల వివరాలు, వారికి కేటాయించిన పోలింగ్‌ గుర్తులను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఆయా జోనల్‌ కార్యాలయాల్లో వెల్లడించారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం కానున్నది. 


గత ఏడాది మార్చిలో విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు 98 వార్డుల నుంచి 1,361 నామినేషన్లు దాఖలు కాగా వీటిలో 99 నామినేషన్లను అధికారులు పరిశీలన అనంతరం తిరస్కరించారు. మిగిలిన 1,262 నామినేషన్లు ఆమోదించారు. కరోనా కారణంగా అప్పట్లో ఎన్నికలను వాయిదా వేశారు. కొంతకాలం తరువాత కేసులు తగ్గడంతో ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తూ ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల వాయిదా ప్రకటన తరువాత నుంచి తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేసే వరకు...నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఐదుగురు మృతిచెందడంతో వారి స్థానంలో అదే పార్టీకి చెందిన వ్యక్తులు నామినేషన్‌ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే ఐదుగురికి బదులు ముగ్గురే నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం నామినేషన్లు 1,260కి తగ్గాయి. మంగళ, బుధవారాల్లో పలువురు అభ్యర్థులతోపాటు గతంలో రెండు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు అదనపు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 587 మంది పోటీలో మిగిలారు. ఒక్కో వార్డుకు సగటున ఆరుగురు చొప్పున బరిలో ఉన్నారు.  32వ వార్డులో అత్యధికంగా 12 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, తర్వాత స్థానంలో 64వ వార్డులో 11 మంది, 37 వార్డులో పది మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా 28వ వార్డులో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారు. తర్వాత 23, 84 వార్డుల్లో ముగ్గురేసి చొప్పున పోటీలో ఉన్నారు.


ఇదిలావుండగా అధికార పక్షమైన వైసీపీ అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 94 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. రెండు వార్డులను వామపక్షాలకు కేటాయించగా, మరో రెండు వార్డుల్లో పార్టీ అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నది. 


జీవీఎంసీ పరిధిలో మొత్తం 17,52,927 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,80,481 మంది, మహిళలు 8,73,320 కాగా ఇతరులు 126 మంది ఉన్నారు. 98 వార్డుల్లో 1,712 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 3,608 బ్యాలెట్‌ బాక్సులు అవసరమని గుర్తించారు. గ్రామీణ ప్రాంతంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్‌ బాక్సులను ఆయా మండలాల నుంచి నగరానికి తెప్పించారు. వాటికి మరమ్మతులు చేసి జోనల్‌ కార్యాలయాల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. ఎన్నికల సందర్భంగా అక్రమాలు జరగకుండా వుండేందుకు పోలింగ్‌ బూత్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రారంభించారు. 


పార్టీల వారీగా పోటీ చేస్తున్న వార్డులు...


వైసీపీ 98, టీడీపీ 94, కాంగ్రెస్‌ 67, జనసేన 51, బీజేపీ 44, సీపీఎం 19, సీపీఐ 6, బీఎస్‌పీ 9, ఇతర రిజిస్టర్డ్‌ పార్టీలు 1, ఇండిపెండెంట్లు 178

Updated Date - 2021-03-04T06:57:22+05:30 IST