Abn logo
Mar 30 2020 @ 04:40AM

జిల్లాలో కరోనా అనుమానితులు 55

ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు 

 ప్రజాప్రతినిధి దంపతులకు కరోనా నెగటివ్‌ 

ఢిల్లీ సమ్మేళనానికి వెళ్ళిన వారిపై నిఘా వర్గాల ఆరా

రైల్వే రిజర్వేషన్‌, ఇతర మార్గాల ద్వారా వివరాల సేకరణ 

జిల్లా నుంచి 45 మంది... ఒక్క గుంటూరు నుంచే 20 మంది 

వారి ఆరోగ్య పరిస్ధితిపై అర్బన్‌ పోలీసుల ప్రత్యేక దృష్టి 

కరోనా ఓపీకి పోటెత్తుతున్న రోగులు


గుంటూరు, మెడికల్‌, సంగడిగుంట. మార్చి 29 : జిల్లాలో ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతోంది. ప్రజా ప్రతినిధి దంపతులకు కరోనా నెగిటివ్‌ రావ డంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు నగ రంలోని పలువురు ప్రముఖులు కూడా ఒత్తిడి నుంచి బయటపడ్డారు. మాచర్ల ప్రాంతం, గుం టూరులోని పలు ప్రాంతాల నుంచి అను మానితులను.. ముఖ్యంగా ఢిల్లీ సమావేశాలకు వెళ్ళి వచ్చినఙవారు, వారిని కలిసిన వారిని గుం టూరు సమీపంలోని కాటూరి మెడికల్‌ కళాశాల, మరికొన్ని చోట్ల ఉంచి పరీక్షలు నిర్వహించారు. వీరందరి ఫలితాలు సోమవారం సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో లేపిన కలకలం దాని మూలాలు కూడా గుంటూరు జిల్లా బాపట్లలో పడ్డాయి. ప్రకాశం జిల్లా వారికి పరీక్షలునిర్వహించిన బాపట్ల వైద్యులు హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. 


ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు

జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడే రోగులు తమకు ఎక్కడ కరోన సోకిందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజే సుమారు 200మంది కరోన అనుమానిత లక్షణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, గోరంట్లలోని జ్వరాల ఆసుపత్రికి పోటెత్తారు. తమకు కరోన  పరీక్షలు చేయాలని వైద్యులను కోరారు. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు 55 మంది రోగుల నుంచి నమూనాలను సేకరించి కోవిడ్‌-19 నిర్థారణ కోసం ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, గోరంట్ల జ్వరాల ఆసుపత్రిలో 74 మంది కరోన అనుమానిత రోగులను ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు.


విదేశాల నుంచి వచ్చిన 2,062 మంది వ్యక్తులను హోం క్వారంటైన్‌లో ఉంచి ప్రతి నిత్యం ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. వీరిలో స్వల్ప అనారోగ్యంతో ఉన్న 161 మందిని గుర్తించారు. వీరిని జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 8 క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచి వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శివనాగరాజు కాలనీలో ఓ లారీ క్లీనర్‌ కేరళ నుంచి వచ్చాడంటూ స్థానికులు ఆందోళన చెందారు. కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయడంతో అరండల్‌పేట పోలీసులు అర్జునరావును ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించారు. 


ఎవరెవరు వెళ్లారు..?

జిల్లా నుంచి ఢిల్లీలోని సమ్మేళనానికి ఎవరెవరు వెళ్ళారనే దానిపై పోలీసు వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. మత సంస్థ పెద్దలు, రైల్వే రిజర్వేషన్‌ ద్వారా కూడా ఆయా వివరాలను రాబడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా నుంచి సుమారు 45 మంది వెళ్ళినట్లు పోలీసు వర్గాలు వివరాలు సేకరించాయి. వారిలో 20 మంది వరకు గుంటూరు నగరానికి చెందిన వారు కావడం కలకలం రేపుతోంది. మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, అచ్చంపేట తదితర ప్రాంతాల్లోనూ 20 మంది వరకు ఉన్నట్లు గుర్తించి వారి ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పరీక్ష చేస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ సమ్మేళనానికి వెళ్ళి వచ్చిన వారి ద్వారానే ఎక్కువగా కరోనా వైరస్‌ సోకడం అందులో హైదరాబాద్‌లో ఒకరు మృతి చెందడం కలకలం రేపుతోంది. వీరంతా ఢిల్లీ నుంచి ఒకే రైలులో ఏసీ బోగీల్లో వచ్చారని, ఇక్కడకు వచ్చిన తరువాత ముందుగా ఓచోట సమావేశమై అక్కడి చర్చాగోష్టి వివరాలను అందరికీ వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాక ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారు ఇప్పటివరకు స్వేచ్ఛగా బయట తిరిగారని దీని వల్ల వైరస్‌ మరింతమందికి సోకే ప్రమాదం ఉంటుందని చుట్టుపక్కల వారు ఆందోళన చెందుతున్నారు.  సమ్మేళనానికి వెళ్ళి వచ్చిన వారిందరికీ సోకే అవకాశం ఉండకపోవచ్చని, అయినప్పటికీ వారందరినీ అనుమానించాల్సిన అవసరం ఉం దని పోలీసు అధికారులు అంటున్నారు. మాచర్ల పట్టణంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో వారి కుటుంబసభ్యులు 29 మందిని 5 అంబులెన్స్‌లలో గుంటూరు తరలించారు. పాజిటివ్‌గా వచ్చిన ఒక కుటుంబంలోని తండ్రి, కొడుకు క్వారెంటైన్‌కి వెళ్లేందుకు అంగీకరించలేదు.


పోలీసులు, వైద్య సిబ్బంది నచ్చజెప్పినా మొండికేశారు. న్యాయమూర్తి సమక్షంలో వస్తామని పట్టుబట్టడంతో వారిద్దరిని మాచర్ల న్యాయమూర్తి వద్ద హాజరుపరిచి అనంతరం గుంటూరు తరలించారు. మరోవైపు కారంపూడిలో ఇద్దరు కరోనా అనుమానితులను అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తరలించారు. ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వీరిరువురు వెళ్లి వచ్చారు. పొగాకు వ్యాపారి ఇచ్చిన విందుకు రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామానికి చెందిన వారు హాజరైనట్లు తెలిసింది. మొత్తం 8 మంది ఆ విందుకు హాజరైనట్లు సమాచారం.  


విదేశాల నుంచి వచ్చిన వారిపై  నిఘా

అర్బన్‌ జిల్లా పరిధిలో విదేశాల నుంచి వచ్చినవారిపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిఘాకొనసాగిస్తున్నారు. అర్బన్‌ జిల్లా పరిధిలో 829 మంది విదేశాల నుంచి రాగా అందులో 41 మంది వివరాలు పోలీసులకు లభించలేదు. మిగిలిన సుమారు 790 మంది కదలికలపై నిఘా ఉంచారు. ఇప్పటికే వారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. 32 మందిని ముందుజాగ్రత్త చర్యగా జ్వరాల ఆసుపత్రి, కాటూరి ఆసుపత్రులలో క్వారంటైన్‌ చేశారు. అంతక ముందు పది మందికి నెగిటివ్‌రాగా డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన 32 మంది క్వారంటైన్‌లో ఉండగా వారి వైద్య పరీక్షల నివేదికలురావాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే మొత్తం 52 మంది వరకు క్వారంటైన్‌లో ఉన్నారు. పోలీస్‌ అధికారులు, వైద్యులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement