5,200 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-13T06:54:56+05:30 IST

లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు నుంచి గోకవరం బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వరకూ శుక్రవారం 5,200మీటర్ల మువ్వన్నెల జాతీయజెండాను ప్రదర్శించారు.

5,200 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

 లాలాచెరువు హౌసింగ్‌బోర్డు నుంచి గోకవరం బస్టాండ్‌ వరకూ ఆవిష్కరించిన మంత్రులు 

 ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు

రాజమహేంద్రవరం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు నుంచి గోకవరం బస్టాండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వరకూ శుక్రవారం 5,200మీటర్ల మువ్వన్నెల జాతీయజెండాను ప్రదర్శించారు. దీనిని రాష్ట్ర సమాచారశాఖ, బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన వేణు, హోంమంత్రి తానేటి వనిత, కలెక్టర్‌ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలసి ఆవిష్కరించారు. తర్వాత ఓ వ్యాన్‌లో రోల్‌గా చుట్టిన ఈ జెండాను బయటకు తీసి, అప్పటికే క్యూకట్టి నిలబడిన విద్యార్థులతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు, వేణు, వనిత మా ట్లాడుతూ  రాష్ట్రమంతా ఇటువైపు చూసేలా అతి పొడవైన జాతీయ జెండాను ప్రదర్శన స్ఫూర్తిదాయకమన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌, గొందేసి పూర్ణచంద్రరెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌, ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో ఇంత ప్రదర్శన చేయ డం అభినందనీయమన్నారు. రాబోయే మూడురోజులపాటు ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలన్నారు. ప్రదర్శనలో రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిళారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, డీఆర్వో బి.సుబ్బారావు, జక్కంపూడి విజయలక్ష్మి, టీకే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. గోకవరం బస్డాండ్‌వద్ద అంబేడ్కర్‌కు నివాళు ర్పించి, జెండా ప్రదర్శన ముగించారు. ఉదయం నుంచి విద్యార్థులు ర్యాలీలో ఉండడం వల్ల ఇబ్బందులు పడ్డారు.

 ట్రాఫిక్‌ ఇబ్బందులు

లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు నుంచి గోకవరం బస్డాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహం వరకూ భారీ జాతీయ జెండా ప్రదర్శించడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లాలాచెరువు జంక్షన్‌, లాలాచెరువు, సీటీఆర్‌ఐ జంక్షన్‌, ప్రభుత్వాసుపత్రి, సెంట్రల్‌ జైలు రోడ్డు, ఆర్ట్స్‌కాలేజీ,  వై.జంక్షన్‌ కంబాలచెరువు సిగల్స్‌, దేవీచౌక్‌, గోకవరం బస్డాండ్‌ సెంటర్లలో రోడ్డుకు ఇరువైపులా ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంకాలం వరకూ చాలామంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రి వద్ద రోగుల రాకపోకలకు అనుకూలంగా కాసేపు జెండాపైకి ఎత్తేవారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను రూట్‌ మళ్లించారు.



Updated Date - 2022-08-13T06:54:56+05:30 IST