వారం రోజుల్లో 503 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ..!

ABN , First Publish Date - 2021-12-15T14:50:34+05:30 IST

గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే.

వారం రోజుల్లో 503 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ..!

కువైత్ సిటీ: గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. వరుస సోదాలతో ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలినవారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇదే కోవలో గడిచిన వారం రోజుల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిపోర్టేషన్ అండ్ టెంపరరీ డిటెన్షన్ అఫైర్స్ వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 503 మంది ప్రవాసులను కువైత్ నుండి బహిష్కరించిందని అంతర్గత మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం పేర్కొంది. ఈ నెల 8వ తేదీ నుంచి 14 వరకు ఈ బహిష్కరణలు జరిగాయి.


ఇక దేశం నుంచి బహిష్కరించిన మొత్తం 503 మంది వలసదారుల్లో 255 మంది పురుషులు, 248 మంది మహిళలు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ థామర్ అలీ సబా అల్ సలేం అల్ సబా, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సభా ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలిన వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరణ కేంద్రాలకు తరలించారు. మునుముందు కూడా ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. 

Updated Date - 2021-12-15T14:50:34+05:30 IST