యస్ మోసం విలువ రూ.5050 కోట్లు.. ఈడీ దర్యాప్తులో వాస్తవాలు

ABN , First Publish Date - 2022-04-23T21:43:40+05:30 IST

న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు రాణా కపూర్, డీహెచ్‌ఎఫ్‌ఎల్(దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వదవాన్‌లు మొత్తం రూ.5050 కోట్ల విలువైన మోసానికి పాల్పడ్డారని

యస్ మోసం విలువ రూ.5050 కోట్లు.. ఈడీ దర్యాప్తులో వాస్తవాలు

న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు రాణా కపూర్, డీహెచ్‌ఎఫ్‌ఎల్(దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వదవాన్‌లు మొత్తం రూ.5050 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. వీరంతా అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించి నిధులు కాజేశారని వెల్లడించింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ప్రత్యేక న్యాయస్థానానికి ఇటివల రెండవ అనుబంధ ఛార్జ్‌షీట్(మొత్తంగా మూడు)ను దాఖలు చేసింది. రాణా కపూర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, వదవాన్ సోదరులు, ఇతరులకు మనీల్యాండరింగ్ కేసులో ప్రమేయం ఉందని స్పష్టం చేసింది. ఈ మోసంలో అధిక మొత్తం నిధులను విదేశాలకు తరలించారు. అందుకే మనీల్యాండరింగ్ నిరోధక చట్టాల కింద విదేశాల్లోని ఆస్తులను నేరుగా అటాచ్ చేయలేకపోతున్నామని ఈడీ తెలిపింది. నేరపూరిత కుట్రలో రాణా కపూర్‌తోపాటు డీహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్ వదవాన్, ధీరజ్ వదవాన్‌తోపాటు ఇతరుల ప్రమేయం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ నిబంధనలకు చట్టవిరుద్ధంగానే నిధులు పక్కదారి పట్టించారు. అవకతవకలకు పాల్పడిన మొత్తం డబ్బు విలువ రూ.5050 కోట్లుగా ఈడీ తేల్చింది.


ఏప్రిల్ 2018 నుంచి జూన్ 2018 మధ్యకాలంలో డీహెచ్ఎఫ్ఎల్‌కు చెందిన రూ.3700 కోట్ల విలువైన డిబెంచర్లను యస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఆ డబ్బును డీహెచ్ఎఫ్ఎల్‌కు బదిలీ చేశాక.. రాణా కపూర్‌, ఆయన కుటుంబానికి చెందిన డీవోఐటీ అర్బన్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్‌కి డీహెచ్ఎఫ్ఎల్‌ రూ.600 కోట్ల విలువైన రుణాన్ని జారీ చేసింది. డీహెచ్ఎఫ్ఎల్‌‌కు చెందిన స్వల్పకాల డిబెంచర్లను కొనుగోలు చేసేందుకు యస్ బ్యాంక్ ప్రజాధనాన్ని వినియోగించింది. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని డీహెచ్ఎఫ్ఎల్‌ ఇంతవరకూ తిరిగి చెల్లించలేదు. మరోవైపు నిబంధనలు పాటించకుండానే రాణా కపూర్ కుటుంబానికి చెందిన కంపెనీ డీయూవీపీఎల్‌కు రూ.600 కోట్ల రుణం ఇచ్చారని ఈడీ వివరించింది.

Updated Date - 2022-04-23T21:43:40+05:30 IST