Abn logo
May 17 2020 @ 02:51AM

సినిమా కష్టాలు

  • ఆగిపోయిన షూటింగ్‌లు..
  • మూతపడ్డ థియేటర్లు..
  • స్తంభించిన చిత్ర పరిశ్రమ
  • 500 కోట్ల విలువైన సినిమాలకు బ్రేక్‌
  • 50 వేల మంది ఉపాధిపై దెబ్బ
  • ప్రభుత్వ ఖజానాకు100 కోట్ల గండి
  • ఈ ఏడాది రిలీజులు సగటులో సగమే?
  • మరికొన్నాళ్లు తప్పని ఇబ్బందులు!


రూ.500 కోట్ల విలువైన సినిమాలకు బ్రేక్‌.. షూటింగ్‌ సగంలో ఆగిన 50 పైచిలుకు సినిమాలు. తెలుగు నేలపై 1700 థియేటర్లు బంద్‌.. 50 వేల మంది ఉపాధిపై దెబ్బ. నిర్మాతలపై పెరుగుతున్న వడ్డీ భారం.. పదుల కోట్ల పన్ను రాబడి పోయి ప్రభుత్వ ఖజానాకు గండి. అవును.. తెలుగు సినీ పరిశ్రమకు కనీవినీ ఎరుగని గడ్డుకాలం. ఇది కరోనా నామ సంవత్సరం. ఊహించని కష్టం!అంచనాలకు అందని నష్టం!!  


యావత్‌ ప్రపంచంతోపాటు తెలుగు సినీ పరిశ్రమకూ ఇప్పుడు మహా గడ్డుకాలం. కరోనా కారణంగా పరిశ్రమలో షూటింగులు మొదలు.. రిలీజుల దాకా అన్నీ ఆగిపోయాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యే సమయానికి విడుదలకు సిద్ధమైన సినిమాలు దాదాపు పాతిక ఉంటే.. సెట్స్‌పై కనీసం మరో 50 సినిమాలున్నాయి. కరోనా దెబ్బతో షూటింగ్‌ ప్రారంభమే కాకుండా ఆగినవీ అంతకు అంత ఉన్నాయి. మొత్తంగా చిత్రనిర్మాణమే పూర్తిగా స్తంభించిపోయింది. వచ్చే ఆగస్టు వరకుగానీ థియేటర్లు, షూటింగుల విషయంలో కొంత వెసులుబాటు రాదనే అంచనాలు వెలువడుతున్నాయి.


అయితే అంతా సిద్ధమై విడుదల ఆగిన సినిమాలు, షూటింగ్‌ మొదలై మధ్యలో నిలిచిపోయిన సినిమాల నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేసి చెప్పడం కష్టమని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి, నిర్మాత టి.ప్రసన్నకుమార్‌ తదితరులు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. కరోనా దెబ్బతో సినిమా పరిశ్రమలో ఈ ఏడాది సినిమా రిలీజుల సంఖ్య సాధారణ సగటుతో పోలిస్తే సగానికి పైగా పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. గత ఏడాది తెలుగులో 269 చిత్రాలు (డైరెక్ట్‌ 193, డబ్బింగ్‌ 76) విడుదల కాగా, ఈ ఏడాది అందులో సగమైనా ఉండే పరిస్థితి లేదు.


ఉపాధి కష్టం!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1100 నంచి 1200 సినిమా హాళ్లు. సుమారు 500 మల్టీప్లెక్స్‌ స్ర్కీన్లు కలిపి మొత్తం 1600 నుంచి 1700 దాకా ఉంటాయి. వీటితో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య 25 వేల వరకు ఉంటుంది. వీరే కాకుండా.. థియేటర్లకు అనుబంధంగా ఉన్న క్యూబ్‌ లాంటి సంస్థల సిబ్బంది, డిస్ట్రిబ్యూషన్‌ సర్కిల్‌ సిబ్బంది వంటివారు మరో 10 వేల మంది ఉంటారు.


అంటే, ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్లలో మొత్తం కలిపి 35 వేల మంది ఉండే అవకాశముంది. ఇక చిత్రనిర్మాణంలో సినిమా స్థాయిని బట్టి ఒక్కో సినిమా షూటింగులో 100 నుంచి 250 మంది యూనిట్‌ రోజూ పనిచేస్తుంటారు. సగటున 150 మంది అనుకోవచ్చు. ఏడాదిలో మొత్తం రిలీజులు 150 అనుకుంటే.. రోజుకు 7500 మంది వివిధ సినిమాల షూటింగు పనుల్లో ఉంటారు. మరోవైపు ప్రొడక్షన్‌ ఆఫీసుల్లో, ఫిల్మ్‌ ల్యాబుల్లో మరో 7500 మంది పనిలో ఉంటారు. అంటే, ఒక్క ప్రొడక్షన్‌ సెక్టార్‌లోనే రోజుకు 15 వేల మంది దాకా ఉపాధి పొందుతుంటారనుకోవచ్చు. ఇలా.. ప్రొడక్షన్‌, ఎగ్జిబిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్లన్నీ కలిపితే రోజుకు 50వేల మంది సినిమాపై ఆధారపడి ఉంటారు. కరోనా దెబ్బతో వీళ్లందరి జీవనోపాధి దెబ్బతింది.  


ప్రభుత్వ ఆదాయానికీ గండి.. 

సినీ పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం విషయంలో ప్రభుత్వంపైనా కరోనా దెబ్బ పడింది. తెలుగు చిత్రసీమలో ఏటా సగటున 150 నుంచి 190 దాకా స్ట్రెయిట్‌ సినిమాలు, 50 నుంచి 70 దాకా డబ్బింగ్‌ చిత్రాలు విడుదలవుతుంటాయి. కేవలం స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాల లెక్క చూసినా తెలుగు సినీపరిశ్రమ టర్నోవర్‌ సుమారు 1000 కోట్లు ఉంటుంది. రూ.1500 కోట్ల మేర వ్యవహారం సాగినప్పుడే ఆ టర్నోవర్‌ సాధ్యం. కానీ, కరోనా దెబ్బతో కనీసం నాలుగు నెలలపాటు పరిశ్రమ స్తంభించిపోనుంది. ఈ మూడోవంతు కాలాన్ని తీసేసి.. మిగిలిన రెండొంతుల కాలంలోని సినీ వ్యాపారం మీద ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం రావాలి. వినోదపు పన్ను స్థానంలోవసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీ ప్రకారం.. ఈ కరోనా కాలానికి ప్రభుత్వానికి అధికారికంగా రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల మేర ఆదాయం రావాలి. సినీరంగంలోని కాకిలెక్కలు, తిరకాసులు పరిగణనలోకి తీసుకున్నా రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర వచ్చేది.


పరిశ్రమకు అనుబంధమైన ఇతర పనులపై వచ్చే అదనపు పన్నుల ఆదాయం మరో 50 నుంచి 60 కోట్ల దాకా ఉంటుంది. ఈ రెండూ కలుపుకొంటే రూ.100 నుంచి 120 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి పడినట్లే. పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.  ప్రముఖ నిర్మాత, స్టూడియో అధినేత, పంపిణీదారు డి.సురేశ్‌బాబు చెప్పినట్టు.. కరోనా నుంచి బయటపడ్డామనుకుంటున్న చైనాలో సైతం అన్నీ సాధారణ స్థితికి వచ్చినా, షూటింగులు, థియేటర్లు ఇప్పటికీ మొదలే కాలేదు. హాలీవుడ్‌ సహా ప్రపంచమంతా ఇదే సమస్య ఉందని గమనించి.. ముందడుగు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా పరిశ్రమ రీ ఓపెనింగ్‌కు తొందరపడితే ఇబ్బంది పడతాం! అంటే సినిమాకు కరోనా కష్టాలు మరికొన్నాళ్లు తప్పవనేగా!


ఆగిన సినిమాల విలువ రూ.500 కోట్లు!

షూటింగుల రద్దుతో దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌, హీరో చిరంజీవి నటిస్తున్న ఆచార్య, వెంకటేశ్‌.. నారప్ప, బాలకృష్ణ, ప్రభాస్‌ తదితరుల కొత్త ప్రాజెక్టులు సహా కనీసం పది మంది పెద్ద హీరోల సినిమాలు మధ్యలో ఆగాయి. మరో 40 దాకా చిన్న చిత్రాలు సగంలో నిలిచిపోయాయి. రాజమౌళి సినిమాకు రూ.200 కోట్లు, పెద్ద హీరోల చిత్రాలన్నీ కలిపి మరో 200 కోట్లు, చిన్న సినిమాలకు తలా రెండున్నర కోట్లు అని లెక్క వేసుకున్నా.. కరోనా కాలంలో అండర్‌ ప్రొడక్షన్‌లో దాదాపు 500 కోట్ల విలువైన సినిమాలు ఆగిపోయినట్టే! ఈ సినిమాల నిర్మాణం కోసం ఫైనాన్షియర్ల నుంచి అప్పులు తేవడం సహజం. నెలకు రెండున్నర రూపాయల వడ్డీ వేసుకొన్నా, ఆగిపోయిన సినిమాల మీద గత రెండు నెలల్లోనే పాతిక కోట్ల దాకా వడ్డీ భారం పడుతుంది. మొత్తం అంతా ముందే అప్పు తెచ్చి ఉండరనుకున్నా.. కనీసం 15 కోట్ల వడ్డీ నిర్మాతలపై పడి ఉంటుంది. 

-డాక్టర్ రెంటాల జయదేవ(నవ్య డెస్క్)‌

ఇవి కూడా చదవండిImage Caption

బొమ్మ పడేదెప్పుడు?ఎప్పటి నుంచి షూటింగ్‌?అప్పట్లోనూ ఇలాగే...సీరియల్‌ కన్నీళ్లుసినీ రథం కదిలినట్టేనా?అరచేతిలో వినోద వైకుంఠం నట్టింట్లో విడుదల తెరపై సీన్‌ మారిపోనుంది! పరిశ్రమా? ఫలించని శ్రమా?

Advertisement
Advertisement
Advertisement