టీకొట్టుకు 50వేలు కొట్టు

ABN , First Publish Date - 2022-07-28T09:43:58+05:30 IST

గుంటూరులోని ఎస్‌వీఎన్‌ కాలనీ నాలుగో లైను మెయిన్‌ రోడ్డుపై ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని కాంప్లెక్స్‌ ఎదుట షెడ్‌ వేశారు. ఇది తెలుసుకున్న అధికార పార్టీ నేత

టీకొట్టుకు 50వేలు కొట్టు

షెడ్‌ వేసినా,మెట్టు కట్టినా కప్పం కట్టాల్సిందే 

దందాలో వైసీపీ నాయకుల దూకుడు

వాటా ఇవ్వలేదని కాంప్లెక్స్‌ మెట్లు ధ్వంసం

కాంప్లెక్స్‌గా మార్చిన బార్‌పై 5లక్షలు వసూలు

ప్రధాన నేతకు 3లక్షలు, చోటా నేతలకు 2లక్షలు

గుంటూరులో ప్రతి ‘అనుమతి’కీ ఒక్కో రేటు..

‘లొసుగులు’ పట్టుకుని లక్షలు లాగేస్తున్న వైనం


గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గుంటూరులోని ఎస్‌వీఎన్‌ కాలనీ నాలుగో లైను మెయిన్‌ రోడ్డుపై ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని కాంప్లెక్స్‌ ఎదుట షెడ్‌ వేశారు. ఇది తెలుసుకున్న అధికార పార్టీ నేత ఒకరు అతడిపై బెదిరింపులకు దిగాడు. అనుమతి లేకుండా షెడ్‌ ఎలా వేస్తావంటూ బదాయించాడు. తనకు మామూలు ఇస్తే ‘అంతా సరి అయిపోతుంది’ అంటూ బేరానికి దిగాడు. దీంతో బాధితుడు రూ. 50 వేలు ఇచ్చి దండం పెట్టాడు. ఇలా గుంటూరులో వెలుగు చూస్తున్న అధికార పార్టీ నేతలు, కార్పొరేటర్ల దందాలకు, మామూళ్ల వసూళ్లకు అంతం లేకుండా పోతోంది. చిన్న టీకొట్టు, బడ్డీ కొట్టు మొదలు భారీ షాపింగ్‌ కాంప్లెక్సులు, రెస్టారెంట్ల వరకూ దేన్నీ వదలకుండా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వాటి నిర్వహణలోని చిన్న ‘లొసుగుల’లను పట్టుకుని పేద్ద బేరాలకు దిగుతున్నారు. అవకాశమున్న ప్రతిఅంశాన్నీ ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు ఇల్లు లేదా షాపు రోడ్డు మార్జీన్‌లో టీ కొట్టు పెట్టుకోవాలంటే ఒక రేటు, భవనాన్ని నవీకరించాలంటే ఇంకో రేటు, రెస్టారెంటు నడపాలంటే దానికి సపరేటు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లో షాపు పోకుండా ఉండాలంటే మరో రేటు.. ఇలా ప్రతి దానికీ రేటు ఫిక్స్‌ చేసి పిండేస్తున్నారు. ఉదాహరణకు కార్పొరేటర్‌గా ఓడిపోయిన ఒకరు గుంటూరులోని ఎన్టీఆర్‌ స్టేడియం ఎదుట ఉన్న కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌పై దందాకు దిగాడు. కాంప్లెక్స్‌లో ఉన్న ఒక్కో షాపునకు రూ.2 లక్షలు చొప్పున మామూలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఆక్రమణలు ఉన్నాయని, పార్కింగ్‌ లేదని కార్పొరేషన్‌ అధికారుల ద్వారా బెదిరింపులకు దిగాడు. షాపులకు వెళ్లే మెట్లను కూల్చేశాడు. ఒత్తిడి భరించలేని బాధితులు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఇటీవల ‘లాభసాటి’గా ఈ దందాకు తెరపడింది. గుంటూరు సిటీ పరిధిలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... నవభారత్‌నగర్‌లో ఉన్న ఓ రెస్టారెంటు నిర్వాహకుణ్ణి బెదిరించి అధికార పార్టీ నేత ఒకరు లక్ష రూపాయలు వసూలు చేసుకున్నారు. రామచంద్రాపురంలో నిర్మించిన భవనానికి అనుమతి లేదన్న నెపంతో అధికార పార్టీ నేత ఒకరు రూ.నాలుగు లక్షలు దండుకున్నాడు. లక్ష్మీపురంలో ఓ ఆస్పత్రి స్థానంలో కమర్షియల్‌ కాంప్లెక్సు నిర్మిస్తున్నందుకు ఓ అధికార పార్టీ నేత రూ.మూడు లక్షలు గుంజారు. అదే ప్రాంతంలో ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్వాహకుడైన టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ నేత అనుచరుడి నుంచి రూ.రెండు లక్షలు వసూలు చేశారు. అక్కడే ప్రధాన రోడ్డులో టీ, టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకున్న టీడీపీ కార్యకర్త ఒకరి నుంచి రూ.50 వేలు లాగేశారు. జేకేసీ రోడ్డులో ఓ బార్‌ను కమర్షియల్‌ కాంప్లెక్సుగా మారుస్తున్నందుకు రూ.ఐదు లక్షలు వసూలు చేసి... వాటాలు వేసుకుని ఐదు లక్షలు ఓ ప్రజాప్రతినిధి, రెండు లక్షలు స్థానిక నేతలు పంచుకున్నారు. కాగా, నేతల దందా ఇంత బాహాటంగా సాగిస్తున్నప్పటికీ అధికారులు ఆ వైపు చూడటం లేదు. పైపెచ్చు కార్పొరేషన్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు వారికి సహకరిస్తున్నారని చెబుతున్నారు. 

Updated Date - 2022-07-28T09:43:58+05:30 IST