audio leak: 50 వేలేంది.. మంచి అమౌంట్‌ ఇప్పిద్దాం!.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-30T09:07:06+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. ఒక ఎంపీటీసీ సభ్యుడితో ఫోన్‌లో జరిపిన సంభాషణ వివాదానికి దారితీసింది.

audio leak: 50 వేలేంది.. మంచి అమౌంట్‌ ఇప్పిద్దాం!.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

  • కొందరు పి.. కుంట్లోళ్లు ఉన్నరు.. పోతే పోనీ
  • ఎంపీటీసీతో మంత్రి కొప్పుల ఈశ్వర్‌  వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఆడియో లీక్‌.. ఈసీ విచారణకు కాంగ్రెస్‌ డిమాండ్‌


పెద్దపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. ఒక ఎంపీటీసీ సభ్యుడితో ఫోన్‌లో జరిపిన సంభాషణ వివాదానికి దారితీసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ సభ్యులపైనా, నామినేటెడ్‌ పదవిలో ఉన్న ఓ నాయకుడిపైనా మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో లీక్‌ అయి.. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం సంచలనం సృష్టించింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు ఫోన్‌ చేసిన మంత్రి కొప్పుల, ‘‘ ఏం వెంకటేశ్‌! అందర్ని జమ చేస్తున్నవట! అవతలి వాళ్లిచ్చే రూ.50 వేలే కావాల్నా? మేమిచ్చేది అవసరం లేదా?’’ అంటూ ప్రశ్నించారు. తాను ఎవరినీ జమ చేయలేదని, తన వద్దకు వస్తే తీసుకోలేదని వెంకటేశ్వర్లు చెప్పగా, ‘‘అందరూ నీ పేరే చెప్తున్నరు. ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడు. వాళ్ల పేరు, వీళ్ల పేరు ఎందుకు చెప్పుతవ్‌? పైసలు కావాలంటే ఇప్పించేది మనమే. 


ఏం చేయాల న్నా చేసేది మనమే. వేరేటోడికి మంది ఉన్నరా? మనకు 900 మంది ఉన్నరు’’ అని మంత్రి కొప్పుల అన్నారు. అయితే తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి వద్దకూ వెళ్లలేదని వెంకటేశ్వర్లు బదులిచ్చారు. దీంతో, ‘‘కొందరు పి.. కుంట్లోళ్లు ఉన్నరు. వాళ్లు పోతే పోనియ్యి. రఘువీర్‌సింగ్‌ అనేటోడు పి.. కుంట్లోడు. ఉంటే ఉంటడు.. పీకితే పీ కుతడు. పుట్ట మధు వాళ్లు ఈటల రాజేందర్‌తో పోతరు. నువ్వు కూడా పోతవా?’’ అ ని మంత్రి ప్రశ్నించారు. తనకు ఆ అవసరం లేదని వెంకటేశ్‌ చెప్పగా.. ఎవరన్నా వస్తే తన వద్దకు తీసుకురావాలని మంత్రి అన్నారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరస్‌ కావడంతో.. దీనిని ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుని మంత్రి వ్యాఖ్యలపై విచారణ జరపాలని ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.


ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిపై అట్రాసిటీ కేసు

ఖానాపూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీలో నిలిచిన  పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రాజేశ్వర్‌ రెడ్డి తనను కులం పేరుతో దూషించారంటూ నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ జడ్పీటీసీ సభ్యురాలు శారద ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసినట్లు సీఐ అజయ్‌బాబు తెలిపారు. 



Updated Date - 2021-11-30T09:07:06+05:30 IST