దళిత బంధుకు 50 కోట్లు

ABN , First Publish Date - 2022-06-25T08:44:14+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిధుల కొరత వల్ల మందకొడిగా సాగుతోంది. సర్కారు ప్రకటించిన విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో..

దళిత బంధుకు 50 కోట్లు

యూనిట్ల గ్రౌండింగ్‌కు మరో 800 కోట్లు

అవసరమని అధికారుల ప్రతిపాదన

ఇప్పటికీ పూర్తి కాని మొదటి దశ పథకం

2021-22లో 4441 కోట్ల కేటాయింపు

నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు

మండలాల్లో తేలని కుటుంబాల లెక్క

షెడ్యూల్‌ ప్రకారం ఇంకా మొదలు కాని..

రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం నిధుల కొరత వల్ల మందకొడిగా సాగుతోంది. సర్కారు ప్రకటించిన విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో దళిత బంధు రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. కానీ నిధుల కొరత వల్ల మొదటి విడత పథకమే పూర్తిగా అందలేదు. 2021-22లో దళిత బంధుకు ప్రభుత్వం రూ.4,441 కోట్లు కేటాయించింది. 2021-22లో కేవలం రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ అంచనా వేసిన ప్రభుత్వం అందుకు నాలుగున్నర రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించి, విడుదల చేసింది. అయినా దళిత బంధు మొదటి దశ పూర్తి చేసేందుకు మరో రూ.800కోట్లు అవసరమని ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.


ఈ ప్రతిపాదనల పరిశీలన అనంతరం ప్రభుత్వం శుక్రవారం రూ.50 కోట్లు విడుదల చేసింది. దీంతో ఆ నిధులను అవసరమైన యూనిట్లకే సర్దుబాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2021-22లో దళిత బంధుకు రూ.4,441 కోట్లు కేటాయించగా అందులో రూ.2వేల కోట్లు హుజూరాబాద్‌ నియోజకవర్గానికే సరిపోయాయి. సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 76 మందికొ రూ.7.60కోట్లు విడుదల చేశారు. మిగతా మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఖర్చు చేశారు.


అసంపూర్తిగా మిగిలిన యూనిట్లు..

దళిత బంధు పథకంలో లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది. ఆ మొత్తంలో రూ.10 వేలు దళిత రక్షణ నిధికి మినహాయించి రూ.9.90 లక్షలు లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో జమచేసి.. కలెక్టర్‌ అనుమతితో యూనిట్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు. అయితే వాహనాల వంటి యూనిట్లకు ఒకేసారి నిధులు విడుదల చేస్తుండగా.. బర్లు, గొర్రెల యూనిట్లకు దశల వారీగా నిధులు విడుదల చేస్తున్నారు. మొదట షెడ్ల నిర్మాణం, తర్వాత యూనిట్ల కొనుగోలుకు నిధులు ఇస్తున్నారు. కొంత మంది ఇప్పటికే షెడ్లు నిర్మించుకున్నా నిధుల కొరత వల్ల బర్లు, గొర్రెల యూనిట్లు అందలేదు. వాహనాల తర్వాత రెండో స్థానంలో పాడి పరిశ్రమకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. దళితబంధు ఆర్థిక సహాయంతో సొంతంగా సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో అప్పటి వరకు చేస్తున్న పని మానుకోవడంతో ఇటు దళిత బంధు యూనిట్‌ పూర్తికాక, అటు చేసే పని లేక లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఆ 4 మండలాల్లో ఇంకా తేలని లెక్క..

సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి, హుజూరాబాద్‌తోపాటు తెలంగాణకు నలువైపులా ఉన్న నాలుగు ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో సాచురేషన్‌ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాసాలమర్రి, హుజూరాబాద్‌లో దళిత కుటుంబాల ఎంపిక పూర్తయినా.. ఆ నాలుగు మండలాల్లో ఇప్పటికీ దళిత కుటుంబాల లెక్క పూర్తికాలేదు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌.. మండలాల్లో దళిత కుటుంబాల లెక్క ఇంత వరకూ తేలలేదు. దీంతో అంచనా మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ముందుకు సాగుతున్నారు.

Updated Date - 2022-06-25T08:44:14+05:30 IST