చిన్ని చేతులు.. పెద్ద సాయం.. ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోయాడు

ABN , First Publish Date - 2020-07-28T22:57:12+05:30 IST

అనీశ్వర్ కుంచాల.. ఈ పేరు నిన్న, మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ చిన్నారి ఓ సెలబ్రిటీ. కష్టాల్లో ఉన్నవారికి ఎలాగైనా..

చిన్ని చేతులు.. పెద్ద సాయం.. ఒక్క రోజులో సెలబ్రిటీ అయిపోయాడు

లండన్: అనీశ్వర్ కుంచాల.. ఈ పేరు నిన్న, మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆ చిన్నారి ఓ సెలబ్రిటీ. కష్టాల్లో ఉన్నవారికి ఎలాగైనా సాయం చేయాలనే అతడి గొప్ప మనసే అతడిని సెలబ్రిటీని చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన అనీశ్వర్ తల్లిదండ్రులతో పాటు ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో ఉంటున్నాడు. అనీశ్వర్ కూడా అందరు చిన్నారులలానే స్కూల్, చదువు, ఫ్రెండ్స్, ఆటలు.. ఇలా హాయిగా జీవితం గడిపేవాడు. కానీ ఒక్కసారిగా వచ్చిన కరోనా వల్ల అతడు ఇంటికే పరిమితమైపోయాడు. తన చుట్టు మారిపోతున్న పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయాడు. కరోనా కారణంగా ఎంతో మంది చనిపోతున్నారని, మరెంతో మంది తిండికూడా లేక బాధపడుతున్నారని తెలుసుకున్నాడు. దీంతో అనీశ్వర్‌కు చాలా బాధకలిగింది. వారికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. కానీ తన వయసు కేవలం 5ఏళ్లు.


ఈ వయసులో తానేం చేయగలను అనుకుని బాధపడసాగాడు. ఈ తరుణంలో థామస్ మూర్ అనే వ్యక్తి అనీశ్వర్‌‌కు మార్గదర్శనం చేశాడు. మూర్ వయసు 100ఏళ్లు. ఆ వయసులో ఓ సర్కిల్ చుట్టూ 100 రౌండ్లు నడిచి కూడా కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. మూర్ మార్గదర్శనంతో అనీశ్వర్‌కు ఓ మార్గం కనపడింది. వెంటనే తన స్నేహితులు, వారి స్నేహితులు కలిపి మొత్తం 60 మంది చిన్నారులను పోగు చేశాడు. వారందరితో కలిసి ఏకంగా 3,200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కి విరాళాలు సేకరించాడు. ఊహించని విధంగా రూ.3,70,000 వసూలయ్యాయి.


ఈ విషయంత తెలిసి స్థానిక నాయకులంతా అనీశ్వర్‌ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ బ్రిటీష్‌ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్ తో పాటు మరికొంత మంది స్థానిక రాజకీయ నాయకులు అనీశ్వర్‌ను, అతడి తల్లిదండ్రులను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. మరికొంత మంది కూడా అతడిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే తాను సేకరించిన మొత్తాన్ని అనీశ్వర్ భారత్‌కు అందించనున్నాడు. తదుపరి ఇంగ్లాండ్‌కు సాయం చేసేందుకు ఓ క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నాడు.


Updated Date - 2020-07-28T22:57:12+05:30 IST