5 వేలిస్తే రైతులు కోటీశ్వరులవుతారా?

ABN , First Publish Date - 2022-08-10T09:37:11+05:30 IST

వ్యవసాయానికి సంబంధించిన అన్ని పథకాలు బంద్‌ పెట్టి..

5 వేలిస్తే రైతులు కోటీశ్వరులవుతారా?

కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం

రేవంత్‌ ఓ దొంగ.. అందుకే ప్రజలు ఓడించారని వ్యాఖ్య

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో పాదయాత్ర ప్రారంభం

సభలో టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి


వికారాబాద్‌/కొడంగల్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వ్యవసాయానికి సంబంధించిన అన్ని పథకాలు బంద్‌ పెట్టి.. రైతు బంధు కింద రూ.5 వేలు ఇస్తున్నానని కేసీఆర్‌ గొప్పగా చెబుతున్నారని, ఆ డబ్బుతో రైతులు కోటీశ్వరులవుతారా? అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌ దుర్మార్గ పాలనలో.. రాష్ట్రంలో నడి రోడ్డుపై లాయర్లను నరికి చంపినా అడిగేవాళ్లు లేకుండా పోయారని, మహిళలు, చిన్న పిల్లలకు రక్షణ కరువైందని ఆరోపించారు.


షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 117వ రోజు మంగళవారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని బండల ఎల్లమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఆలయంలో పూజల అనంతరం వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమె అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పుల పాలై ఎనిమిదేళ్లలో 8 వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఆ పాపం కేసీఆర్‌ది కాదా? అని నిలదీశారు.  రూ.35 వేల కోట్లున్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచారని, అయినా ఎనిమిదేళ్లుగా అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ డబ్బంతా కేసీఆర్‌, ఆయన కుటుంబం, టీఆర్‌ఎస్‌ నాయకులు కమీషన్ల రూపంలో తినేశారని ఆరోపించారు. గోల్కొండ సిపాయి గోడ కడితే కోడి గుడ్డు తగిలి కూలిన చందంగా కాళేశ్వరం మూడేళ్లలోనే మునిగిపోయిందని, అయినా ఎవరిపైనా చర్యలు లేవని తప్పుబట్టారు. కేసీఆర్‌ ఎంత మోసం చేశారో.. ప్రజల పక్షాన ప్రశ్నించకుండా కాంగ్రెస్‌, బీజేపీ అంతే మోసం చేశాయని షర్మిల వ్యాఖ్యానించారు. చిన్న దొర కేటీఆర్‌ కాలికి దెబ్బ తగిలి మెదడు పనిచేయడం లేదని, ఒక్క మాట కూడా గుర్తుండడం లేదని ఎద్దేవా చేశారు.


కొడంగల్‌ ప్రజలు చాలా తెలివైనవాళ్లని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ను ఓడించారని షర్మిల అన్నారు. ఇక్కడ చెల్లని ముఖాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి అధ్యక్షుడిని చేసిందని, ఆ ముఖం రాష్ట్రం మొత్తం చెల్లుతుందా? అని అన్నారు. ఒక దొంగ చేతుల్లో నుంచి కొడంగల్‌ను కాపాడుకుంటే.. ఇంకో దొంగ చేతుల్లోకి పోయిందని, అక్రమాలు, భూ సెటిల్‌మెంట్లు తప్ప టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రజలకేమైనా చేశారా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న బీజేపీ ఎన్ని లక్షల ఉద్యోగాలిచ్చిందని ప్రశ్నించారు. షర్మిల సభలో టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. టీఆర్‌ఎ్‌సకు చెప్పకుండా వేరే పార్టీలోకి వెళ్లనని ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-10T09:37:11+05:30 IST