రూ.600 మందుకు 5 వేలా?

ABN , First Publish Date - 2021-04-08T07:22:08+05:30 IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

రూ.600 మందుకు 5 వేలా?

  • విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
  • కార్పొరేట్‌ ఆస్పత్రులు మానవత్వంతో వ్యవహరించాలి
  • రాష్ట్రంలో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఉండవు
  • పరిస్థితులు చేజారితే క్లబ్బులు,పబ్బులు బంద్‌
  • రోజుకు లక్షన్నర మందికి టీకా వేసే ఏర్పాట్లు
  • అవసరమైతే రోజుకు లక్ష పరీక్షలు: ఈటల

హైదరాబాద్‌/సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వైరస్‌ సోకిన వారికి ఎలాంటి చికిత్సలు అందించాలి? ఎంత చార్జీలు వసూలు చేయాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్‌ జారీ చేసిందని.. అయినా కార్పొరేట్‌ ఆస్పత్రులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.600 ఔషధానికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారని.. ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే రోజుకు లక్ష టెస్టులు చేస్తామన్నారు. బుధవారం ఆయన వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు ఉండవని స్పష్టం చేశారు. అవసరమైతే బార్లు, క్లబ్బులు, పబ్బులు వంటి వాటి మూసివేతపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ప్రైవేటు, కార్పొరేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు పెట్టుకోవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కొవిడ్‌ చికిత్స పొందాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకొస్తే మంచి చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. కేసులు ఎక్కువగా ఉన్నా మరణాల శాతం 0.5గానే ఉందన్నారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్మెంట్‌ పకడ్బందీగా చేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు పెట్టామన్నారు. తొలి వేవ్‌లో 70ు లక్షణాల్లేని కేసులొస్తే, ఇప్పుడు 90ు వస్తున్నాయని చెప్పారు. 


ప్రస్తుతం రోజుకు 56 వేల మందికి టీకా ఇస్తున్నామని, త్వరలో 1.50 లక్షల మందికి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎఫ్‌టీసీఐ సదస్సులో నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. రెమ్‌డెసివర్‌ రూ.600కే దొరుకుతున్నా, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.5 వేలు వసూలు చేస్తున్నారని వాపోయారు. మహారాష్ట్ర సర్కారు ఓ సర్క్యులర్‌ జారీ చేయడంతో ఈ ఔషధం ధరలు దిగి వచ్చాయని మంత్రి ఈటల దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి.. ‘‘కరోనా పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. లైసెన్స్‌ రద్దు చేయడమో, మరో విఽధంగా నియంత్రించడం వల్లనో ఉపయోగం లేదు. మరోసారి కార్పొరేట్‌ ఆస్పత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వంతో వ్యవహరించండి. మెరుగైన వైద్య సేవలందించండి. రోగులను అర్థం చేసుకుని మెరుగైన చికిత్స అందించాలి తప్ప వ్యాపార థృక్పథంతో వ్యవహరించకూడదు. కరోనా చికిత్సను వ్యాపారంగా మార్చవద్దని కోరుతున్నా. రూ.లక్షల్లో ఖర్చయ్యే ఆస్కారం లేదు. ఐసీయూలో ఉంటే రూ.20-30 వేలు వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి చోట రూ.లక్షలు వసూలు చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. 


నేను మళ్లీ అభ్యర్థిస్తున్నా. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల తీరు మారాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు’’ అని సున్నితంగా హెచ్చరించారు. వైరస్‌ నివారణ మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించారు. సదస్సులో సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘నూతన సాంకేతికతలు వచ్చిన తర్వాత కరోనా చికిత్సా విధానం కూడా మారింది. జన్యు నిర్మాణం ఆధారంగా కూడా చికిత్స చేస్తున్నారు. అయితే సవాళ్లు కూడా అదే రీతిలో ఉన్నాయి. కరోనాను మన దేశం నిర్వహిస్తున్న తీరు అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఆదర్శప్రాయంగా ఉంది’’ అన్నారు. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ అధ్యక్షుడు కె.హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు కానీ, ఎవరూ దానికి ప్రాధాన్యమివ్వరని అన్నారు. కరోనా మహమ్మారి దీని ప్రాధాన్యాన్ని తెలిపిందన్నారు. ఆయుష్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ వీఎస్‌ అలగు వర్షిణి మాట్లాడుతూ.. నేచర్‌ క్యూర్‌, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, రామాంతపూర్‌లోని హోమియోపతి కేంద్రాలను 1050 పడకల ఆస్పత్రిగా మారుస్తున్నామని.. ఎవరైనా క్వారంటైన్‌లో ఉండడానికి ఇబ్బందిగా ఉంటే ఇక్కడ చేరవచ్చని తెలిపారు.

Updated Date - 2021-04-08T07:22:08+05:30 IST