టెకీలకు వేతనోత్సాహం!

ABN , First Publish Date - 2020-10-25T09:57:49+05:30 IST

కరోనా కష్టాల నుంచి కార్పొరేట్‌ రంగం పూర్తిగా బయటపడలేదు. ఇప్పటికీ పలు రంగాల్లోని కంపెనీల్లో వేతన కోతలు కొనసాగుతున్నాయి. కీలకేతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు కత్తి వేలాడుతూనే ఉంది...

టెకీలకు వేతనోత్సాహం!

  • 5 ప్రముఖ ఐటీ కంపెనీల్లో సిబ్బందికి శాలరీ హైక్స్‌ 

కరోనా కష్టాల నుంచి కార్పొరేట్‌ రంగం పూర్తిగా బయటపడలేదు. ఇప్పటికీ పలు రంగాల్లోని కంపెనీల్లో వేతన కోతలు కొనసాగుతున్నాయి. కీలకేతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు కత్తి వేలాడుతూనే ఉంది. ఐటీ రంగంలో మాత్రం పరిస్థితులు మెరుగ్గానే కన్పిస్తున్నాయి. పైగా, 5 సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ సిబ్బందిలో పండగకు ముందే ఉత్సాహం నింపాయి. ఉద్యోగుల జీతాలు పెంచాలని దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రాతో పాటు మధ్యస్థాయి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైండ్‌ట్రీ నిర్ణయం తీసుకున్నాయి. జూలై-సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. 


టీసీఎస్‌ 

ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాదు, ఉద్యోగుల్లో నైపుణ్య సామర్ధ్యాలు పెంచేందుకు భారీ ఎత్తున శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపింది. సెప్టెంబరు త్రైమాసికంలో టీసీఎస్‌ ఉద్యోగులందరూ నైపుణ్య శిక్షణలో పాల్గొన్న సమ యం కోటి గంటలపైమాటే.సెప్టెంబరు నాటికి కంపెనీలో 4,53,540 మంది పనిచేస్తున్నారు. 


ఇన్ఫోసిస్‌ 

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఉద్యోగులకు జీతాలు పెంచడంతోపాటు అన్ని స్థాయిల్లోనూ ప్రమోషన్లు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, సెప్టెంబరు త్రైమాసికానికి అద్భుతమైన పనితీరు కనబర్చినందుకు గాను ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో కూడిన 100 శాతం వేరియబుల్‌ పే చెల్లిస్తున్నట్లు తెలిపింది. గత నెల చివరి నాటికి కంపెనీలో మొత్తం 2,40,208 మంది పనిచేస్తున్నారు. 


హెచ్‌సీఎల్‌ 

ఈ అక్టోబరు 1 నుంచి ఈ3 స్థాయి ఉద్యోగుల జీతాలు పెంచుతున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ తెలిపింది. ఈ4, ఆపై స్థాయి ఉద్యోగుల వేతనాలు మాత్రం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెరగనున్నాయి. ఈసారి శాలరీ హైక్‌ గత ఏడాది స్థాయిలోనే ఉండనుంది. గతసారి కంపెనీ భారత్‌లోని ఉద్యోగులకు సరాసరిగా 6 శాతం, విదేశీ ఉద్యోగులకు సరాసరిగా 2.5 శాతం పెంచింది. ప్రస్తుతం  కంపెనీలో 1,53,085 మంది పనిచేస్తున్నారు.


టెక్‌ మహీంద్రా 

వచ్చే ఏడాదిలో ఉద్యోగుల జీతాలను దశల వారీగా పెంచనున్నట్లు టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. మార్చిలోగా జూనియర్‌ సిబ్బందికి, ఆ తర్వాత సీనియర్‌ ఉద్యోగులకు పెంచనున్నట్లు వెల్లడించారు. అయితే, ఎంత మొత్తంలో పెంచాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గత నెల చివరి నాటికి టెక్‌ మహీంద్రాలో 1,24,258 మంది ఉద్యోగులున్నారు. 


మైండ్‌ట్రీ 

జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఉద్యోగులకు జీతాల పెంపును ప్రకటించింది. వేతన పెంపు ఇండస్ట్రీ ప్రమాణాలకు తగ్గట్లుగా ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే ప్ర మోషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. సంస్థలో 21,827 మంది ఉద్యోగులున్నారు. 


ఐటీ గట్టెక్కినట్టే..

ఇప్పటివరకు త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన ఐటీ కంపెనీల్లో విప్రో మినహా అన్నీ ఆశాజనక పనితీరునే కనబర్చాయి. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కామంటోన్న కంపెనీలు.. భవిష్యత్‌పై ఆశావహంగా ఉన్నాయి.  కొత్త కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్‌ కూడా ఇదే సంకేతమిస్తున్నాయి. 


Updated Date - 2020-10-25T09:57:49+05:30 IST