కర్ణాటక ఒమైక్రాన్ బాధితుని కలిసినవారిలో ఐదుగురికి పాజిటివ్!

ABN , First Publish Date - 2021-12-03T00:29:50+05:30 IST

భారత దేశంలో మొట్టమొదట నమోదైన ఒమైక్రాన్ కేసుల్లో

కర్ణాటక ఒమైక్రాన్ బాధితుని కలిసినవారిలో ఐదుగురికి పాజిటివ్!

బెంగళూరు : భారత దేశంలో మొట్టమొదట నమోదైన ఒమైక్రాన్ కేసుల్లో ఒకరితో కాంటాక్ట్ అయినవారిలో ఐదుగురికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. ఈ ఐదుగురి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబొరేటరీలకు పంపించినట్లు పేర్కొంది.


మరోవైపు ఈ ఇద్దరు బాధితుల్లో ఒకరు పూర్తిగా వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారని, మరొకరు పాక్షికంగా వ్యాక్సినేషన్ పొందారని తెలుస్తోంది. వీరిద్దరికీ ప్రత్యక్ష సంబందాలేవీ లేవు. 66 ఏళ్ల వయసుగల ఒమైక్రాన్ బాధితుడు మాత్రమే దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు, 46 ఏళ్ళ వయసుగల వ్యక్తికి అటువంటి ట్రావెల్ హిస్టరీ లేనట్లు సమాచారం. ఈ రెండో వ్యక్తి హెల్త్ కేర్ వర్కర్ అని తెలుస్తోంది.  


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. ఈ రెండు కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు ఈ వైరస్ బాధితులని తెలిపారు. అయితే ఒమైక్రాన్ లక్షణాలు మన దేశంలో ఇప్పటి వరకు మరీ అంత తీవ్రంగా లేవని చెప్పారు. ఈ వైరస్‌కు సంబంధించిన కేసులన్నిటిలోనూ చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన ఈ కేసుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలపై అధ్యయనం జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. 


Updated Date - 2021-12-03T00:29:50+05:30 IST