Abn logo
May 23 2020 @ 02:49AM

గొర్రెకుంట బావిలో మరో 5 మృతదేహాలు

  • ఇంట్లోని చొక్కా జేబులో కండోమ్‌లు.. 
  • సగం తాగిన శీతల పానీయ సీసాలు.. 
  • బావి దగ్గరే స్విచాఫ్‌ అయిన ఫోన్లు
  • మక్సూద్‌ ఫోన్‌ కట్ర్యాల దగ్గర ఆఫ్‌!
  • అవి హత్యలా? పరువు హత్యలా?
  • హత్యలే అయితే చంపిందెవరు?
  • తల్లీ కూతుళ్ల మధ్య గొడవలేంటి?
  • ఇంటి పెద్ద మక్సూద్‌పైనా అనుమానం(గీసుకొండ, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌-ఆంధ్రజ్యోతి)

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులోని సాయిదత్త ట్రేడర్స్‌ బావి అది! గురువారం అందులోంచి నాలుగు మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు.. శుక్రవారం మళ్లీ వెతగ్గా.. ఒకదాని తర్వాత ఒకటిగా ఐదు మృతదేహాలు బయటపడ్డాయి!! ఆ ఆవరణలో ఉంటున్నది ఎనిమిది మందే కాగా.. తొమ్మిదో మృతదేహం బయటపడడం సంచలనంగా మారింది! మృతులంతా పశ్చిమబెంగాల్‌, బిహార్‌, త్రిపుర రాష్ట్రాల నుంచి వలసవచ్చినవారు. కోల్‌కతాకు చెందిన మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (50) తన కుటుంబంతో 20 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాడు. సాయిదత్తా ట్రేడర్స్‌లో పనిచేసుకుంటూ లాక్‌డౌన్‌ సమయంలో ఇక్కడే ఉంటున్నారు. ఆంక్షల నేపథ్యంలో ఇటీవలే వాల్‌మార్ట్‌లో మక్సూద్‌ రూ.10వేల విలువ చేసే సరుకులు కూడా కొన్నాడు. అలాంటిది.. గురువారం ఇంటిపక్కనే ఉన్న బావిలో శవమై తేలాడు. ఆయన భార్య నిషా, కూతురు బూస్రా, మూడేళ్ల మనవడి  మృతదేహాలూ బావిలో కనిపించాయి. మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం, సోహైల్‌ ఆలం.. వీరి నివాస ఆవరణలోనే మరో గదిలో ఉంటున్న బిహారీ వలస కార్మికులు శ్యామ్‌ (20), శ్రీరామ్‌(21) కనిపించకపోవడంతో పోలీసులు శుక్రవారం బావిలో గాలింపు జరిపారు. ఆ నలుగురి శవాలతో పాటు.. త్రిపురకు చెందిన షకీల్‌ (30) శవం కూడా బయటపడింది. షకీల్‌ కూడా మక్సూద్‌ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడని సమాచారం. మక్సూద్‌ కుటుంబం మృతికి.. శ్యామ్‌, శ్రీరామ్‌కు సంబంధం ఉండి ఉంటుందని గురువారం అనుమానించిన పోలీసులు.. శుక్రవారం వారి మృతదేహాలూ బయల్పడడంతో దర్యాప్తు కోణాన్ని మార్చారు. 


మక్సూద్‌ కరీమాబాద్‌లో ఉన్నప్పుడు అతడి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న యాకూబ్‌ను పిలిపించి మృతులను గుర్తించారు. కాగా.. మృతదేహాలపై ఎటువంటి గాయాలూ లేకపోవడంతో పోస్ట్‌మార్టం రిపోర్టు కీలకంగా మారనుంది. లాక్‌డౌన్‌ సమయంలో రాకపోకలకు ఇబ్బంది అవుతుందని మక్సూద్‌ కుటుంబం కరీమాబాద్‌ నుంచి సాయిదత్త ట్రేడర్స్‌కు వచ్చి అందులోని ఓ బిల్డింగ్‌లో ఉంటోంది. సంఘటనకు  ముందు రోజు రాత్రి 7.30 గంటల సమయంలో షకీల్‌ కూడా సాయిదత్త ట్రేడర్స్‌కు వచ్చాడు. మక్సూద్‌ ఫోన్‌ తప్ప అందరి ఫోన్లూ బావి వద్దే గురువారం ఉదయం 5.30కు స్విచాఫ్‌ అయ్యాయి. మక్సూద్‌ ఫోన్‌ మాత్రం వర్ధన్నపేట మండలం కట్ర్యాల-నందనం మధ్య ఉదయం 8 గంటల తర్వాత స్విచాఫ్‌ అయింది. వీరందరినీ వేరెవరో చంపి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి మక్సూద్‌ ఫోన్‌ను అంతదూరం తీసుకెళ్లి స్విచాఫ్‌ చేశారా? లేక మక్సూదే పరువు కోసం కుటుంబ సభ్యులతో పాటు, మిగతావారిని చంపి, పారిపోయే ప్రయత్నం చేసి, పట్టుబడితే శిక్ష తప్పదనే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


విషప్రయోగమా?

మక్సూద్‌ కుటుంబం ఉండే ప్రాంతం నుంచి మృతదేహాలు వెలికితీసిన బావి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉంది. కార్ఖానాకు, బావికి మధ్యలో ఐదడుగుల ప్రహరీ ఉంది.  శ్యామ్‌, శ్రీరామ్‌.. గోదాంపైన మొదటి అంతస్తులోని గదిలో ఉండేవారు. ఈ గది నుంచి శవాలను విసిరేస్తే బావిలో పడతాయి. ఒకవేళ మక్సూద్‌ ఇంట్లో విష ప్రయోగం జరిగితే మృతదేహాలను బావి దగ్గరికి తరలించడం ఒక్కరితో అయ్యే పని కాదు.  వారిపై విష ప్రయోగం జరిపి.. అందరూ స్పృహతప్పాక  భవనం పై నుంచి బావిలో పడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మక్సూద్‌ ఇంట్లో సగం తాగిన కూల్‌డ్రింక్‌ బాటిళ్లు.. ఓ గదిలో చొక్కా జేబులో కండోమ్‌లు, మిగిలిపోయిన ఆహారపదార్థాలు  ఉన్నాయి. విషప్రయోగం నిర్ధారణకు ఆ సీసాలను, ఆహారపదార్థాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. బిహార్‌కు చెందిన 20 మందిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇతర రాష్ట్రాల వారి వివరాలను సేకరించి అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కరీమాబాద్‌ వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే.. మక్సూద్‌ కుమార్తెతో గతంలో సన్నిహితంగా ఉండి, పెళ్లి  దాకా వెళ్లిన శాంతినగర్‌ (రైల్వేగేట్‌)కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వివాదాల కారణంగా మక్సూద్‌ కూతురు భర్తతో దూరంగా ఉంటోంది. ఘటన నేపథ్యంలో అతడి వివరాలనూ పోలీసులు సేకరించారు. చనిపోయిన కార్మికులకు మిల్లు యజమానులతో ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. బుధవారం రాత్రి జరిగిన విందులో మిల్లు ఆవరణలో ఉండే కార్మికులే కాకుండా కొత్త వ్యక్తులు కూడా హాజరయినట్లు ప్రచారం జరుగుతోంది. వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా? అన్న కోణంలో మృతుల కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు.తల్లీకూతుళ్ల గొడవ..

సెల్‌ ఫోన్‌లో ఎక్కువ సేపు ఎవరితోనో మాట్లాడుతున్న కూతురుని మక్సూద్‌ భార్య తీవ్రస్థాయిలో మందలించినట్టు సమాచారం. దీంతో కూతురు సైతం అదే స్థాయిలో తల్లితో గొడవపడినట్టుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య వాగ్వాదంలో.. వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు. చాలాసార్లు వారి మధ్య గొడవ జరిగి పరస్పరం నిందించుకోవడంతో మక్సూద్‌ నొచ్చుకున్నట్టు తెలిసింది. ఇది తనకు అవమానంగా ఉందని మందలించినా వారు వినేవారు కాదని సమాచారం. ఈ క్రమంలో, కుటుంబ పరువు పోతోందనే మనస్తాపంతో మక్సూదే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదే కారణం అనుకున్నా.. వారి కుటుంబానికి సంబంధం లేని మరో ముగ్గురు యువకులు ఎందుకు చనిపోయారనేది అంతుబట్టకుండా మారింది. కేసును త్వరలోనే ఛేదిస్తామని వరంగల్‌ పోలీసులు తెలిపారు. మంత్రుల పరామర్శ

వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, మే 22: గొర్రెకుంటలో బావిలో పడి మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటదని, వారు కోరిన విధంగా అంత్యక్రియలు జరిపిస్తామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ హామీ ఇచ్చారు.  ఎంజీఎం మార్చురీలో.. తొమ్మిది మంది మృతదేహాలను శుక్రవారం వారు పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యులను, బంధువులను పరామర్శించారు.

Advertisement
Advertisement
Advertisement