Abn logo
Aug 31 2021 @ 04:05AM

పంచరత్నాలు

భారత్‌ ‘పారా’క్రమం

పారాలింపిక్స్‌లో ఒకే రోజు 5 పతకాలు

షూటింగ్‌లో అవని, జావెలిన్‌ త్రోలో సుమిత్‌కు గోల్డ్‌

డిస్కస్‌ త్రోలో రజతం నెగ్గిన యోగేశ్‌

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. సోమవారం 2 స్వర్ణాలు సహా 5 పతకాలు సాధిం చారు. షూటింగ్‌లో అవని లేఖార, జావెలిన్‌ త్రోలో సుమిత్‌ అంటిల్‌ బంగారు పతకాలతో మెరిశారు. డిస్కస్‌ త్రోలో యోగేశ్‌ కథూనియా, జావెలిన్‌ త్రోలో దేవేంద్ర జఝారియా రజతాలతో సత్తా చాటారు. జావెలిన్‌ త్రోయర్‌ సుందర్‌సింగ్‌ గుర్జార్‌ కాంస్యం నెగ్గాడు.

ఒకేరోజు ఐదు పతకాలు

సుమిత్‌, అవనిలకు స్వర్ణాలు  

జఝారియా, యోగేశ్‌కు రజతాలు.. సుందర్‌కు కాంస్యం 

పారాలింపిక్స్‌లో భారత్‌ అద్భుత ప్రదర్శన

జఝారియా, యోగేశ్‌కు రజతాలు.. సుందర్‌కు కాంస్యం

పారాలింపిక్స్‌లో భారత్‌ అద్భుత ప్రదర్శన

ఒలింపిక్స్‌ కావచ్చు.. పారా గేమ్స్‌ కావచ్చు.. ఎలా చూసుకున్నా విశ్వ వేదికపై భారత క్రీడారంగానికిది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజే. ఒకటా.. రెండా.. సోమవారం ఏకంగా ఐదు పతకాలతో దివ్యాంగ అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంతో చక్రాల కుర్చీకే పరిమితమైన షూటర్‌ అవనీ లేఖార పారా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా భారతావనిని మురిపించింది. ఆ జోరుతో జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ ప్రపంచ రికార్డుతో బంగారు పతకం కొల్లగొట్టాడు. ఇక డిస్కస్‌ త్రోయర్‌ యోగేశ్‌ కథూనియా.. వెటరన్‌ దేవేంద్ర జఝారియాలకు రజతాలు లభించగా, మరో జావెలిన్‌ త్రోయర్‌ సుందర్‌ సింగ్‌ కాంస్యం అందించాడు.


టోక్యో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు చరిత్ర సృష్టిస్తున్నారు. ఈసారి 15 పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన వీరంతా అంచనాలకు తగ్గట్టుగానే జోరు చూపిస్తున్నారు. ఆదివారం రెండు పతకాలతో వహ్వా అనిపించగా.. సోమవారం పతకాల వర్షమే కురిపించారు. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యంతో అందరినీ ఆనంద డోలికల్లో ముంచెత్తారు. ఇందులో అథ్లెటిక్స్‌ నుంచే నాలుగు పతకాలుండడం విశేషం. 19 ఏళ్ల యువ షూటర్‌ అవని బరిలోకి దిగిన తొలిసారే అదరగొట్టింది. షూటింగ్‌లో దేశానికి స్వర్ణం అందించడంతో పాటు ఈ ఫీట్‌ సాధించిన మొదటి మహిళా అథ్లెట్‌గానూ నిలిచింది. ఆర్‌2 మహిళల ఎస్‌హెచ్‌1 విభాగంలోని 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ పోటీల్లో ఆమె 249.6 పాయింట్లతో ప్రపంచ రికార్డును సమం చేస్తూ విజేతగా నిలిచింది. 2015లో హాబీగా తీసుకున్న ఈ క్రీడపై ఆనక సీరియ్‌సగా దృష్టి పెట్టిన అవని అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు కొల్లగొట్టింది. అలాగే ఇటీవలి ఒలింపిక్స్‌లో అంచనాలను వమ్ము చేస్తూ భారత షూటర్లంతా నిరాశపరిచిన వేళ.. ఈ క్రీడల్లో అవని విజయం నిజంగా ఊరటనిచ్చేదే.

నీరజ్‌తో పోటీపడి..

హరియాణాలో సోనెపట్‌ జిల్లా ఖేవ్రా గ్రామానికి చెందిన 23 ఏళ్ల జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌.. ఢిల్లీలోని రామ్‌జాస్‌ కాలేజ్‌ విద్యార్థి. ప్రమాదంలో కాలు కోల్పోకముందు అతడు మంచి రెజ్లర్‌ కూడా. అంతేకాదు ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాతో కూడా పోటీపడ్డాడు. గత మార్చిలో పటియాలాలో ‘ఏబుల్డ్‌ బాడీడ్‌ ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ 3’ జరిగింది. అంటే..అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న క్రీడాకారులు తలపడే గ్రాండ్‌ ప్రీ అన్నమాట. ఇందులో బరిలో దిగిన సుమిత్‌ అత్యుత్తమంగా 66.43 మీ. దూరం జావెలిన్‌ విసిరి ఏడో స్థానంలో నిలిచాడు. మరోవైపు నీరజ్‌ చోప్రా తన జాతీయ రికార్డును తిరగరాస్తూ 88.07 మీ. దూరం జావెలిన్‌ విసిరాడు. 2015లో ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన మోటార్‌ సైకిల్‌ ప్రమాదంలో అంటిల్‌ ఎడమ కాలు మోకాలి కిందివరకు తెగిపోయింది. ఆపరేషన్‌ తర్వాత కృత్రిమ కాలు అమర్చారు. సుమిత్‌ గ్రామానికి చెందిన పారా అథ్లెట్‌ ఒకరు చెప్పడంతో అతడు పారాలింపిక్‌ క్రీడలపై దృష్టి సారించాడు. జావెలిన్‌ సాధన చేసే క్రమంలో సుమిత్‌ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కృత్రిమ కాలు కావడంతో ట్రెయినింగ్‌ సందర్భంగా విపరీతమైన నొప్పి పుట్టేది. అంతేకాదు.. కృత్రిమ కాలు కావడంతో లోపల వేడికి రక్తం కారేది. అయినా నిరంతర సాధనతో పారాలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టే స్థాయికి ఎదిగాడు. 2019లో దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ పారా చాంపియన్‌షి్‌ప ఎఫ్‌-64 విభాగంలో రజత పతకంతో సత్తా చాటాడు.

 వరల్డ్‌ రికార్డులను తిరగరాస్తూ..

ఎఫ్‌64లో వరల్డ్‌ నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న జావెలిన్‌ త్రోయర్‌ సుమీత్‌ అంటిల్‌ సత్తా నిరూపించుకున్నాడు. జావెలిన్‌ను 68.55మీ. దూరం విసిరిన అతడు స్వర్ణ పతకం సాధించాడు. ఈక్రమంలో మూడు ప్రపంచ రికార్డులను నమోదు చేశాడు. తొలి ప్రయత్నంలో 66.95మీ. దూరంతో వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత 68.08మీ.తో దాన్ని తిరగ రాయగా, ఐదో ప్రయత్నంలో ఏకంగా 68.55మీ. దూరంతో ఈ హరియాణా వీరుడు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణం తర్వాత అదే విభాగంలో దేశానికి మరో బంగారు పతకం రావడం విశేషం.

జయహో.. దేవేంద్ర 

2004, 2016 పారా గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన దిగ్గజ జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర జఝారియా ఈసారి రజతంతో సంతృప్తి పడ్డాడు. అయితేనేం.. పారా క్రీడల చరిత్రలో మూడు పతకాలు సాధించిన ఏకైక భారత ఆటగాడయ్యాడు. ఎఫ్‌46 విభాగంలో అతడు 64.35మీ. దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. 40 ఏళ్ల దేవేంద్ర కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇక ఇదే విభాగంలో సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ (64.01మీ.) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు.

కోచ్‌  లేకుండానే పతకం

పురుషుల డిస్కస్‌త్రో ఎఫ్‌56 విభాగంలో యోగేశ్‌ కథూనియా అద్భుతం చేశాడు. ఆరో ప్రయత్నంలో డిస్క్‌సను 44.38మీ. దూరం విసిరి రజతం అందుకున్నాడు. ఒక మీటరు తేడాతో అతడు స్వర్ణం కోల్పోయాడు. అయితే కరోనా కష్టకాలంలో అతడికి కోచ్‌ ఎవరూ లభించకపోవడంతో సొంతంగానే ప్రాక్టీస్‌ కొనసాగించాడు. ఆ ఆత్మవిశ్వాసంతోనే పారిస్‌ గేమ్స్‌లో కచ్చితంగా స్వర్ణం అందుకుంటానని చెబుతున్నాడు. 

అభినవ ఏకలవ్యుడు 

ఢిల్లీకి చెందిన యోగేశ్‌ కథూనియా తండ్రి ఆర్మీ ఉద్యోగి. యోగేశ్‌ ఎనిమిదో ఏట పోలియో బారినపడ్డాడు. ఏదైనా ఇట్టే నేర్చుకోగలిగే సమర్థుడైన యోగేశ్‌ మొదట్లో జావెలిన్‌ త్రోపట్ల మక్కువ పెంచుకొని అందులో సత్తా చాటాడు. తర్వాత డిస్క్‌సత్రోకు మారినా రెండిటిలోనూ ప్రతిభ కనబర్చాడు. కిరోరిమల్‌ కాలేజ్‌లో డిగ్రీలో చేరాక అక్కడి కోచ్‌లు యోగేశ్‌లోని అథ్లెటిక్స్‌ ప్రతిభను గమనించి ప్రోత్సహించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో కోచ్‌ సత్యపాల్‌ మాలిక్‌.. యోగేశ్‌ నైపుణ్యాలను సానబెట్టాడు. 2017 బెర్లిన్‌ గ్రాండ్‌ ప్రీలో డిస్కస్‌ త్రో ఎఫ్‌-36 విభాగంలో ఏకంగా 45.18 మీ. దూరం విసిరి వరల్డ్‌ రికార్డుతో దుమ్ము రేపాడు. 2019 వరల్డ్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకంతో టోక్యో టిక్కెట్‌ దక్కించుకున్నాడు. లాక్‌డౌన్‌తో గత ఏడాది కోచ్‌లు అందుబాటులో లేకపోవడంతో పారాలింపిక్స్‌కు 25 ఏళ్ల యోగేశ్‌ ఒంటరిగానే ప్రాక్టీస్‌ చేసి పతకం సాధించడం విశేషం. దీంతో అభినవ ఏకలవ్యుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

బింద్రా స్ఫూర్తిగా..

దిగ్గజ షూటర్‌ అభినవ్‌ బింద్రా స్ఫూర్తిగా అవనీ లేఖార ఈ క్రీడలో అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవనికి 2012లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుముక తీవ్రంగా దెబ్బతిన్నది. దాంతో ఆమె తీవ్ర నిరాశలో కూరుకు పోయింది. ఫలితంగా చీటికి మాటికి ఆగ్రహానికి లోనవుతుండేది. ఆ పరిస్థితినుంచి అవనిని బయటకు తీసుకొచ్చేందుకు తండ్రి ప్రవీణ్‌ ఆమెను జైపూర్‌లోని జగత్‌పురా షూటింగ్‌ రేంజ్‌కు 2015లో తొలిసారి తీసుకువెళ్లాడు. అక్కడకు తరచూ వెళ్లడంతో ఆమెకు షూటింగ్‌పట్ల ఆసక్తి కలిగింది. ఆమెలో ఉత్సాహాన్ని గమనించిన తండ్రి.. అభినవ్‌ బింద్రా ఆటోబయోగ్రఫీ పుస్తకం ఇచ్చాడు. అది చదివాక తాను మంచి షూటర్‌గా మారాలని లేఖార నిర్ణయించుకుంది. ఆపై రెండేళకే యూఏఈ పారా షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో అవని రజతం గెలిచిందంటే ఆమె సత్తా అర్థమవుతుంది. 2019లో క్రొయేషియాలోని ఒస్జెక్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో అవని మరో రజతం సొంతం చేసుకొని భళా అనిపించింది. గత మార్చిలో తొలిసారి నిర్వహించిన నేషనల్‌ పారా షూటింగ్‌ పోటీలలో మహిళల ఆర్‌-2.. 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణంతో అదరగొట్టింది. షూటింగ్‌కాక మ్యూజిక్‌ వినడం, సినిమాలు చూడడం, వంట చేయడం, కుటుంబంతో గడపడం అవనికి ఇష్టమైన వ్యాపకాలు.


రాజస్థాన్‌ అథ్లెట్లపై కోట్లాభిషేకం

పారా గేమ్స్‌లో పతకాలు సాధించిన తమ రాష్ట్ర అథ్లెట్లకు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ భారీ నజరానా ప్రకటించారు. స్వర్ణం సాధించిన షూటర్‌ అవనికి రూ.3 కోట్లు, రజతం అందుకున్న జఝారియాకు రూ.2 కోట్లు, కాంస్యం సాధించిన గుర్జార్‌కు రూ.1 కోటి ఇవ్వనున్నారు.

రియోలో మిస్సయినా..

25 ఏళ్ల సుందర్‌సింగ్‌ గుర్జార్‌ది రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలో దేవలన్‌ అనే చిన్న గ్రామం. అతడి తల్లి గ్రామ సర్పంచ్‌. గుర్జార్‌ ఆదినుంచి జావెలిన్‌ త్రో ఆటగాడే. అయితే 2015లో జరిగిన ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోవడంతో పారా జావెలిన్‌ త్రోయర్‌గా మారాడు. ప్రమాదం తర్వాత తన కెరీర్‌ ప్రమాదంలో పడుతుందేమోనని తీవ్ర నిస్పృహకు లోనయ్యాడు. ద్రోణాచార్య అవార్డీ కోచ్‌ ఆర్‌డీ సింగ్‌ను కలవడం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. గుర్జార్‌ను తొలుత మానసికంగా దృఢంగా తీర్చిదిద్దిన సింగ్‌ తర్వాత మేటి పారా జావెలిన్‌ త్రోయర్‌గా మార్చాడు. 2016లో దుబాయ్‌లో జరిగిన 8వ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో 59.36 మీ. జావెలిన్‌ విసిరిన సుందర్‌ రియో పారాలింపిక్స్‌ ‘ఎ’ క్వాలిఫికేషన్‌ మార్క్‌ అందుకొని వెలుగులోకి వచ్చాడు. రియో ఒలింపిక్స్‌లో పోటీకోసం పేర్లు పిలిచే సమయానికి దురదృష్టవశాత్తూ వేదిక వద్దకు చేరలేకపోవడంతో ఆ ఈవెంట్‌లో అతను తలపడలేకపోయాడు. జాతీయ పారా అథ్లెటిక్స్‌ పోటీల్లో 68.42 మీటర్లు జావెలిన్‌ విసిరిన సుందర్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక 9వ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రీలో జావెలిన్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌ త్రోలో మూడు స్వర్ణాలు నెగ్గి సంచలనం సృష్టించాడు. టోక్యోలో సుందర్‌ కాంస్యం సాధించడంతో అతడి స్వగ్రామంలో సంబరాలు మిన్నంటాయి. గ్రామస్తులు మిఠాయిలు పంచుకున్నారు. గుర్జార్‌కు ఇద్దరు పిల్లలు. గతేడాది కృష్ణాష్టమి సందర్భంగా ఓ బిడ్డ జన్మిస్తే.. ఈ జన్మాష్టమి రోజు ఒలింపిక్స్‌ పతకం నెగ్గడం విశేషం. 

జఝారియా..పారా అథ్లెటిక్స్‌ పితామహ

మూడో ఒలింపిక్‌ స్వర్ణంపై గురిపెట్టి రజత పతకంతో సరిపెట్టుకున్న 40 ఏళ్ల దేవేంద్ర జఝారియాను భారత పారా అథ్లెటిక్స్‌ పితామహుడిగా చెప్పాలి. అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌లో పతకంకోసం భారత్‌ ఎదురుచూస్తున్న వేళ తానున్నానంటూ దేవేంద్ర ముందుకొచ్చాడు. 2004 ఏథెన్స్‌ పారాలింపిక్స్‌లో స్వర్ణం అందించిన ఈ జావెలిన్‌ వీరుడు రియో పారాలింపిక్స్‌లో మరో పసిడి పతకంతో భారత్‌ కీర్తిపతాకను రెపరెపలాడించాడు. ఈ మధ్యలో పారా వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప, ఏషియా పారా గేమ్స్‌లో పతకాల పంట పండించిన జఝారియా..నాలుగు పదుల వయస్సులోనూ తనలో ఇంకా సత్తా తగ్గలేదని టోక్యో గేమ్స్‌లో రజత పతకంతో నిరూపించాడు. 


రాష్ట్రపతి, ప్రధాని అభినందన

జూ పారా అథ్లెట్లు దేశ కీర్తిప్రతిష్ఠలను సమున్నతం చేసినందుకు సంతోషంగా ఉంది. పతకాలు నెగ్గిన అందరికీ అభినందనలు

      -రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

పతకాలు నెగ్గిన మన అథ్లెట్ల ప్రదర్శన అద్భుతం. భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించాలి.

-ప్రధాని నరేంద్ర మోదీ

మీ విజయాలతో దేశం గర్విస్తోంది. అందరికీ శుభాకాంక్షలు.

 -ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

టోక్యోలో పారా అథ్లెట్ల విజయం అందరికీ స్ఫూర్తి దాయకం         

- సీఎం కేసీఆర్‌ 

క్రైమ్ మరిన్ని...