చాణక్య నీతి: ఈ 5 మూలసూత్రాలు మీ వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా మారుస్తాయి!

ABN , First Publish Date - 2022-02-05T11:26:52+05:30 IST

ఆచార్య చాణక్యుని దృష్టిలో అందమే సర్వస్వం కాదు..

చాణక్య నీతి: ఈ 5 మూలసూత్రాలు మీ వ్యక్తిత్వాన్ని మహోన్నతంగా మారుస్తాయి!

ఆచార్య చాణక్యుని దృష్టిలో అందమే సర్వస్వం కాదు.. అందంతో పాటు జ్ఞానం, అవగాహన లేకపోతే మీరు ఎంత అందంగా కనిపించే కాగితం పూలతో సమానం. పరిమళం అనేది ఎంతమాత్రం ఉండదు. అందుకే ఎదుటి వ్యక్తిని అందంతో కాకుండా వారి గుణలక్షణాలతో అంచనా వేయాలని ఆచార్య చాణక్య సూచించారు. ఇదేవిధంగా నీ పుత్రుడే నీ ఆస్తికి వారసుడని అనుకోవడం తప్పని ఆచార్య చాణక్య తెలిపారు. విద్యావంతులు ఆస్తిని నిలబెట్టుకోడానికి, దానిని సద్వినియోగం చేసేందుకు అర్హులని, దీనిని గుర్తుంచుకుని మీ ఆస్తిని అర్హులకు మాత్రమే ఇవ్వాలని ఆచార్య సూచించారు. 


మీరు మీ మనస్సును సంస్కరించుకోడానికి మించిన మరొక గొప్ప తపస్సు లేదని చాణక్య నీతి చెబుతుంది. అన్నింటా మీరు సంతృప్తిని పొందడం ప్రారంభిస్తే, అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. మీరు మీ అత్యాశను తొలగించుకున్నట్లయితే, మీరు చాలా పెద్ద వ్యాధిని నియంత్రించుకున్నవారవుతారని ఆచార్య హితవు పలికారు. ఇదేవిధంగా దయకు మించిన మంచిగుణం లేదని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనం తినే ఆహారం ఎటువంటిదైతే మన మనస్సు కూడా అలాగే తయారవుతుంది. సాత్విక, రాజసిక, తామసిక ఆహారం మనిషి ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. విద్యను అభ్యసించినవారికి ప్రతిచోటా గౌరవం లభిస్తుందని చాణక్య తెలిపారు. చదువుకున్న వ్యక్తికి తప్పు ఒప్పుల మధ్య తేడా తెలుస్తుంది. అతను ఎక్కడికి వెళ్లినా జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తాడు. అందుకే అతనికి ప్రతిచోటా గౌరవం దక్కుతుందని ఆచార్య చాణక్య తెలిపారు.

Updated Date - 2022-02-05T11:26:52+05:30 IST