విశాఖకు 5 లక్షల టన్నుల ఇసుక

ABN , First Publish Date - 2020-05-29T11:45:50+05:30 IST

ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం అయింది. వైసీపీ ప్రభు త్వం కొత్త ఇసుక విధానం పేరిట అనేక నిబంధనలు ..

విశాఖకు 5 లక్షల టన్నుల ఇసుక

పెరిగిన పులివెందుల దందా  

నిబంధనలు పట్టించుకోని ఏపీ ఎండీసీ

జిల్లా ఇసుక అధికారికి ఆఫీసేలేదు

స్టాక్‌ పాయింట్ల వద్ద సీసీ కెమేరాలు నిల్‌

వేయింగ్‌ మిషన్ల ఏర్పాటూ లేదు  

ర్యాంపుల నుంచే ఇసుక సరఫరా 


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం అయింది. వైసీపీ ప్రభు త్వం కొత్త ఇసుక విధానం పేరిట అనేక నిబంధనలు  రూపొందించింది.  కొత్త విధానం అమలులోకి వచ్చి సుమారు 9 నెలలు అయ్యింది. నిబంధనలు ఏమీ అమలు చేయడం లేదు. ర్యాంపుల నుంచి ఏపీఎండీసీ ఏర్పాటు చేసిన స్టాక్‌ పాయింట్ల వద్దకు  ఇసుక సరఫరా కావాలి. దీనికోసం ర్యాంపులలోనూ సీసీ కెమేరాలు ఉండాలి. స్టాక్‌ పాయింట్ల వద్ద సీసీ కెమేరాలతోపాటు వేయింగ్‌ మిషన్లు ఉండాలి. ఇప్పటి వరకూ స్టాక్‌ పాయింట్ల వద్ద వేయింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయలేదు. అసలు ఈ ఇసుక విధానం ఇంకా అస్తవ్యస్థంగా ఉంది.  గతంలో జిల్లాకు ఇసుక అధికారిని నియమించారు. కొద్దిరోజులలో అవినీతి పెరగడంతో, అతనిని పంపించి పులివెందుల నుంచి అవుట్‌సోర్సు ఉద్యోగిని తీసుకొచ్చి పనిచేయించారు. 


అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఉద్యోగి, జిల్లాలో మైన్స్‌, తహశీల్దార్‌,   పోలీసు తదితర శాఖల అధికారపై పెత్తనం చేయడం పెద్దసంచలనం అయ్యింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఏడీ స్థాయి ఉద్యోగిని జిల్లా ఇసుక అధికారి (డీఎస్‌ఓ)గా నియమించారు. ఈ నేపథ్యంలో ఏపీఎండీసీ జిల్లా అధికారికి సంబంధించిన ఆఫీసును రాజమహేంద్రవరంలో పెట్టాలని నిర్ణయించారు.  కానీ ఇంతవరకూ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంతో ఆయన కూర్చోవడానికి చోటు లేదు. ఇసుకకు సంబంధించిన సమాచారం కోసం ఆయనను కలుద్దామంటే ఆయన ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. 


 విశాఖకు ఇసుక కోసం పాట్లు

 విశాఖలో స్టాక్‌పాయింట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అక్కడకు కనీసం 5 లక్షల టన్నుల ఇసుక పంపించాలని భావించారు. కానీ ఇక్కడ నుంచి ఇసుక పంపించాలని, ఇసుక తీసే బాధ్యత ఎవరికీ ఇవ్వాలని,  ఏ ప్రాంతంలో ఇసుక తియ్యాలి వంటి విషయాలపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకూ ఉన్న మైన్స్‌ అధికార్లకు కూడా జిల్లా  ర్యాంపులపై పట్టులేదు. ప్రస్తుతం  జిల్లా అధికారిగా వచ్చిన  రవికుమార్‌కు గతంలో ఇక్కడ మైన్స్‌ విజిలెన్స్‌ ఏడీగా పనిచేశారు. అయినా ప్రస్తుతం మెయిన్‌ ఆఫీసు నుంచి జాయింట్‌ డైరెక్టర్‌ కొద్దిరోజుల కిందట వరకూ ఇక్కడ ఏడీగానూ,  కాకినాడలో డీడీగా ఒకేసారి రెండు పోస్టులు నిర్వహించి,  మైన్స్‌లో అనేక అవకతవకలు పాల్పడి,  జిల్లా కలెక్టర్‌ ఆగ్రహానికి గురై ప్రభుత్వానికి సరెండరైన అధికారి కూడా కొద్దిరోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నారు. 


ర్యాంపు లు గుర్తించడం,  ర్యాంపుల్లో తిరగడం, అక్కడ జరిగిన తేడా లు గుర్తించడం వంటివి జోరుగా జరుగుతున్నాయి. విశాఖకు అర్జంట్‌గా ఇసుక తరలించాలనే ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత జరిగిన అక్రమాలపై కూడా విచారణ జరుగుతున్నట్టు కూడా చెబుతున్నారు.


పులివెందుల నేతల ఇసుక దందా

జిల్లాలో ఇసుక వ్యవహారంలోకి పులివెందుల ముఠా దిగిపోయింది.  అధికార్లను కూడా మాట్లాడనీయడం లేదు. సీతానగరం మండలంలోని పలు ర్యాంపులతోపాటు, ఉభయగోదావరి జిల్లాలో పలు ర్యాంపులు వీరి చేతిలోనే ఉన్నాయి. ఒక ర్యాంపు నిర్వాహకుడు అధికార్లను తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఏకంగా రాష్ట్ర ప్రముఖుడైన నేత భుజంమీద చేయి వేసి ఉన్న ఫోటోను అధికార్ల వాటప్స్‌కు పంపించడం గమనార్హం. అక్కడ అక్రమాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోరని సదరు అధికార్లను ఎవరైనా అడిగితే తమ సెల్‌ఫోన్‌లో ఉన్న ఈ ఫోటోను చూపించడం గమనార్హం. విశాఖకు ఇసుక తరలించడానికి కూడా కొందరు ముఖ్యులు తీవ్రంగా పోటీపడుతుండడంతో దీని వెనుక పెద్ద చర్చే నడుస్తోంది.

Updated Date - 2020-05-29T11:45:50+05:30 IST