జైపూర్: అందివస్తున్న అత్యాధునిక సాంకేతికను కొందరు చాలా తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పరీక్షల్లో కాపీ కొట్టేందుకు దీనిని ఇంకా బాగా వినియోగించుకుంటున్నారు. ఉపాధ్యాయులై భావి తరాలను తీర్చిదిద్దాల్సిన కొందరు అక్రమ పద్ధతుల్లో ఉద్యోగం పొందాలని భావించి చివరికి కటకటాలపాలయ్యారు. రాజస్థాన్లో జరిగిందీ ఘటన.
రాష్ట్రవ్యాప్తంగా నిన్న (ఆదివారం) రాజస్థాన్ ఎలిజబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ (ఆర్ఈఈటీ) పరీక్ష నిర్వహించారు. మొత్తం 31,000 పోస్టులకు గాను 16 లక్షల మందికిపైగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా నాలువేలకుపైగా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. గంగాషహర్ ప్రాంతంలో బ్లూటూత్ చెప్పులు ధరించి పరీక్షకు హాజరైన ముగ్గురు అభ్యర్థులు సహా వారికి సహకరించేందుకు వచ్చిన మరో ఇద్దరిని పరీక్ష ప్రారంభానికి ముందు పోలీసులు అరెస్ట్ చేశారు.
బికనేర్ ఎస్పీ ప్రీతిచంద్ర మాట్లాడుతూ.. నిందితులు బ్లూటూత్ అమర్చిన చెప్పులు ధరించి వచ్చినట్టు చెప్పారు. వారికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్న మరో ఇద్దరిని నయా బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. వారి నుంచి మొబైల్ సిమ్ కార్డులు, బ్లూటూత్ డివైజ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ధరించిన బ్లూటూత్ చెప్పులను ఓ ముఠా నుంచి రూ. 6 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. ఆ ముఠా మొత్తం 25 మందికి ఈ బ్లూట్ చెప్పులు విక్రయించినట్టు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.