హైదరాబాద్ : ప్రభుత్వ స్థలంలో అయిదంతస్తుల భవనం

ABN , First Publish Date - 2021-02-26T19:15:47+05:30 IST

ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని

హైదరాబాద్ : ప్రభుత్వ స్థలంలో అయిదంతస్తుల భవనం

  • రెవెన్యూ అధికారుల ఫిర్యాదు
  • సీజ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
  • రెవెన్యూ అధికారుల ఫిర్యాదు
  • సీజ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

హైదరాబాద్/రాంనగర్‌ : ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని అధికారులు సీజ్‌ చేశారు. ముషీరాబాద్‌ తహసీల్దార్‌ పరిధి రాంనగర్‌ డివిజన్‌ జెమిస్తాన్‌పూర్‌లోని ఇంటి నెంబర్‌ 1-7-496/1లో అయిదు అంతస్తుల  భవనాన్ని నిర్మించారు. ఆ స్థలం ప్రభుత్వానిదని, అక్కడ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని రెవెన్యూ అధికారులు జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్‌ విభాగానికి ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. జెమిస్తాన్‌పూర్‌లోని దాదాపు 500 గజాల స్థలంలో ఓ బిల్డర్‌ కొంత కాలం క్రితం బహుళ అంతస్తుల నిర్మాణ అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. అధికారులు అయిదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. యజమాని కొంత కాలంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో అది ప్రభుత్వ స్థలమని అక్టోబర్‌లో కలెక్టర్‌కు తహసీల్దార్‌ ఫిర్యాదు చేశారు.


నిర్మాణ పనులను ఆపివేయించాలని తహసీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. పనులు ఆపేయాలని తహసీల్దార్‌ కోర్టు ద్వారా భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ యజమాని పనులను కొనసాగించి తుది దశకు తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారని, వెంటనే రద్దు చేయాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్‌కు తహసీల్దార్‌ లేఖ రాశారు. సిటీ ప్లానర్‌ స్పందిస్తూ అనుమతులను రద్దు చేస్తూ యూబైఎ్‌స461/ఎ ఆఫ్‌ ద జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ 1955 ప్రకారం భవనాన్ని సీజ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సర్కిల్‌ - 15 టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ పర్యవేక్షణలో సెక్షన్‌ ఆఫీసర్‌ రాందాసు, సిబ్బంది జగన్‌, రాజయ్య, అనిల్‌ గురువారం వెళ్లి భవనాన్ని సీజ్‌ చేస్తున్నట్లు ఫ్ల్లెక్సీలను ఏర్పాటు చేశారు.


నాడు అనుమతులు ఎలా ఇచ్చారు

రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ స్థలంగా ఉన్న చోట అయిదు అంతస్తుల భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ ఉన్నతాధికారులు ముందుగా ఎలా అనుమతులు ఇచ్చారు, ప్రస్తుతం ఎందుకు రద్దు చేస్తున్నారు అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనుమతులు ఇచ్చే ముందు ఆ స్థలం ప్రభుత్వానిదా? ప్రైవేటుదా? అని ఎందుకు గుర్తించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసే వరకు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే విషయంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా పనులు సాగుతున్నా ఇంత కాలం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-02-26T19:15:47+05:30 IST