భువనేశ్వర్‌లో సంపూర్ణ అష్ట దిగ్బంధనం

ABN , First Publish Date - 2020-04-03T20:32:51+05:30 IST

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్

భువనేశ్వర్‌లో సంపూర్ణ అష్ట దిగ్బంధనం

భువనేశ్వర్ : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు భువనేశ్వర్, భద్రక్‌లలో సంపూర్ణ అష్ట దిగ్బంధనం, కర్ఫ్యూ అమలు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసిత్ త్రిపాఠీ శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. 



విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం, కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని నిరోధించడం కోసం శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు భువనేశ్వర్ నగరంలోనూ, భద్రక్ పట్టణంలోనూ అష్ట దిగ్బంధనాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇళ్ల బయట, కర్ఫ్యూనిబంధనలను ఉల్లంఘిస్తూ కనిపించినవారిని క్వారంటైన్ సెంటర్లలో చేర్చుతామన్నారు. ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు.


ఒడిశా డీజీపీ అభయ్ మాట్లాడుతూ సంపూర్ణ అష్ట దిగ్బంధనం, కర్ఫ్యూ సమయంలో నిత్యావసర వస్తువులు, సరుకుల అమ్మకాలను కూడా అనుమతించేది లేదన్నారు. స్థానిక పరిపాలనా యంత్రాంగం నిర్ణయించిన మెడికల్ షాపులు మాత్రమే తెరచి ఉంటాయని తెలిపారు. ఆసుపత్రులకు వెళ్ళవలసిన రోగులు ఉంటే, వారిని కేవలం అంబులెన్సులలో మాత్రమే ప్రయాణించేందుకు అనుమతిస్తామన్నారు. ఈ 48 గంటల్లో అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల అంబులెన్సులను పెంచామని, ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచాలని ఆ యాజమాన్యాలను కోరామని తెలిపారు.


ఇదిలావుండగా, ఒడిశాలో మొదటి కోవిడ్-19 రోగి పూర్తిగా కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, ఆసుపత్రి నుంచి పంపించేస్తున్నామని తెలిపింది. 


Updated Date - 2020-04-03T20:32:51+05:30 IST