తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది సజీవ దహనం

ABN , First Publish Date - 2021-10-14T23:03:55+05:30 IST

తైవాన్‌లోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు

తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది సజీవ దహనం

తైపేయి: తైవాన్‌లోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 46 మంది మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ (గురువారం) తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కావోసియుంగ్ నగరంలోని 13 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు 55 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉంది.   


అగ్నికీలలు భయంకరంగా ఎగసిపడుతున్నట్టు అధికారులు తెలిపారు. భవనంలో చాలా అంతస్తులు పూర్తిగా ధ్వంసమైనట్టు అగ్నిమాపక అధికారులు తెలిపారు. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగలు ఆ ప్రాంతాన్ని దట్టగా కమ్మేశాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 


ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం తెలియరాలేదు. అయితే, తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షిని ఉటంకిస్తూ స్థానిక మీడియా పేర్కొంది. భవనం 40 ఏళ్ల పాతదని, భవనం కింది అంతస్తుల్లో దుకాణాలు ఉండగా, పైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.  

Updated Date - 2021-10-14T23:03:55+05:30 IST