ఇదేనా.. నాడు–నేడు

ABN , First Publish Date - 2022-09-14T05:49:22+05:30 IST

నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేస్తామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలపై కూడా దృష్టి పెట్టడం లేదు.

ఇదేనా.. నాడు–నేడు
ఒకే ఒక్క మరుగుదొడ్డి

450 మంది విద్యార్థులు..ఒకటే టాయిలెట్‌

టి.నరసాపురం హైస్కూల్‌ విద్యార్థుల అవస్థలు

మధ్యలోనే నిలిచిన నాడు–నేడు పనులు

టి.నరసాపురం, సెప్టెంబరు 13 : నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేస్తామని చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కనీస సౌకర్యాలపై కూడా దృష్టి పెట్టడం లేదు. నాడు–నేడు కింద నిధులు మంజూరు చేశామంటూ పనులు ప్రారంభించినా అవి అసంపూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యా యులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒకే పాఠశాలలో 450 మంది విద్యార్థినీ, విద్యార్థులు.. 20 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ ఒకటే మరుగుదొడ్డి.. టి.నరసాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెలకొన్న దుస్థితి నాడు–నేడు కార్యక్రమాన్ని వెక్కిరిస్తోంది.. నాడు–నేడు పాఠశాలల్లో కొత్త ఫర్నీచర్‌, మంచినీటికి ఆర్‌వో ప్లాంట్‌లు, రన్నింగ్‌ వాటర్‌తో ఉన్న టాయ్‌లెట్స్‌, అదనపు తరగతి గదులు, కరెంటు, గ్రీన్‌ బోర్డులు, ఫ్యాన్‌లు, ట్యూబ్‌టైట్లు ఇలా అన్నీ చేస్తామంటూ సీఎం జగన్మోహనరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ నాడు నేడులో పనులు నత్తనడకన సాగడం, కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో టి.నరసాపురం పాఠశాల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం టాయ్‌లెట్‌ సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితిపై ఆవేదన వ్యక్తం అవుతోంది. బాలురు సమీప పొలాలు, రోడ్లపక్కనే టాయ్‌లెట్స్‌కు వెళ్తున్నారు. 250 మంది విద్యార్థినులు ఒకే ఒక్క టాయిలెట్‌తో ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎప్పటికయ్యేనో..

టి.నరసాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తికాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టి.నరసాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు నాడు–నేడు మొదటి ఫేజ్‌ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి రూ.1.05 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పాఠశాల హెచ్‌ఎం, తల్లితండ్రుల కమిటీ చైర్మన్‌ జాయింట్‌గా పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు రూ.24.64 లక్షల వరకు ఖర్చు పెట్టి  అవసరమైన పలు సదుపాయాలను కల్పించారు. ఇందులో భాగంగా వాష్‌రూంలు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలు పునాది దశలోనే నిలిచిపోయాయి. సుమారు రూ.66 లక్షల నిధులు ఆగిపోయాయి. ఈ నిధులు రాకపోవడంతో ఆ నిర్మాణాలు అక్కడితోనే ఆగిపోయాయి. పాఠశాల మొత్తానికి ఒకటే మరుదొడ్డి దిక్కయింది. ఉన్నతాధికా రులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పరిష్కారం కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి మరుగదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నారు.

నిధులు లేమితో నిలిచిపోయాయి.

వెంకటలక్ష్మి నరసమాంబ, హెచ్‌ఎం 

నాడు–నేడు మొదటి దశలో రూ.1.05 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వాటితో కొంత మేర అభివృద్ది పనులు చేపట్టాం. మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించే సరికి నిధులు నిలిచిపోవడంతో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు నిధులు విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తిచేస్తాం. 


Updated Date - 2022-09-14T05:49:22+05:30 IST