సాఫ్ట్‌వేర్ డెవలపర్ ముసుగులో ఉగ్రవాది.. కనిపెట్టిన అమెరికా.. ఏం చేశాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-27T00:27:32+05:30 IST

న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉగ్రదాడులే లక్ష్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్‌‌గా నటించాడు ఓ ఉగ్రవాది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్లపాటు అమెరికా గడ్డపైనే గడిపాడు.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ ముసుగులో ఉగ్రవాది.. కనిపెట్టిన అమెరికా.. ఏం చేశాడో తెలిస్తే..

న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉగ్రదాడులే లక్ష్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్‌‌గా నటించాడు ఓ ఉగ్రవాది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 ఏళ్లపాటు అమెరికా గడ్డపైనే గడిపాడు. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లాకు చెందిన అలెక్సీ సాబ్ అమెరికాలో స్లీపర్ ఏజెంట్‌గా పనిచేశాడు. అలెక్సీ సాబ్‌ ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తించిన అమెరికా 2019లో అతడిని అరెస్ట్ చేసింది. సోమవారం ఈ కేసు విచారణ ప్రారంభమైన సందర్భంగా నిందితుడిని కోర్టులో హాజరుపరచింది. యూఎస్ మీడియా సంస్థల రిపోర్టుల ప్రకారం.. అలెక్సీ సాబ్ 2008లో అమెరికా పౌరసత్వం పొందాడు. అయితే ఉగ్రవాదం, ఉగ్రమూకలకు పేలుడు పదార్థాల సమకూర్పు  అభియోగాలపై 2019లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్ నగరంలో ఉగ్రవాది బాంబు దాడులు చేయాలని భావించిన భవనాల్లో విచారణ జరుపుతున్న కోర్ట్ కూడా ఉండడం గమనార్హం. రహస్య మిషన్‌లో భాగంగా అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు చేసేందుకు 2000 సంవత్సరంలో లెబనాన్ నుంచి అమెరికాకు వచ్చాడని అసిస్టెంట్ యూఎస్ అటార్నీ సామ్ అడెల్స్‌బర్గ్ కోర్టులో వాదనలు వినిపించారు. 


45 ఏళ్ల ఉగ్రవాది సనసందోహంలో సాధారణ అమెరికా పౌరుడి మాదిరిగా కనిపించేవాడు. రహదారుల సొరంగాలు, బ్రిడ్జీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే సమయంలో కూడా సాధారణ వ్యక్తిలానే ప్రవర్తించేవాడు. కానీ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాది అని కోర్టుకు అటార్నీ తెలిపారు. ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా తాను చేయాల్సిన పని మాని.. దిగువ న్యూయార్క్ కోర్ట్‌హౌస్‌, ఎఫ్‌బీఐ కార్యాలయాలు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, కెన్నడీ ఎయిర్‌పోర్ట్‌లను సర్వే చేశాడు. ఇరాన్‌ను అమెరికా హెచ్చరిస్తే ఇస్లామిక్ నెట్‌వర్క్ అమెరికన్లను అంతమొందించగలదని సందేశమివ్వడమే ఉగ్రవాది లక్ష్యంగా ఉంది. బోస్టన్, వాషింగ్టన్ డీసీ, ఇతర నగరాలను కూడా అలెక్సీ సాబ్ పరిశీలించాడు. బిల్డింగ్‌లను ఎలా నిర్మించారు. బాంబు అమర్చేందుకు ఏ గేటు ద్వారా లోపలికి ప్రవేశించాలనే అంశాలను దృష్టిలో ఉంచుకుని సర్వేలు చేశాడు. బాంబులు అమర్చే లోకేషన్‌తోపాటు ఏ సైజు బాంబులు అమర్చాలో కూడా పరిశీలించాడని వివరించారు. 


అయితే ఉగ్రవాది తరపున ఓ న్యాయవాది వాదనలు వినిపించారు. అలెక్సీకి ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. గతంలో పనిచేసిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం ఎలాంటి సంబంధాలు లేవని పేర్కొన్నారు. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల సమయంలోనే అలెక్సీ ఉగ్రవాద గ్రూపులో చేరాడు. ఆ తర్వాత అలాంటి కార్యకలాపాలేమీ చేపట్టలేదని పేర్కొన్నారు. కాగా  ఈ కేసులో అలెక్సీ సాబ్ దోషిగా తేలితే అమెరికా చట్టాల ప్రకారం కఠిన జైలుశిక్ష పడే అవకాశం ఉందని సమాచారం.

Updated Date - 2022-04-27T00:27:32+05:30 IST