100 రోజులు 442 కేసులు

ABN , First Publish Date - 2020-07-09T12:33:47+05:30 IST

మెతుకుసీమలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నది. తొలి కేసు నమోదయిన మార్చి 31 నుంచి 100 రోజుల్లో ఏకంగా 442 కేసులకు చేరుకున్నది.

100 రోజులు 442 కేసులు

ఉమ్మడి జిల్లాలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న కరోనా

మార్చి 31న తొలి కేసు నమోదు

73 రోజుల్లో 50కి చేరిన పాజిటివ్‌ల సంఖ్య

మరో 27 రోజుల్లో 392 కేసులు  

24 మందిని బలి తీసుకున్న కొవిడ్‌-19

సగానికి పైగా కేసులు సంగారెడ్డి జిల్లాలోనే

హైదరాబాద్‌ నుంచి వచ్చే వారితో 

మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో విస్తృతమవుతున్న కేసులు

కేసుల ఉధృతితో జిల్లా వాసుల్లో ఆందోళన 


మెతుకుసీమలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నది. తొలి కేసు నమోదయిన మార్చి 31 నుంచి 100 రోజుల్లో ఏకంగా 442 కేసులకు చేరుకున్నది. మొదటి కేసు నమోదయిన రోజు నుంచి అధికారులు, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొవిడ్‌ వ్యాప్తి జరగలేదు. మర్కజ్‌ వెళ్లొచ్చి కరోనా బారిన పడ్డవారు మినహా జిల్లాలో వేరే ఎవరికీ వ్యాధి సోకలేదు. లాక్‌డౌన్‌కు సడలింపులు  ఇచ్చిన మే 7 తర్వాత  బయటి నుంచి జనం రావడంతో ఒక్కటొక్కటిగా కేసులు పెరుగుతూ  వచ్చాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు 50కి పెరిగే వరకు 73 రోజులు పట్టింది. అంటే జూన్‌ 12 నాటికి మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కలిపి కరోనా పాజిటివ్‌ సంఖ్య హాఫ్‌ సెంచరీకి చేరుకుంది. మరో 27 రోజులు గడిచేసరికి.. అంటే జూలై 8 నాటికి  కేసుల సంఖ్య 442కు చేరుకున్నది.  సంగారెడ్డి జిల్లాలోనే సగానికి పైగా కేసులు ఉండడం ఆందోళనకు గురిచేస్తున్నది.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, సిద్దిపేట

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నది. పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తున్నది. మూడు జిల్లాల పరిధిలో మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 450కు చేరువైంది. ఇందులో సగానికిపైగా సంగారెడ్డి జిల్లా నుంచే కావడం కలవరపరుస్తున్నది. నిన్నమొన్నటి వరకు సేఫ్‌ జోన్‌లుగా ఉన్న మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లోనూ తీవ్రత పెరుగుతున్నది. 


ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తొలి కేసు నమోదయిన మార్చి 31 నుంచి 100 రోజుల్లోనే 450 మార్క్‌కి దగ్గరైంది. లాక్‌డౌన్‌ కఠినంగా ఉన్న సమయంలో వైరస్‌ వ్యాప్తి జరగలేదు. అయితే మే 7 నుంచి  మినహాయింపులు ఇవ్వడంతో మహమ్మారి కోరలు చాస్తున్నది. ఉమ్మడి జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు నుంచి 50 కేసులకు చే రేందుకు 73 రోజులు పట్టగా.. ఆ సంఖ్య వంద మార్క్‌ దాటేందుకు కేవలం ఐదు రోజులే తీసుకుంది. మరో 22 రోజుల్లో 440 దాటడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరవిహారం చేస్తున్న కొవిడ్‌ వైరస్‌.. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 229 మందికి సోకడం ఆ జిల్లాలో వ్యాప్తి ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టం చేస్తున్నది. 


సంగారెడ్డిలో డేంజర్‌ బెల్స్‌

సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలపై కరోనా పంజా విసురుతున్నది. నానాటికీ వైరస్‌ విజృంభిస్తున్నది. మారుమూల గ్రామాల్లోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మెదక్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌ వెళ్లి వచ్చాక.. టెస్టు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  మొదటి కేసు నుంచి 50 కేసుల వరకు 73 రోజులు పట్టింది. ఆ తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే వంద కేసులకు చేరడం కరోనా విజృంభణకు అద్దం పడుతున్నది. గత నెల రోజులుగా భారీ సంఖ్యలో కోవిడ్‌-19 నిర్ధారణ కేసులు వెలుగుచూస్తున్నాయి. కొన్ని చోట్ల చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్‌ రావడంతో మహమ్మారి బారిన పడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయడంతో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అంతరాష్ట్ర సరిహద్దులు మూసి వేయడం, రాకపోకలపై నిషేధం విధించడంతో కేసుల వ్యాప్తి జరగలేదు. మే 7 నుంచి విడతల వారీగా సడలింపులు, రాకపోకలకు అనుమతులివ్వడంతో కరోనా తీవ్రత పెరుగుతూ వస్తోంది. జూన్‌ 17 నాటికి ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య వంద దాటింది. ఇక జూన్‌ 17 నుంచి జూలై 8వ తేదీ నాటికి 442 నమోదు చేసింది. అంటే 27 రోజుల వ్యవధిలో 340కి పైగా పాజిటివ్‌ కేసులు రావడం వైరస్‌ ఏ రీతిన చెలరేగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 


జిల్లాల వారిగా పరిశీలిస్తే... కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉన్న హైదరాబాద్‌కు అత్యంత సమీపాన ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి.  సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాటికి 294 కేసులు నమోదయ్యాయి. ఆ జిల్లాలో 60 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరిగి 16 మంది మరణించారు. 218 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. మెదక్‌ జిల్లాలో 68 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వ్యాధి తీవ్రతతో ఐదుగురు మరణించారు. 12 మంది కోలుకోగా, మరో 51 మంది చికిత్స తీసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 80 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. 43 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 34 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ఈ రెండు జిల్లాల్లోనూ రెండు మూడు రోజుల్లో కేసుల సంఖ్య వంద దాటే సూచనలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2020-07-09T12:33:47+05:30 IST