2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-06-24T06:54:03+05:30 IST

భారత మీడియా, వినోద ఇండస్ట్రీ పరిమాణం 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సేవల సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది.

2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లు

ఈ ఏడాదిలో రూ.3.14 లక్షల కోట్లకు..

భారత మీడియా, వినోద మార్కెట్‌పై పీడబ్ల్యూసీ అంచనా

న్యూఢిల్లీ: భారత మీడియా, వినోద ఇండస్ట్రీ పరిమాణం 2026 నాటికి రూ.4.30 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సేవల సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇండస్ట్రీ ఏటేటా 8.8 శాతం సమ్మిళిత వృద్ధిని నమోదు చేసుకోనుందని గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నిలకడగా రాణిస్తోన్న సంప్రదాయ మీడియాతో పాటు డిజిటల్‌ మీడియా ఇంకా ఇంటర్నెట్‌, మొబైల్‌ ద్వారా ప్రకటనలు ఇండస్ట్రీ వృద్ధికి ప్రధానంగా దోహద పడనున్నాయని పీడబ్ల్యూసీ పేర్కొంది. 2022లో ఇండియన్‌ మీడియా, ఎంటర్‌టైన్మెంట్‌ మార్కెట్‌ సైజు 11.4 శాతం వృద్ధితో రూ.3.14 లక్షల కోట్లకు  చేరుకోవచ్చని అంచనా. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. 


టెలివిజన్‌: ఈ ఏడాదిలో టీవీ ప్రకటనల ఆదాయం రూ.35,270 కోట్లకు పెరగనుంది. వచ్చే నాలుగేళ్లలో (2026 నాటికి) 23.52 శాతం వృద్ధి చెంది రూ.43,000 కోట్లు దాటవచ్చని అంచనా. తద్వారా అమెరికా, జపాన్‌, చైనా, బ్రిటన్‌ల తర్వాత భారత్‌ ఐదో అతిపెద్ద టీవీ ప్రకటనల మార్కెట్‌గా అవతరించనుంది. 


ఓటీటీ: 2026 నాటికి భారత ఓటీటీ వీడియో స్ట్రీమింగ్‌ సేవల ఇండస్ట్రీ మార్కెట్‌ సైజు రూ.21,031 కోట్లకు చేరుకోవచ్చు. అందులో రూ.19,973 కోట్లు సబ్‌స్ర్కిప్షన్‌ రుసుము రూపంలో, మరో రూ.1,058 కో ట్లు వీడియో ఆన్‌ డిమాండ్‌ సేవల ద్వారా సమకూరే అవకాశం ఉంది. 


ఇంటర్నెట్‌: భారత ఇంటర్నెట్‌ ప్రకటనల మార్కెట్‌ 12.1 శాతం సమ్మిళిత వృద్ధితో 2026 నాటికి రూ.28,234 కోట్లకు చేరుకోనుంది. ఇంటర్నెట్‌ ప్రకటనల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ విభాగానిదే అధిక వాటా. 2021లో 60.1 శాతంగా ఉన్న ఈ వాటా 2026 నాటికి 69.3 శాతానికి చేరుకోవచ్చని అంచనా

మ్యూజిక్‌, రేడియో, పాడ్‌కాస్ట్‌: 2021లో 18 శాతం వృద్ధితో రూ.7,216 కోట్ల స్థాయికి చేరిన మ్యూజిక్‌, రేడియో, పాడ్‌కాస్ట్‌ ఇండస్ట్రీ.. ఏటేటా 9.8 శాతం సమ్మిళిత వృద్ధితో 2026 నాటికి రూ.11,536 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 

వీడియో గేమ్స్‌: భారత వీడియో గేమ్స్‌, ఈ-స్పోర్ట్స్‌ మార్కెట్‌ ఆదాయం వచ్చే నాలుగేళ్లలో రూ.37,535 కోట్లకు చేరుకోవచ్చని అంచ నా. ఈమార్కెట్‌ ఏటేటా 18.3 శాతం వృద్ధి చెందనుంది.   

సినిమా: వచ్చే నాలుగేళ్లలో భారత సినిమా పరిశ్రమ ఆదాయం రూ.16,198 కోట్లకు చేరుకోవచ్చు. అందులో రూ.15,849 కోట్లు బాక్సాఫీస్‌ వసూళ్ల ద్వారా, మరో రూ.349 కోట్లు ప్రకటనల ద్వారా సమకూరనుంది. గత ఏడాదికి గాను థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపరంగా చైనా, అమెరికా తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. 

దినపత్రికలు: 2021లో భారత దినపత్రికల ఆదాయం రూ.26,378 కోట్లుగా నమోదైంది. 2.7 శాతం చొప్పున వార్షిక వృద్ధితో 2026 నాటికి రూ.29,945 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. వచ్చే నాలుగేళ్లలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ను అధిగమించి ఐదో అతిపెద్ద న్యూస్‌పేపర్‌ మార్కెట్‌గా భారత్‌ అవతరించనుంది. 


2022-26 మధ్యకాలంలో నిలకడగా ఆదాయ వృద్ధిని నమోదు చేసుకోనున్న ఏకైక న్యూస్‌ పేపర్‌ మార్కెట్‌ మనదే. అంతేకాదు, ఈ కాలానికి కాపీల విక్రయాల్లో వృద్ధిని నమోదు చేసుకోనున్న ఏకైక దేశం కూడా మనదే. భారత్‌లో న్యూస్‌ పేపర్‌ రోజువారీ విక్రయాలు ఏటా 1.3 శాతం సమ్మిళిత వృద్ధితో 2026 నాటికి 13.9 కోట్ల కాపీలకు పెరగవచ్చని అంచనా. తద్వారా ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కాపీల విక్రయాల్లో మూడింట ఒకవంతు వాటా భారత్‌దే కానుంది. 2025 నాటికి దినపత్రికల రీడర్‌షిప్‌పరంగా చైనాను అధిగమించి అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ అవతరించనుంది. 

Updated Date - 2022-06-24T06:54:03+05:30 IST